అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడుతారోననే ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కార్ నిర్ణయానికి చంద్రబాబు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా మద్దతు తెలుపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వారు చెప్పే కారణాలు కూడా సహేతుకంగా ఉన్నాయి. 2014లో అసెంబ్లీలో రాజధాని ప్రకటన సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఏ సెంటిమెంట్‌తో నోరు కట్టేశారో, ఇప్పుడు బాబు విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తుందని అంటున్నారు.
2014, సెప్టెంబర్‌లో రాజధానిపై ప్రకటన, చర్చ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని విజయవాడ చుట్టు పక్కల ఉంటుందని ప్రకటించాడు. ఆ తర్వాత దానిపై అభిప్రాయం చెప్పాలంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ను బాబు కోరాడు. దీనిపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
రాజధానిపై ప్రకటన చేసిన తర్వాత ఇక అభిప్రాయం చెప్పేదేముందని, చర్చ జరిగిన తర్వాత ప్రకటించి ఉంటే బాగుండేదని నాటి ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టాడు. రాజధానిపై ఆయన మాట్లాడేందుకు అంగీకరించలేదు. అంతేకాదు ఒకప్పుడు రాజధాని ఎంపిక, ప్రకటన సందర్భంలో అసెంబ్లీలో ఐదురోజుల పాటు చర్చ జరిగిందని, కానీ బాబు సర్కార్ పూర్తిగా అప్రజాస్వామిక విధానాలతో వ్యవహిరిస్తోందని దుయ్యబట్టాడు. అయినా బాబు సర్కార్ వినిపించుకోలేదు. విజయవాడలో రాజధాని పెడుతున్నామని, దీనిపై కేవలం YES or NO మాత్రమే చెప్పాలని పాలక పక్షం డిమాండ్ చేసింది.
ప్రస్తుతానికి వస్తే ఈ నెల 20న ఏపీ అసెంబ్లీలో రాజధానిపై కీలక ప్రకటన వెలువడనుంది. జగన్ సర్కార్ కూడా అమరావతిలో శాసన, విశాఖలో పరిపాలన, కర్నూల్‌లో న్యాయ రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించామని, దీనిపై YES or NO మాత్రమే ముందు చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబును అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి తలెత్తితే మాత్రం జగన్ సర్కార్ నియంతృత్వంతో వ్యవహరిస్తోందని, అప్రజాస్వామిక విధానాలకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించి చంద్రబాబు బయటకు వస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే చంద్రబాబు YES అంటే ఇంతకాలం చేసిందంతా ఉత్త పొలిటల్ స్టంట్ అని ప్రజల్లో చులకన అవుతాడు. ఒక వేళ NO అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా విలన్‌గా నిలిచిపోతాడు. అందులోనూ ఆ రెండు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఆకాంక్షలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సాక్షిగా రికార్డులకెక్కుతాడు. అందుకే చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి తప్పించుకోడానికే మూడు రాజధానుల నిర్ణయానికి ప్రత్యక్షంగా అనుకూలమని చెప్పడం లేదా బాయ్‌కాట్ చేసి పరోక్షంగా తన అంగీకారాన్ని తెలుపుతారని రాజకీయ విశ్లేషకులు బల్ల గుద్ది మరీ చెబుతన్నారు. ఆంగ్ల మాధ్యమంపై గత అసెంబ్లీలో బాబు మద్దతు ప్రకటించడాన్ని ఉదహరిస్తున్నారు.