మహేష్-బన్నీ మధ్య ‘బాహుబలి’ పోటీ

మొన్నటివరకు పోస్టర్లతో పోటీపడ్డారు. ఒకరు సంక్రాంతి విన్నర్ అని వేయించుకుంటే, మరొకరు రియల్ సంక్రాంతి విన్నర్ అని వేయించుకున్నారు. ఆ తర్వాత వసూళ్లతో పోటీపడ్డారు. ఒకరేమో వంద కోట్ల గ్రాస్ వేసుకుంటే, మరొకరు రియల్…

మొన్నటివరకు పోస్టర్లతో పోటీపడ్డారు. ఒకరు సంక్రాంతి విన్నర్ అని వేయించుకుంటే, మరొకరు రియల్ సంక్రాంతి విన్నర్ అని వేయించుకున్నారు. ఆ తర్వాత వసూళ్లతో పోటీపడ్డారు. ఒకరేమో వంద కోట్ల గ్రాస్ వేసుకుంటే, మరొకరు రియల్ కలెక్షన్స్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేసుకున్నారు. ఇప్పుడు బన్నీ-మహేష్ మధ్య బాహుబలి పోటీ మొదలైంది.

నిన్న బన్నీ టీమ్ నుంచి ఓ పోస్టర్ బయటకొచ్చింది. అల వైకుంఠపురములో సినిమా విడుదలైన 3 రోజుల్లో చాలా చోట్ల నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిందంటూ ఏకంగా పోస్టర్ రిలీజ్ చేశారు.ఇది వచ్చిన వెంటనే మహేష్ యూనిట్ కూడా అలెర్ట్ అయింది. వెంటనే అక్కడ్నుంచి కూడా ఓ వార్త బయటకొచ్చేసింది. 5 రోజుల వసూళ్లలో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిందట.

నిన్నటితో 5 రోజుల రన్ పూర్తిచేసుకుంది సరిలేరు నీకెవ్వరు. ఈ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు సినిమాకు 68 కోట్ల 22 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు. ఏరియా వైజ్ బ్రేకప్ కూడా రిలీజ్ చేశారు. ఇదే క్రమంలో నైజాం, నెల్లూరుతో పాటు మరికొన్ని చోట్ల ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులు సృష్టించినట్టు చెప్పుకొచ్చారు. 

ఇక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి, తమ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్-ఈవెన్ అయినట్టు ప్రకటించారు. ఈస్ట్, వెస్ట్ తో పాటు మరికొన్ని ఏరియాస్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా బ్రేక్-ఈవెన్ అయిందని, వీకెండ్ నాటికి అన్ని ఏరియాలు లాభాల బాట పడతాయని మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు బన్నీ టీం కూడా అలెర్ట్ అయింది. మరికొన్ని గంటల్లో వీళ్లు కూడా బ్రేక్-ఈవెన్ గురించి చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇలా బన్నీ-మహేష్ ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఇంతకీ వీళ్లిద్దరి సినిమాలకు వచ్చిన అసలైన వసూళ్లు ఎంత అనే విషయం ఆ దేవుడికే తెలియాలి. అన్నట్టు.. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం వెంకీని రంగంలోకి దించారు. ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు బన్నీ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాడు. చిరంజీవిని రంగంలోకి దించుతారేమో.