నగరి ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటి రోజాను మరో నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. ఇటీవల రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా పాల్గొంటున్న దివ్యవాణి సీఎం జగన్ మొదలుకుని వైసీపీ నేతలందరినీ హెచ్చరిస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రోజా రాజధానిలో ఆడవాళ్లను ముందు పెట్టి మగవాళ్లు దాక్కున్నారని విమర్శించారు. అంతేకాకుండా రాజధానిలో ఉద్యమించే దమ్ము, మగతనం వారికి లేదా అని ప్రశ్నించారు. మహిళలను రోడ్లపైకి పంపి వారిని పోలీసులు కొట్టారనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
రోజా విమర్శలపై దివ్యవాణి ఫైర్ అయ్యారు. రోజా మాట్లాడే ముందు తన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు. మగతనాల గురించి రోజా మాట్లాడొద్దని, తాము కూడా ఆమెలా మాట్లాడగలమని, అయితే సంస్కారం అడ్డొస్తోందన్నారు. మొత్తానికి పెద్దవాళ్లపై విమర్శలు చేయడం ద్వారా పాపులారిటీ సంపాదించుకోవచ్చని దివ్యవాణి బాగా పసిగట్టి…ఆ పంథాలో నడుస్తున్నారని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.