…'ఆడుతున్న నాటకం ఆపేసి- పెట్టుకున్న గడ్డం కుళ్లాయీ లాగేసి- ఆడియన్సులో కలిసిపోయాడు విదూషకుడు
నిన్నటి వాగ్దానాన్ని నేటి ఉపన్యాసంలో కాల్చేసి-నేటి ఫోర్జరీని రేపటి సంతకంగా మార్చేసి-ఇక్కడే వుండు వొస్తానని ఎక్కడికో పోయాడు వి-నాయకుడు'….
శ్రీశ్రీ ''బొమ్మలాంతరు' (1953)
ఎప్పుడెప్పుడా అని చూస్తున్న బిజెపి-జనసేన పొత్తు ఖరారైంది. పవన్ తన ఉపన్యాసాల ద్వారా జనాల్ని ఎంత గందరగోళ పరుద్దామని చూస్తూ వచ్చినా, 'ఈయన బిజెపి స్కూలుకి చెందిన మనిషే' అని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. (అదే మాట యివాళ పవన్ కన్‌ఫమ్ చేశారు, తమ మధ్య మధ్యలో కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా తనెప్పుడూ బిజెపితో సఖ్యంగానే ఉన్నానని) 2014 ఎన్నికలలో బిజెపితో చేతులు కలిపాడు. మోదీకి గౌరవం యిచ్చి, పుచ్చుకున్నాడు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నపుడు 'పాచి లడ్డూలు' లాటి వ్యాఖ్యలు ఒకటి రెండు చేసినా, హోదా రాకపోవడానికి ప్రతిపక్షంలో ఉన్న వైసిపిదే తప్పన్నాడు, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నందుకు టిడిపిది తప్పన్నాడు. ఆంధ్రకు సహాయం చేయలేదని కోట్లాది ఆంధ్రులు మోదీని తిట్టుకుంటున్నా, తను మాత్రం పెద్దగా ఏమీ అనలేదు. ఇటీవల అమిత్ షాను కూడా ఆకాశానికి ఎత్తివేశాడు కూడా.
బిజెపి సానుభూతిపరుడే అయితే 2019 ఎన్నికలలో అదంటే పడని వామపక్షాలతో, బియస్పీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లు అనే ప్రశ్న రావడం సహజం. షె గువియేరా పేరు మాటిమాటికీ వల్లిస్తున్నందుకు, గడ్డం పెంచినందుకు ఓ సారైనా వాళ్లతో చేతులు కలపాలనుకున్నాడేమో మరి! అదేమీ కలిసి రాలేదు, వామపక్షాల ఓట్లు (అవంటూ ఉన్నాయాని సందేహం) తమకు రాలేదని పవన్ సణుగుడు. కులరహిత సమాజం కావాలంటూనే కులం ప్రాతిపదికగా ఏర్పడిన బియస్పీతో పొత్తెందుకు అంటే వైసిపికి వెళ్లే దళిత ఓటును చీల్చడానికి అనుకున్నారు. ఏమైతేనేం, ఆ పొత్తు ఓట్లు, సీట్లు ఏమీ రాల్చలేదు. అందుకే యిప్పుడు పవన్ 'నేనేమైనా వామపక్షాలకు బాకీ పడ్డానా?' అని అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో పవన్‌కు అనుకూలంగా మాట్లాడిన వామపక్ష టీవీ చర్చల వ్యాఖ్యాతలు యిప్పుడు నాలుక ఎలా మడతేస్తారో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది.
ఏది ఏమైనా సిద్ధాంతపరంగా చుక్కెదురుగా ఉండే బిజెపి-వామపక్షాలతో రెండిటితోనూ చేతులు కలిపిన పవన్‌లో అంతర్గతంగా ఉండే సైద్ధాంతిక వైరుధ్యం, గందరగోళం మరో మారు బయటపడింది. ఆ మాట కొస్తే చంద్రబాబు యిలాటి విన్యాసాలు చాలా సార్లు చేశారు. కానీ ఆయనలో సిద్ధాంతాల మీమాంస లేదు. కేవలం రాజకీయమే ఉంది. ప్రతిపక్షంలో ఉండగా వారి అండ కావాలి. అధికారంలోకి వచ్చాక అక్కరలేదు. అంత స్పష్టత ఉంది. 2014లో అధికారంలోకి వచ్చాక బిజెపితో అంటకాగిన రోజుల్లో కూడా తన కాబినెట్‌లో మంత్రులను తన అదుపులోనే ఉంచున్నారు.
పవన్ అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎక్కడా అధికారం అక్కరలేదన్నారు. తెలంగాణలో పోటీయే చేయనక్కర లేదన్నారు. ఆంధ్రలో యీయన కులస్తులు ఎక్కువ మంది ఉన్నారని, జగన్‌ను ఓడించడానికి యీయన బలం కూడా కావలసి వస్తుందని బాబు అంచనా వేసి, బిజెపితో స్నేహం కల్పించి, పొత్తు కుదిర్చారు. లేకపోతే కాంగ్రెసు కేంద్రమంత్రిగా కూడా చేసిన చిరంజీవి సోదరుణ్ని బిజెపి అంత దగ్గరకు రానిచ్చేది కాదు. టిడిపి-బిజెపి పొత్తు కొనసాగినంత కాలం పవన్‌కు చింత లేకపోయింది. బాబు తలచుకున్నపుడల్లా ఆంధ్రలో ప్రత్యక్షమై జనంలో ఉండగా ఓ మాట, బాబుతో సమావేశమై వచ్చిన తర్వాత ప్రెస్‌మీట్‌లో మరో మాట మాట్లాడుతూ కాలక్షేపం చేసేశారు.
'ప్రశ్నిస్తా' అనే ఆయన ఊతపదం హాస్యాస్పదంగా మారిపోయింది. అధికారంలో ఉన్నవారిని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవారినే ప్రశ్నించారు అనడం కంటె విమర్శించారు అనడమే సబబు. టిడిపి-బిజెపిల మధ్య చెడిన తర్వాత అసలు సమస్య ఎదురైంది. పవన్ ఆలోచనాధోరణి బట్టి ఆయన బిజెపితో పొత్తు పెట్టుకుంటాడని, మూడో కూటమిగా ఎదుగుతాడని అనుకున్నారు. అది జరిగితే ముక్కోణపు పోటీలో ఓట్లు చీలతాయని అంచనాలు వేశారు. అందుకే ఆ పొత్తు జరగకుండా బాబు జాగ్రత్తపడ్డారు. పవన్‌తో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా వైసిపికి పోతుందని భయపడ్డారు. పెట్టుకోకపోయినా అటే పోయింది.
పవన్ తనకూ మేలు చేసుకోలేక పోయారు, బాబుకి చేయలేకపోయారు. బొటాబొటీ సీట్లు వస్తే పవన్‌తో భాగస్వామ్యం పెట్టుకుని అధికారానికి వద్దామనుకున్న బాబుకి ఆ శ్రమ లేకుండా స్పష్టమైన తీర్పు యిచ్చారు ఓటర్లు. టిడిపికి సీట్లు రాకపోయినా గణనీయంగా ఓట్లు పడ్డాయి. పవన్‌కు అదీ లేదు. అభిమానులు తప్ప వేరెవరూ ఆయన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆటల్లో అరటిపండు అనుకున్నారు. నిలబడిన రెండు చోట్లా కంగు తినడం పవన్‌కు మింగుడు పడలేదు. తన ఓటమికి కారణం కార్యకర్తలే అన్నారు, డబ్బన్నారు, మద్యం అన్నారు. మరోటన్నారు. పార్టీ నిర్మాణం లేదు మొర్రో అని నాయకులు, కార్యకర్తలు చెపుతూ వచ్చినా తను ఆ దిశగా ఏమీ చేయలేదనే ఆత్మాలోకనం చేసుకున్నారో లేదో తెలియదు కానీ బహిరంగంగా ఒప్పుకోలేదు.
వార్డు స్థాయిదాకా పార్టీ నిర్మాణం ఉండాలి, సంస్థాగతమైన ఎన్నికలు జరిపి ప్రజల్లో ఎవరికి పలుకుబడి ఉందో తేల్చుకుని వారికి టిక్కెట్లు యివ్వాలి అని బయటివాళ్లు సలహాలివ్వడం సులభమే కానీ అది మాటలతో జరిగే వ్యవహారం కాదు. దానికి కార్యదక్షత, ముందుచూపు, ప్రణాళిక, సమయం, ఓర్పు, ఓపిక యిలా బోల్డు ఉండాలి. ముఖ్యంగా డబ్బు పుష్కలంగా ఉండాలి. జేబులోంచే డబ్బు పెడదామంటే ఎంత డబ్బూ చాలదు. కార్యకర్తల్లో, గ్రామస్థాయి నాయకుల్లో యీ పార్టీ నెగ్గుతుంది, దీనిలో మన శ్రమ, ధనం పెట్టుబడి పెడిితే యివాళ కాకపోయినా రేపైనా ఫలితాలు కనబడతాయి అనే నమ్మకం కలగాలి. సినిమా నటులు పెట్టే పార్టీలను ప్రజలు నమ్మడం కాస్త కష్టమైన పని. కర్ణాటక, కేరళలలో సినిమా నటులు పెట్టిన, పెట్టబోయిన పార్టీలకు ఆదరణ రాలేదు.
తమిళనాడు వ్యవహారం వేరు. అక్కడ నాటకాలు, సినిమాలు, రాజకీయాలు పెనవేసుకుని ఉంటాయి. తొలి రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. మన తెలుగునాట సినీనటులు రాజకీయాల్లోకి వచ్చినా ఏదో ఒక నియోజకవర్గంలో ప్రతినిథులుగానే ఎన్నికయ్యారు తప్ప పార్టీ పెట్టే సాహసం చేయలేదు – ఎన్టీయార్ వచ్చేవరకూ! ఎన్టీయార్ విజయం సాధించడానికి ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. ఆయన వెనుక రాజకీయగణం, ప్రజాదరణ పొందిన పత్రిక, పారిశ్రామికవేత్తలు, మేధోబృందం, కులబలం, ధనబలం – అనేకం తోడయ్యాయి. ఎన్టీయార్ వస్తూనే ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి, ఆయనంత పాప్యులారిటీ ఉన్న నేను మాత్రం ఎందుకు కాలేను అనుకుంటూ చిరంజీవి దిగారు కానీ పైన చెప్పిన అంశాలేవీ తోడురాక పరిమిత విజయం సాధించారు.
అప్పటిదాకా ప్రజాజీవితంలోకి రాని చిరంజీవికి అన్ని ఓట్లు, సీట్లు వచ్చాయంటే గొప్పే, తమిళనాట విజయకాంత్‌లా సొంత పార్టీని మేన్‌టేన్ చేస్తూ ఉంటే తృతీయశక్తిగా పదేళ్లకైనా ఎదిగేవారేమో! కానీ ఆయనకు ఓపిక లేకపోయింది. ఇటు వైయస్సార్, అటు బాబు మధ్య తనకు స్పేస్ లేదని, ఎప్పటికో అప్పటికి తగు సంఖ్యలో సీట్లు వచ్చినా ఆలోగా పార్టీ నడపడానికి జేబులోంచి డబ్బు ఖఱ్చు పెట్టడం దండగమారి వ్యవహారమని అనుకున్నారు. మరో పక్క సినిమారంగం కన్ను గిలుపుతోంది. తను తప్పుకోవడంతో తన స్థానాన్ని తక్కినవాళ్లు భర్తీ చేసేస్తున్నారనే దుగ్ధ బయలుదేరింది. సినిమాల్లో అయితే సంపాదించుకోవచ్చు, యిక్కడ వదుల్చుకోవడం తప్ప రాలేదేమీ లేదు. అందుకే పార్టీని పట్టుకెళ్లి కాంగ్రెసు గంగలో అస్తినిమజ్జనం చేసేశారు. తను కేంద్రమంత్రి పదవి అనుభవించారు. పార్టీ అధికారం పోగొట్టుకున్నాక పట్టించుకోవడం మానేశారు.
ఇదంతా ప్రజలు గమనించారని చిరంజీవికి అనుయాయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కు తెలుసు. అయినా సాహసం చేశారు. తను ఓ సీరియస్ పొలిటీషియన్‌ని, తన కంటూ ప్రత్యేకమైన ఆలోచనాధోరణి ఉంది, విస్తారపుస్తకపఠనం వలన ప్రపంచంలో అనేక విషయాలపై పరిజ్ఞానం సంపాదించిన మేధస్సు ఉంది అని ప్రొజెక్టు చేసుకున్నారు. సమాజంలో మార్పు కోసమే తప్ప అధికార లాలసతో తను రాజకీయాల్లోకి రావటం లేదని ప్రజల్ని ప్రభావితం చేశారు. కానీ 2014-19 మధ్య ఆయన చూపిన ద్వైదీభావం వలన ప్రజలు ఆయనను నమ్మలేదు. నాకు కులభావన లేదని ఆయన చెప్పినా, తక్కిన కులాలు నమ్మలేదు, ఆయన కులమూ నమ్మలేదు. కింగో, కనీసం కింగ్‌మేకరో అవుతారనుకున్న వ్యక్తి సోదిలోకి లేకుండా పోయారు. ఎందుకంటే పవన్ వెనుక ఏ పారిశ్రామికవేత్త, ఏ వ్యాపారస్తుడు, ఏ మీడియా మోతుబరి లేడు. పబ్లిక్ మీటింగులలో అభిమానుల కోలాహలం తప్ప, ఆ తర్వాత దాన్ని ఓట్లగా తర్జుమా చేసి పెట్టేవాళ్లు ఎవరూ లేరు.
ఫలితాల తర్వాత ఆయన ఆలోచనలో పడ్డాడు. పాతికేళ్లు పట్టినా ఫర్వాలేదు రాజకీయాల్లో కొనసాగుతా అని పైకి చెపుతున్నా, అంతర్మథనం ప్రారంభమైంది. నేను యిక్కడ వుండవలసినవాణ్నా? ఉండి ఏం చేస్తాను? అనే సందేహం పుట్టింది. జగన్ పాప్యులారిటీ హరించిపోవడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది. అప్పుడైనా జగన్ వ్యతిరేక ఓటు తనకు వస్తుందన్న నమ్మకం లేదు. రూకబలం, మూకబలం, కులబలం, మీడియాబలం మెండుగా ఉన్న బాబుకే పోతుంది. తను బాబుకి పక్కవాయిద్యగాడిగా ఉండాలి తప్ప ప్రధాన పాత్రధారి కాలేడు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి, రాజకీయాల్లోంచి విరమించుకునే ముందు లోకేశ్‌కు సీటు అప్పగించాలనే కసి ఉన్న బాబు తనను వాడుకోవడమే తప్ప, పిలిచి పీట వేయరని తెలుసు. పదేళ్ల రాజకీయజీవితం తర్వాత ఏ ఉపముఖ్యమంత్రి పదవో ఒప్పుకుంటే అభిమానులు హర్షించరనీ తెలుసు. మరి యిక్కడ ఉండి సాధించేది ఏముంది, ఆ ఉద్యమం, యీ ఉద్యమం అంటూ కాలక్షేపం చేయడం తప్ప!
ఎంత ఒళ్లు విరుచుకున్నా యిక్కడ అంబ పలికేట్లు లేదు. అటు సినిమారంగంలో తన కింకా మార్కెట్టు ఉంది. ఆలస్యం చేసిన కొద్దీ కుర్రహీరోలు దాన్ని తన్నుకుపోతారు. ఇప్పటికే తన సాంకేతికగణం వేరే చోట్ల కుదురుకున్నారు. ఎప్పటికైనా నాలుగు డబ్బులు ఆర్జించేది అక్కడే. ఇక్కడ అతిథి నటుడి పాత్రేే! ఎన్నికలు వచ్చేవరకూ తలచుకునేవాడు ఉండడు. 2019 ఎన్నికల ఫలితం చూశాక, ఏ వర్గంలోనూ పలుకుబడి లేదని స్పష్టమయ్యాక, యిక పేరంటానికి పిలిచేవాడు ఎవడు? సినిమా నటుడి జీవితం అన్నీ వడ్డించిన విస్తరి లాటిది. నిర్మాత, దర్శకుడు, రచయిత, సాంకేతిక నిపుణులు, సాటి తారాగణం అందరూ కలిసి సాయం పట్టగా రథం కదులుతుంది. సీటులో హీరోగారు కూర్చుని ఊరేగితే చాలు, ఘనతంతా అతని ఖాతాలోకి పోతుంది. సొంత పార్టీ పెడితే అన్నీ తనే చూసుకోవాలి. అమర్చినదానిలో అత్తగారు వేలు వేసింది అన్నట్టుంటే కుదరదు. విస్తరి దగ్గర్నుంచి ఆధరువుల దాకా అన్నీ వెతుక్కోవాలి. ఇవన్నీ యీయన చేత కావని గ్రహించిన జనసేన నాయకులందరూ పార్టీ వదిలి వెళ్లిపోసాగారు.
పవన్‌కు పార్టీ నడపడంలో ఆసక్తి పోయిందని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేయకపోవడంతోనే తెలిసిపోయింది. ఎదుగుదామనుకున్న ఏ పార్టీ యిలాటి అవకాశం వదులుకోదు. ఎకాయెకీ ముఖ్యమంత్రి కావడం అరుదు. ఇలాటి ఎన్నికలలో పోటీ చేసినపుడే పార్టీ యంత్రాంగం, నాయకగణం తయారవుతాయి. తెలంగాణలో బలం లేదు, గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒకటే, ఆంధ్రలోనే మన తడాఖా చూపించాలి అనుకుంటే ఆంధ్రలో రాబోతున్న స్థానిక ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే, పార్టీకి ఎక్కడ బలం ఉందో, ఎక్కడ లేదో, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి జనామోదం ఉందో లేదో తెలిసేది. ఆ బలం తెలియడం వలన పొత్తు కోసం బిజెపితో చేసే బేరసారాల్లో స్వరం పెరగడమో, తరగడమో జరిగేది.
కానీ పవన్ అప్పటిదాకా కూడా చూడకుండా అస్త్రసన్యాసం చేసేశారు. జనసేన బోగీని బిజెపి ఇంజనుకు తగిలించేసి హైదరాబాదుకు చెక్కేద్దామనుకున్నారు. బిజెపితో పొత్తు కోసం దిల్లీ వెళితే మోదీ, షాలను కలవలేక పోయారు. జాతీయ అధ్యక్షుడిగా యిప్పటిదాకా ప్రకటింపబడని (20న ప్రకటిస్తారని వార్త, పవన్ అప్పటిదాకా ఆగలేకపోయారు) నడ్డాని కలవగలిగారు. బిజెపికి యిటీవల భాగస్వాములు తగ్గుతున్నారు, కొందరు తోక ఝాడిస్తున్నారు. అలాటప్పుడు కొత్త పార్టీ ఎన్‌డిఏలో చేరుతోందంటే పెద్ద నాయకులు ఎదురేగి స్వాగతం పలకాల్సింది, అదీ జరగలేదు. చిరంజీవి విషయంలోనూ రాహుల్ గాంధీ హైదరాబాదు వచ్చి బహిరంగసభలో కండువా కప్పుతారనుకుంటే, చిరంజీవినే అక్కడకు రమ్మనమని గదిలో కండువా కప్పారు.
ఇవాళ తృతీయస్థాయి బిజెపి నాయకులు ఆంధ్రకు వచ్చి చర్చలు జరిపారు. సమావేశానంతరం యిద్దరం కలిసి వైసిపిని ఎదిరిస్తామని, ఎన్నికలలో పోటీ చేస్తామనీ ప్రకటించారు. 2019 ఎన్నికలలో వచ్చిన ఓటింగు శాతం బట్టి చూస్తే జోగీ, జోగీ.. సామెత గుర్తుకు వస్తుంది. కానీ పరిస్థితి ఎప్పుడూ ఒకేలాగ ఉండదు. పొంగవచ్చు, కృంగవచ్చు. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో బిజెపికి కాస్తోకూస్తో బలం ఉంది తప్ప, ఆంధ్రలో బొత్తిగా లేదు. ఆ మేరకు బాబు, వెంకయ్యనాయుడు జాగ్రత్తలు తీసుకున్నారు. దేశమంతా బిజెపికి ఉన్న బలం ఆరెస్సెస్ బలగం, బూత్ స్థాయి వరకు ఉన్న వాలంటీర్ల దళం. అవి ఉన్న నియోజకవర్గం ఆంధ్రలో ఒక్కటీ కానరాదు. ఉన్నదల్లా కాంగ్రెసు, టిడిపిల నుంచి వచ్చి చేరిన నాయకులు. ఆరెస్సెస్‌లో పుట్టి పెరిగిన వారంటే బిజెపి అధిష్టానానికి ఉన్న నమ్మకం వీరిపై ఉండదు. అందుకే ఆంధ్రలో పార్టీ ఎదుగుదలపై ఉదాసీనంగా ఉన్నారు.
తమ శత్రువైన బాబుని అదుపుచేయడానికి జగన్ ఉన్నాడు కదా అని బిజెపి ధీమా! సోనియా ఉన్నంతకాలం జగన్ కాంగ్రెసులో చేరడం కల్ల. కానీ బాబు విషయంలో ఆ గ్యారంటీ లేదు. ఎప్పుడైనా ఎవరితోనైనా చేతులు కలపగలరు. తమకు సొంత బలం చేకూరేలోపున తన ప్రధాన శత్రువైన కాంగ్రెసును నిలవరించగల జగన్‌ను అర్జంటుగా పదవి దింపేద్దామనే ఆరాటం బిజెపికి లేదు. అలాగే కేంద్రంలో ఎవరున్నా వాళ్లతో పేచీ పెట్టుకునే ధైర్యం జగన్‌కు లేదు. గతంలో అలాటి దుస్సాహసం చేసి జైలుకి వెళ్లడం ఆయనకు గుర్తుంది. కేంద్రంలో ఉన్న పార్టీ తలచుకుంటే కేవలం ఆరోపణలున్నా జైలుకి పంపగలదు, విచారణ పూర్తి కాకుండానే బయటకు తీసుకురానూ గలదు అని బోధపడింది. అందుకే బిజెపివారు ఎలాటి దారుణమైన బిల్లు పెట్టినా జగన్ సమర్థిస్తున్నాడు.
ఇలాటి పరిస్థితిలో బిజెపి ఆంధ్రలో ఏ మేరకు శక్తియుక్తులు వినియోగిస్తుందో, అవి ఏ మేరకు సఫలమవుతాయో చెప్పలేం. ఏదైనా చేసినా, మానినా బిజెపియే చేయాలంతే. రేపు స్థానిక ఎన్నికలలో యీ కూటమికి కొన్ని స్థానాలు వస్తే అది బిజెపి ఘనతగానే అనుకోవాలి. ఎందుకంటే పవన్ యాక్టివ్‌గా లేరంటే ఆయన అభిమానులకు హుషారు ఎక్కణ్నుంచి వస్తుంది? మన హీరో ముఖ్యమంత్రి అవుతాడంటే ఆ కిక్కు వేరు. ఆయన కాకుండా ఆయన స్నేహితుడెవరో అవుతాట్ట అంటే వాళ్లెందుకు ఓట్లేేస్తారు? పవన్ పక్షాన్నుంచి తగినన్ని ఓట్లు రాకపోతే ఎందుకొచ్చిన పొత్తు యిది? కావాలంటే మీరూ మా పార్టీలో చేరిపోండి అని బిజెపి జనసేన నాయకులకు చెప్పవచ్చు. పవన్ పెద్దగా అందుబాటులో ఉండరు కాబట్టి డైరక్టుగా బిజెపిలో చేరితే పోలేదా అని వారూ అనుకోవచ్చు.
ఏది ఎలా ఉంటుందో యిప్పుడే చెప్పలేం కానీ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది మిణుకుమిణుకు మంటూ ఉంటుందో, ఓ ముహూర్తాన గప్పుమని ఆరిపోతుందో వేచి చూడాలి. పవన్ సినిమాల ద్వారా తన గతప్రాభవం మళ్లీ తెచ్చుకుని, ఎన్నికల సమయం వచ్చేసరికి, మళ్లీ చురుగ్గా వ్యవహరించి, సొంతంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదిగేట్లా ఉంటే బాగానే ఉంటుంది కానీ అలాటి ట్విస్టులు సినిమాల్లోనే సాధ్యం. పవన్ రాబోయే సినిమాలు రాజకీయచైతన్యంతో, యిలాటి థీమ్స్‌తో ఉండి ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తాయేమో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)
[email protected]