రాజ‌ధానిపై చేతులెత్తేసిన బీజేపీ

‘రాజ‌ధాని అంగుళం కూడా క‌ద‌ల‌దు. కేంద్రం చూస్తూ ఊరుకోదు’ అని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ నేత‌లు హెచ్చ‌రిస్తూ మాట్లాడిన మాట‌లివి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నేత‌ల మాట‌లు ముఖ్యంగా రాజ‌ధాని రైతుల‌కు కొంత…

‘రాజ‌ధాని అంగుళం కూడా క‌ద‌ల‌దు. కేంద్రం చూస్తూ ఊరుకోదు’ అని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ నేత‌లు హెచ్చ‌రిస్తూ మాట్లాడిన మాట‌లివి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నేత‌ల మాట‌లు ముఖ్యంగా రాజ‌ధాని రైతుల‌కు కొంత ఊర‌ట‌, ధైర్యాన్ని ఇచ్చాయ‌ని చెప్పొచ్చు. అందులోనూ కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడే చెబుతున్నామ‌ని మ‌రీ ఢంకా మోగిస్తూ ఘాటుగా మాట్లాడటంతో ‘నిజ‌మే’ ఉండొచ్చ‌ని అంతా న‌మ్మారు.

ఎవ‌రైతే జ‌గ‌న్ స‌ర్కార్‌ను హెచ్చ‌రిస్తూ, బెదిరిస్తూ మాట్లాడారో, వారే కేంద్ర ప్ర‌భుత్వం చేతుల్లో ఏమీ లేద‌ని , సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంలో మార్పు వ‌స్తే త‌ప్ప రాజ‌ధాని మార్పును అడ్డుకోవ‌డం ఎవ‌రి త‌రం కాద‌ని ప‌రోక్షంగా తేల్చి చెప్పారు. ఇటీవ‌ల బీజేపీ నేత‌ల వైఖ‌రిలో వ‌చ్చిన మార్పు గురించి మాట్లాడుకుందాం.

రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్‌ను కేంద్రం సాకు చూపి బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి బాగా బెదిరించే య‌త్నం చేశాడు. అంగుళం కూడా అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని క‌ద‌ల‌ద‌ని మొట్ట‌మొద‌ట హెచ్చ‌రించింది ఆయ‌నే. ఆ నేతే మూడు రోజుల క్రితం సీఎం జ‌గ‌న్‌కు ఓ ప్రేమ లేఖ రాశాడు. అయ్యా సీఎం గారూ రాజ‌ధాని మార్పుపై పునఃస‌మీక్షించుకోవాల‌ని కోరాడు. ఒక‌వేళ మార్పు చేస్తే రైతుల‌కు క‌ట్టాల్సిన సొమ్మును లెక్క‌లేసి చెప్పాడు. అన్నీ తెలిసి బెదిరింపుల‌కు దిగ‌డం, జ‌గ‌న్ స‌ర్కార్ వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో వేడుకోళ్ల‌కు దిగ‌డం ఒక్క సుజ‌నాచౌద‌రికే చెల్లింది.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క‌ల‌సి గురువారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ జ‌గ‌న్ రాజ‌ధానిని ఏక‌ప‌క్షంగా మారుస్తానంటే ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌శ్నించాడు. బీజేపీ -జ‌న‌సేన ఉమ్మ‌డి పోరాటంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తాయ‌ని ప్ర‌క‌టించాడు. ఈ నెల 20న రాజ‌ధాని మార్పుపై జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకోనుంద‌ని, స‌మ‌యం లేద‌ని, మీ వైఖ‌రి ఏంట‌ని విలేక‌రులు రెండు మూడు సార్లు ఒత్తిడి చేసి ప్ర‌శ్నించారు.

ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఏం జ‌రిగింది?  పోల‌వ‌రం అంశంలో సీఎం అనుకున్న‌ట్టే జ‌రిగిందా? అసెంబ్లీలో బ‌లం ఒక్క‌టే స‌రిపోదని, అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటం చేస్తామ‌ని, అమ‌రావ‌తి మాత్రం క‌ద‌ల‌ద‌ని క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ స్ప‌ష్టం చేశాడు.

క‌న్నా మాట‌ల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే….ఎక్క‌డా కేంద్రం అడ్డుకుంటుంద‌ని చెప్ప‌లేదు. అంతేకాదు ఉమ్మ‌డి పోరాటంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్తామ‌ని, అవ‌స‌ర‌మైతే న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారే త‌ప్ప కేంద్రం జోక్యాన్ని మాట మాత్రం కూడా ప్ర‌స్తావించ‌లేదు. దీన్నిబ‌ట్టి రాజ‌ధాని అంశంపై కేంద్రం నుంచి రాష్ట్ర బీజేపీకి స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌చ్చాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌జా ఉద్య‌మాల‌కు త‌లొగ్గి లేదా న్యాయ‌స్థానాలు నిలుపుద‌ల చేస్తే త‌ప్ప రాజ‌ధాని మార్పును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని బీజేపీ నేత‌ల మాట‌లు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. అంటే రాజ‌ధానిపై కేంద్రంలోని అధికార బీజేపీ చేతులెత్తేసిన‌ట్టే!