ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు శుభశకునాలు మొదలయ్యాయా? జనం గాలి మళ్లుతోందా? ఈ గాలి మళ్లడం అనేది సమస్తము చంద్రబాబు నాయుడు కృషి ఫలితమేనా? లేదా, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేజేతులా జనం మనోభిప్రాయాలను పచ్చగాలి దిశగా మళ్ళిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
మూడు పట్టభద్రుల నియోజకవర్గాలను తమ ఊహకే అందని రీతిగా.. తెలుగుదేశం సొంతం చేసుకోవడం.. అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ని కూడా గెలిపించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయాలు. అనంతమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి ఇది సాధారణ భంగపాటు కానే కాదు. ఇలాంటి సందర్భాలలోనే “రాజకీయాలలో హత్యలు ఉండవు.. అన్నీ ఆత్మహత్యలు మాత్రమే” అనే నానుడి గుర్తుకొస్తుంది. వర్తమాన రాజకీయ పరిస్థితులపై ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ఇది.
ఇదంతా చంద్రబాబునాయుడుకు అనాయాసంగా దక్కిన ఫలితం. చదువుకున్న ఓటర్లు చంద్రబాబును తెలుగుదేశాన్ని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్న సంగతి అర్థమైంది. 108 నియోజకవర్గాల పరిధిలో వచ్చిన మెజారిటీని తృణీకరించడానికి వీల్లేదు. అసలే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీలనివ్వ కూడదనే ఉద్దేశంతో జనసేన, తెలుగుదేశం మిలాఖత్ అవుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంతో కలిసే అవకాశం లేదు గనుక.. ఈ కూటమికి వామపక్ష పార్టీలు మద్దతిచ్చే అవకాశమూ ఉంది. లేదా వారితో పొత్తుల్లోకి దిగి ఒకటిరెండు సీట్లు పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ లెక్కన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ కు వచ్చిన ఓట్లను కూడా సార్వత్రిక ఎన్నికల కోణంలో తెలుగుదేశం ఓట్లుగానే పరిగణించాల్సి ఉంటుంది. అవి వైసీపీకి ప్రమాదకరమైన గణాంకాలు. ఆశ్చర్యకరమైన గణాంకాలు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కోటా ఎన్నికలు మరో తమాషా. అధికార పార్టీ అభ్యర్థుల కంటె తెలుగుదేశానికి ఒక ఓటు ఎక్కువ వచ్చింది. అధికార పార్టీని కాదనుకున్న నలుగురి వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోయేది లేదని, చాలా కాలం ముందుగానే వారికి స్పష్టంగా చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి అతి విశ్వాసమే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చు.
కానీ.. పాలకపక్షం టికెట్ ఇవ్వకపోయినంత మాత్రాన వదలిపోవాలనే అభిప్రాయం, వదలిపోయినా తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదనే ధీమా వారిలో ఏ రకంగా ఏర్పడ్డాయనేది గమనించాలి. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉంటారు. వారికి తెలుగుదేశం పట్ల ప్రజల్లో సానుకూల పవనాలు వీస్తున్నట్టుగా అనిపిస్తోందా? అని సీరియస్ గా గమనించాలి.
రాజధాని అస్పష్టత..
అమరావతి అనే రాజధానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయిష్టత ఉండొచ్చు. అయినంత మాత్రాన రాష్ట్రానికి అసలు రాజధాని ఏమిటి? అంటే సమాధానం చెప్పలేని స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టివేయడానికి ఆయనకు హక్కులేదు. ఈ పరిస్థితి ప్రజలకు చాలా చికాకు కలిగించింది.
అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు పలికినా, విశాఖ మీద వ్యామోహం అని ప్రత్యర్థులు అన్నా.. అభివ్యక్తీకరణలు ఏమైనా కావొచ్చు గాక.. కానీ ‘ఏది రాజధాని’ అనే సంగతిని జగన్ త్వరితగతిన తేల్చి ఉండాల్సింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. తర్వాత ఖచ్చితంగా దిద్దుకోవాల్సి వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక అనేక పొరపాటు /తప్పుడు నిర్ణయాలలో రాజధాని అనే పదాన్ని సందిగ్ధం లోకి నెట్టడం కూడా ఒకటి!
వైసీపీ అంత చెత్తగా చేస్తోందా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు తొలిసారిగా దక్కిన సీఎం అవకాశాన్ని పదిలపరచుకోవడానికి, అదుకోసం పేదల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవడానికి సంక్షేమ పథకాలను విపరీతంగా అమలు చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం చేసినవి, చేయనివి కూడా ఆయన ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలోని పేదల్లో, వారు ఏ కులానికి చెందిన వారైనా సరే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారంటూ ఎవరైనా ఉన్నారనడం అబద్ధం. అంతగా పథకాలు అందుతున్నాయి.
మరో రకంగా చెప్పాలంటే.. ఈ సంక్షేమ పథకాలు మాత్రమే తనను మళ్లీ గెలిపిస్తాయని జగన్ అనుకుంటున్నారు. ఎంత బలంగా అనుకుంటున్నారంటే.. ఎమ్మెల్యేల పనితీరు గాడితప్పిపోయినా కూడా ఆయన పట్టించుకోవడం లేదు. గాడితప్పిన ఎమ్మెల్యేలను ఈసారి అభ్యర్థులుగా తప్పిస్తే చాలు. ప్రజలు తన పార్టీని అదే నమ్మకంతో గెలిపిస్తారు అనేది ఆయన అభిప్రాయం. కానీ అది పొరబాటు అని తేలుతోంది.
వైసీపీ పథకాలు మరీ అంత చెత్తగా ఉన్నాయా? అవి ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆదరణను పెంచలేకపోతున్నాయా? అనే మీమాంస ప్రజల్లో ఏర్పడడం సహజం.
ప్రచారం కరవు..
ప్రభుత్వం చేస్తున్న మంచికి సంబంధించి కేవలం పత్రికల్లో, టీవీల్లో డబ్బు వెదజల్లి చేసే ప్రచారం మాత్రం సరిపోదు. వాటి గురించి ప్రజలు నిత్యం మాట్లాడుకునే వాతావరణం ఏర్పడాలి. అది కేవలం నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అది పార్టీలో ఏమాత్రం జరగడం లేదు.
ముఖ్యంగా రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నా గాని, ప్రచారం లేదు. సంక్షేమం కి ఇచ్చినంత ప్రచారం అభివృద్ధికి ఇవ్వటంలేదు. పార్టీ నాయకులు కూడా అభివృద్ధి గురించి ప్రెస్ మీట్లో మాట్లాడటంలేదు. కేవలం ప్రెస్ మీట్లు సరిపోవు. నాయకులు ప్రతి దశలోనూ ప్రజలతో మమేకం అయి ఉండాలి.
నిజానికి జగన్మోహన్ రెడ్డి గడపగడపకు రూపంలో గానీ, గృహ సారధుల రూపంలో గానీ చేసిన ప్రయత్నం అదే. నాయకులు కార్యకర్తలు నిత్యం క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అయిఉండడం మాత్రమే ఆయన లక్ష్యం. కానీ.. ఆ ప్రయత్నాన్ని స్థానిక నాయకులు మొక్కుబడిగా మార్చేశారు. నిజం చెప్పాలంటే పార్టీకి ఆదరణ గురించి, ప్రజల్లో పార్టీ చేస్తున్న మంచి నిత్యం నానడం గురించి వారు మనస్ఫూర్తిగా పట్టించుకోవడం లేదు.
ఎందుకింత విముఖత!
ప్రతిపక్షాల వారు పాలకపక్షం పట్ల, జగన్ పట్ల ద్వేషం పెంచుకోవడంలో వింత లేదు. జగన్ ప్రభుత్వంలో మరింత పదిలంగా పాదుగొంటే.. తమ భవిష్యత్తు మొత్తం సమాధి అయిపోతుందని తెలుగుదేశం భయపడడం వింత కాదు. జనసేనకు అంత సీన్ లేకపోయినప్పటికీ.. జగన్ అంటే ఉండే అకారణ ద్వేషానికి, అర్థం కూడా తెలియని ప్రజాప్రయోజనాలు ద్రోహాలు లాంటి పదాలు ముడిపెట్టి విలపిస్తూ ఉండే జనసేన బాధ అర్థం లేనిదే అయినా.. తెలుగుదేశం కోసం వారి ఏడుపు అని అర్థం చేసుకోవచ్చు. కానీ.. సొంత పార్టీ నాయకులు కూడా పార్టీకోసం పాటుపడకపోతే ఎలా? ఎందుకు అలా జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
పార్టీ కోసం పదేళ్లు కష్టపడి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకున్న పార్టీ నాయకులకు బిల్లులు కూడా సక్రమంగా రావడం లేదు. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసే వాడు ఏ పార్టీ వాడైనా సరే.. అప్పో సొప్పో చేసి పనులు చేస్తారు. కోటికంటె తక్కువ విలువైనా కాంట్రాక్టులు చేసి ఎవ్వరి పరిస్థితి అయినా అంతే. వారికి కూడా బిల్లులు రావడంలేదు. బిల్లులు ఆలస్యం అయ్యే కొద్దీ వారికి చేసిన అప్పులకు వడ్డీలు కూడా గిట్టుబాటు కావు.
తెలుగుదేశం హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంలో.. వారంతా తెలుగుదేశం వాళ్లనే ద్వేషం ప్రభుత్వానికి ఉన్నదని అనుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో పనులుచేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రాకపోతే ఎలా? అలాంటి వారు పార్టీకోసం ప్రజల్లో తిరుగుతూ పనిచేయడంపై ఎంతమేర శ్రద్ధ, సమయం పెట్టగలరు? ఈ అంశాలన్నీ కూడా ఆలోచించాలి. అసలు బిల్లులు జాప్యం కావడం ద్వారా.. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ లో ఒక విముఖత ఏర్పడేలా పార్టీలోనే అంతర్గతంగా ఒక కుట్ర జరిగిందా అనే అభిప్రాయం కూడా పలువురిలో ఏర్పడుతోంది.
సలహాదారుల పాత్ర ఏమిటి?
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. జగన్మోహన్ రెడ్డి ఆశ్రిత జన పక్షపాతి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మౌలిక లక్షణం కూడా అదే. అయితే ఆశ్రిత జనుల కోసం ఏం మేలు చేయాలి? ఎలా చేయాలి? అనే విషయంలో తండ్రీ కొడుకుల తీరు పూర్తిగా భిన్నమైనది. జగన్ తన ఆశ్రితులందరికీ ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టేయాలనుకున్నారు. వివాదంగా మారి, కోర్టు సముఖానికి చేరి, దేశమందరి దృష్టిని కూడా ఆకర్షించే స్థాయికి ఆయన సలహాదారుల నియామకం అనే వ్యవహారాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు. దేశంలో ఈ ప్రభుత్వానికి ఉన్నంత మంది సలహాదారులు మరెక్కడా ఉండరు. ఈ సలహాదారులందరూ ఏం చేస్తున్నారు.
ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతోందా అనే అభిప్రాయం అనేకమందిలో వ్యక్తం అవుతోంది. కనీసం ఈ సంగతిని గుర్తించలేని సలహాదారులు ఉండి ఎవరికి ప్రయోజనం. వారి కంచిగరుడ సేవలు ఎవరికి కావాలి. సలహాదారులు ప్రభుత్వం సొమ్మును మేస్తూ కూర్చోవడం మాత్రమే కాకుండా.. హోదాను అనుభవిస్తూ బతకడం మాత్రమే కాకుండా.. ఈ పార్టీ భవిష్యత్తు కూడా ముఖ్యమే అనే ఆలోచనతో అసలు ఉన్నారా? అనే అనుమానం పార్టీ కార్యకర్తల్లోనే కలుగుతోంది.
చంద్రబాబు అదృష్టం ఇదంతా!
ఒకసారి ఓడిన తన పార్టీని తర్వాతి సారి అధికారంలోకి తీసుకురావడానికి ఏ పార్టీ అధినేత అయినా శక్తివంచన లేకుండా కష్టపడతాడు. చంద్రబాబునాయుడు కూడా అలాగే కష్టపడుతున్నారు. కానీ ప్రస్తుత ఫలితాలను గమనించిన తర్వాత.. ఆయనకు దక్కిన ఫలం చేసిన కష్టం కంటె ఎక్కువ అనిపిస్తోంది. మరి ఎలా సాధ్యమైంది. ఇదంతా చంద్రబాబునాయుడు అదృష్టం మాత్రమే. పైగా వైసీపీ వారి పనుల వలన దక్కుతున్న అనాయాస ఫలం.
అయితే చంద్రబాబునాయుడు రాజకీయాల్లో సీనియర్ కాబట్టి.. ప్రజల్లో మారుతున్న ట్రెండ్ ను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, వైసీపీ నాయకుల్లో బీజమాత్రంగా మొదలవుతున్న అసంతృప్తిని మహా వృక్షంలాగా పెంచి పోషించడానికి కష్టపడుతూ వచ్చారు. తెలుగుదేశం పట్ల విముఖంగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు వివిధ కారణాల చేత పాలకపక్షం పంచన చేరారు. కానీ చంద్రబాబునాయుడు చాపకింద నీరులా వర్కవుట్ చేసి.. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఇప్పటికి తన జట్టులోకి లాక్కోగలిగారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా కూడా ఆశ్చర్యం లేదు.
ముఖ్యమంత్రి జగన్ బాధ్యత ఎంత..?
పార్టీకి ఎమ్మెల్యేలు కూడా దూరం అయిపోతున్నారంటే.. వారంతా ద్రోహులు అని ముద్ర వేసి ఊరుకుంటే సరిపోదు. కించిత్తు అయినా ఆత్మపరిశీలన అవసరం. ఆ పని వైసీపీ చేస్తోందా అనేది అనుమానం. వెళ్లిపోయే వారిలో డైరక్టుగా సీఎం జగన్ తీరు మీదనే ఆరోపణలు చేస్తున్న వారు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు కూడా సీఎం కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరనేది ఒక పెద్ద ఆరోపణ. సొంత వారిని కలవడానికి, తన జట్టులోని వారిని కలవడానికి కూడా సమయం లేనంతగా ముఖ్యమంత్రి ఏం చేస్తుంటారనేది ఎవ్వరికైనా ఎదురయ్యే ప్రశ్నే.
అదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఏ కీలక పరిణామాలు జరిగినా, రాజకీయ ఉపద్రవాలు జరిగినా.. సాధారణంగా మరెక్కడైనా సరే సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన… ప్రజల్లో కలిగే భయాలను, అనుమానాలను, విస్తరించేర అపోహలను తొలగించే ప్రయత్నం చేయాల్సిన ఏ సందర్భంలో ఆయన నేరుగా కనిపించరు. ఆయన తరఫున మరెవ్వరైనా మాట్లాడుతుంటారు.
చాలా చోట్ల కేబినెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత.. మీడియాకు బ్రీఫ్ చేసే బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకుంటూ ఉంటారు. కానీ సీఎం జగన్ కు అలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి ఖాళీ ఉండదు. మరి ఆయన ఏం చేస్తుంటారు? కనీసం తన సొంత పార్టీ ఎందుకు గాడితప్పిపోతున్నదో ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా? అలా చేసుకోవడం అంటే.. తన వ్యక్తిత్వాన్ని తన పనితీరును తనే స్వయంగా మదింపు చేసుకోవడమే.
తెలుగుదేశానికి అనుకూల పవనాలు వీస్తున్నాయని ఈ రెండు రకాలు ఎన్నికలు చెబుతున్నాయి. అదంతా ఉత్తుత్తిదేనని అధికార పార్టీ చెబుతుంది. వారే నిజం కావచ్చు. కేవలం మాటలు చెబితే సరిపోదు. ఆ విషయాన్ని నిరూపించాలి. నిరూపించడానికి సార్వత్రిక ఎన్నికలు ఒక్కటే మార్గం. ఈలోగా బోలెడంత ఆత్మపరిశీలన జరగాలని గుర్తించాలి.
.. ఎల్ విజయలక్ష్మి