ఎప్పుడూ లేనంత పోటీ ఈ సంక్రాంతికి. రెండు భారీ సినిమాలు. రెండు క్రేజీ ప్రాజెక్టులు. రెండు పాజిటివ్ బజ్ వున్న సినిమాలు. రెండు మాంచి కాంబినేషన్లు. ఒకటి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు. రెండు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో.
సరిలేరు కు మహేష్ కు అనిల్ రావిపూడి తోడయ్యారు. అల వైకుంఠపురములో సినిమా త్రివిక్రమ్ కు బన్నీ తోడయ్యారు. అంతా బాగానే రెండు సినిమాలు పోటా పోటీ పందెం కోడి పుంజుల్లా విడుదలయ్యాయి. ఒకటి పక్కా మాస్. మరోటి క్లాస్ ప్లస్ మాస్.
రెండు సినిమాలు బాగానే ఆడుతున్నాయి. ముందుగా విడుదలయిన అడ్వాంటేజ్ సరిలేరు ది, లెటుగా అయినా లేటెస్ట్ క్రేజ్ అల వైకుంఠపురములో సినిమాది. అంతవరకు బాగానే వుంది. కానీ 'సంక్రాంతి విన్నర్' అనే పాయింట్ ఒకటి బయల్దేరింది. మావే ఒరిజినల్ కలెక్షన్లు వాళ్లవి ఫేక్ అనే గొడవ ఒకటి స్టార్ట్ అయింది. ఇవన్నీ ఫ్యాన్స్ మధ్యన. ఇదంతా సోషల్ నెట్ వర్క్ లో. ఇలాంటి నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు నిర్మాత అనిల్ సుంకరతో 'గ్రేట్ ఆంధ్ర' ముచ్చటించింది. ఆ వివరాలు
నమస్కారం..ఫుల్ హ్యాపీగా వున్నారుగా
అవునండి
ఏంటి సర్..ఈ కలెక్షన్ల గొడవ ఏమిటి?
మొదటి నుంచీ చెప్పమంటారా?
ఆఫ్ ది రికార్డు కాదు, రాసినా మీకు ఓకె అన్నదే చెప్పండి
ఎక్కడా ఏమీ తప్పులేకుండా విత్ జిఎస్టీ అనే చెబుతున్నాం. పక్కాగా కాలుక్యులేట్ చేసి చెబుతున్నాం. 7వ రోజు కాకుండానే పోస్టర్ వేసాం. అయితే ఏడు రోజులు కలిపితే 100 కోట్లు.
కానీ ఏ ఏరియాకు ఆ ఏరియా విడిగా చెప్పకుండా ముద్ద అంకె వేసారు
ఇస్తాను. మీకు ప్రతి ఏరియా వివరంగా ఇస్తాను. ఆ పోస్టర్ వేసింది డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి కదా.
ఏ ఏరియా కు ఆ ఏరియా కార్డు వేయవచ్చు కదా.
మేం ఇస్తూనే వున్నాం. మీకు అందలేదేమో
కలెక్షన్లు ఎక్కడా ఫేక్ లేదు అని మీరు కచ్చితంగా చెప్పగలరా?
హండ్రెడ్ పర్సంట్. ఎక్కడా తేడా లేదు. కావాలంటే యుఎస్ చూడండి.
యుఎస్ వదిలేయండి. అక్కడ ఆన్ లైన్ టికెటింగ్..అంతా పక్కాగా వుంటుంది. కానీ మన దగ్గర మీకు, డిస్ట్రిబ్యూటర్ కు, ఎగ్జిబిటర్ కు తప్ప మరెవరికి పెర్ ఫెక్ట్ గా తెలియదు కదా.
నాకు వచ్చిన ఫిగర్లు మీకు పంపిస్తాను కదా
31 కోట్లకు నైజాం ఇచ్చేసారు. ఇప్పటికే 26 కోట్లు వచ్చేసింది అంటున్నారు. అంటే ఈ లెక్కన మాంచి లాభాలు రావాలి కదా
వస్తాయి. దిల్ రాజు గారికి మాంచి లాభాలు వస్తాయి. వైజాగ్-నైజాం కలిపి.
ఎన్ఆర్ఐ లెక్కన ఇచ్చారు కాబట్టి మీకు కూడా ఓవర్ ఫ్లోస్ బాగా వస్తాయేమో?
వస్తాయి. రాజుగారి దగ్గర నుంచి గట్టిగా వస్తాయి. నైజాం 35 కోట్లు చేస్తుంది అనుకుంటున్నాం.
ఈస్ట్ ఏరియా గుంటూరు కన్నా ఎక్కువ వుండడం ఏమిటి?
ఈస్ట్ యాజ్ ఈజ్ టీజ్ 6.40 రేటు కట్టి తీసుకున్నాం. కానీ ఇప్పుడు అక్కడ ముఫై కోట్ల గ్రాస్ కనిపించేలా వుంది.
ఒక క్లారిటీ ఇవ్వండి. ఈ కలెక్షన్లో ఫిక్స్ డ్ హయ్యర్లు కూడా వున్నాయా? లేవా?
వున్నాయి.
మరి రోజు వారీ కలెక్షన్లలో మళ్లీ ఆ లెక్కలు కూడా కలుస్తున్నాయా?
లేదు. అవి తీసేస్తాం. అందుకే మీకు గుంటూరు లో డైలీ తక్కువ, ఈస్ట్ లో ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే గుంటూరులో ఫిక్స్ డ్ హయ్యర్లు మొదటి రోజే కలిపేసాం. తరువాత అవి లెక్కలోకి రావు. కానీ ఈస్ట్ మా స్వంతం. మేము కాన్ఫిడెన్స్ తో ఎక్కడా ఫిక్స్ డ్ హయ్యర్లు ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు షేర్ కనిపిస్తోంది.
రెండు సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్ అయ్యాయి. రెండూ వంద కోట్లు దాటే సినిమాలే. ఇంక ఎందుకు ఈ ఫిగర్లు, కార్డులు, పోటీ? పైగా రెండు సినిమాల నిర్మాతలు. మీరు, చినబాబు ఇద్దరూ నాన్ కాంట్రావర్సీ జనాలు. మరెక్కడ వస్తోంది సమస్య?
పోటీ కాదు. డే వన్ నుంచి ఎందుకో తెలియదు కానీ, మేము పాట అనుకుంటే వాళ్లు ఏదో ఒకటి విడుదల చేయడం. మేము ఫంక్షన్ అనుకుంటే వాళ్లు పంక్షన్ అనుకోవడం. నిజానికి చిరంజీవి గారి కార్యక్రమం మూడు నెలలకు ముందే ఫిక్స్ అయింది.
మీరు అబ్జర్వ్ చేస్తే మేము ఎప్పుడూ ముందుగా దిగలేదు. తోలి రోజే వాళ్లు సంక్రాంతి విన్నర్ అన్నారు. ఎలా వుంటుంది మాకు చెప్పండి?
అంటే వాళ్లు విన్నర్ అనగానే మీరు ఫీల్ అవుతున్నారా?
పీల్ కావడం కాదు. వాళ్లకి వాళ్లు విన్నర్ అనగానే కామన్ మాన్ ఏమనుకుంటాడు? గ్రేట్ ఆంధ్ర ఫ్రంట్ పేజీలో వస్తుంది. అప్పుడు చూసి కామన్ మాన్ అదే నిజం అనుకుంటాడు కదా? అలా ఎందుకు చేయడం?
నైజాంలో అంత పెద్ద ఫిగర్ కనిపించడానికి కారణం?
డే వన్ నే బాగా షోలు పడడం, రేటు వల్ల తొలి రోజే 8 కోట్లకు పైగా వచ్చింది. అది ప్లస్ అయింది.
మహర్షి సినిమా ముఫై అయితే చేసింది అని నాకు తెలిసినంత వరకు నిజం.
లేదు. ముఫై రెండో ఎంతో చెప్పారు. కానీ 28 వరకే చేసిందని టాక్ వుంది.
అది నాకు తెలియదు. ముఫై అయితే చేసింది అని నాకు తెలుసు.
ఈ సంగతి అలా వుంచితే ఎప్పుడూ ఈ ఫిగర్లు, ఫేక్ అంటూ ట్రోలింగ్, ఇవన్నీ లేవు. ఇప్పుడు కొత్తగా మొదలైనట్లుంది.
అంటే బిగినింగ్ నుంచీ పోటీగానే వుంది. మేము కావాలని సాంగ్స్ వేయకుండా టీజర్ వేసి, ఆ తరువాత పాటలకు వెళ్లాం. కొన్ని కొన్ని వుంటాయి. విన్నర్ అనగానే మేం ఫీల్ అవుతాం కదా?అప్పటికీ చాలా ఓపిగ్గా వున్నాం.
కంపారిజన్ అని కాదు కానీ, రెండు సినిమాలు దేనికి అవే అనుకోవాలా? ఎక్కువ..తక్కువ చూడాలా? పోల్చుకోవాల్సిన అవసరం వుందా?
ఎవరి సినిమా వారికి గొప్పది. నా సినిమాలు, అంటే నా దూకుడు సినిమాతో నేను పోల్చుకుంటా. వేరే సినిమాలతో పోల్చుకోను.
ఇంతకీ ఓవర్ సీస్ లో ఎక్కడ దెబ్బతిన్నారు.
క్లాస్..మాస్ సినిమా అన్న తేడా..త్రివిక్రమ్ ఫ్యాక్టర్. ఆయనకు అక్కడ ఎడ్జ్ వుంది. అ..అ సినిమానే రెండు మిలియన్ల పైన చేసింది. మేము 2 మిలియన్లు వస్తే చాలు అనుకున్నాం. నా స్వంతంగా విడుదల చేసుకున్నాను. నిజానికి ఈ సినిమా కాకుంటే మూడు మిలియన్లు చేసేది.
మహేష్ బాబు తొలిసారి ఓవర్ సీస్ లో దెబ్బతిన్నారేమో?
దెబ్బతినడం కాదు. రాజమౌళి సినిమా వస్తే వేరే వాళ్ల సినిమా కు కాస్త ఇబ్బందే కదా.
అంటే ఆ సినిమా లేకుంటే మీ సినిమాకు ఓవర్ సీస్ లో మరింత ఎక్కువ వచ్చి వుండేదా?
కచ్చితంగా.
అదే ఫ్యాక్టర్, అంటే సోలో విడుదల అయి వుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కలెక్షన్లు వచ్చి వుండేవా?
అంత ఎక్కువ తేడా వుంటుందనుకోను. మహా అయితే ఏరియాకు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వుండేదేమో? జనం రెండూ చూద్దాం అని డిసైడ్ అయ్యారు. అది వాస్తవం.
ఫ్యాన్స్ లెవెల్ లో ఫైట్ ఎక్కువ అంటారా? హీరోల లెవెల్లో ఫైట్ అంటారా?
ఏ లెవెల్ లోనూ ఫైట్ లేదు?
మరి రెండు మూడు రోజులు సైలంట్ గా వుండి, వున్నట్లుండి 100 కోట్ల పోస్టర్ మీరు వేసారు. ఆ తరువాత వాళ్లు వేసారు.
నాకు దమ్ముంది. నా సినిమా వసూలు చేసింది వేసాను. వాళ్ల ఫిగర్లు నాకు తెలియదు. రేపు సాయంత్రానికి ఈస్ట్ లో నా సినిమా బాహుబలి వన్ ను క్రాస్ చేస్తుంది. కావాలంటే వచ్చి చూసుకోండి.
ఇంతకీ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి మాకు ఫిగర్స్ ఇవ్వగలరా?
తప్పకుండా మీరు మా సిబ్బందిని అడగండి ఇస్తారు. తీసుకోండి.
ఎకె నుంచి వచ్చిన ఫిగర్లు (విత్ జిఎస్టీ) తొలి వారం
నైజాం………………..26.5
సీడెడ్………………..12.1
వైజాగ్………………..11.9
ఈస్ట్…………………..8.20
వెస్ట్…………………..6.30
కృష్ణ…………………..6,87
గుంటూరు……………8.16
నెల్లూరు………………3.20