మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు చెర్రీ మరోసారి అభిమానులను అలరించనున్నారా? అంటే టాలీవుడ్ అవుననే సమాధానం ఇస్తోంది. గతంలో ‘మగధీర’లో చెర్రీ కథానాయకుడిగా హిట్ సాధించినచిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో అదరగొట్టారు. ఆ తర్వాత చిరు రీఎంట్రీ చేసిన ‘ఖైదీ నంబర్ 150’వ చిత్రంలో ఓ పాటలో రామ్‌చరణ్ డ్యాన్స్‌తో రఫ్ ఆడించాడు. తండ్రీకొడుకుల కాంబినేషన్ చిత్రాలు కలిసి వస్తుండటంతో ముచ్చటగా మూడో చిత్రంలో వారిద్దరు కనిపించనున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కేవలం మూడు నెలల్లో సినిమా పూర్తి చేయాలనే పట్టుదలతో యూనిట్ అంతా కష్టపడుతోంది. ఈ సినిమాలో చిరుకు జంటగా త్రిష నటిస్తున్నారు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక రోల్ పోషించనున్నట్టు సినిమా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా కోసం చెర్రీ 15 రోజుల కాల్షీట్స్ కూడా ఇచ్చారని సమాచారం. ఏప్రిల్ నుంచి మగధీరుడు షూటింగ్‌లో పాల్గొననున్నాడని తెలిసింది. అయితే చరణ్ నటించడంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ చరణ్ నటించడంపై మాత్రం అనధికారికంగా ఓ సమాచారం తెలుగు సినీ సర్కిల్స్‌లో ముమ్మరంగా ప్రచారం అవుతోంది.