ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ నే ట్రోలింగ్ స్టార్ అనుకుంటున్నారంతా. అయితే 'అంతకు మించి' అని నిరూపించుకున్నారు నాగబాబు. నాగబాబు వీడియో పోస్ట్ చేసినా, ట్వీట్ చేసినా అది విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతోంది. జనసేన పరాజయం తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పవన్ కల్యాణే సీజన్డ్ పొలిటీషియన్ అనుకుంటే.. మరింత అన్ సీజన్డ్ గా రాజకీయాల గురించి మాట్లాడుతూ విమర్శలకు గురవుతున్నారు నాగబాబు. తాజాగా ఆయన వైసీపీపై చేసిన 'ఉసురు' ట్వీట్ మరింత వైరల్ గా మారింది.
రైతులంటే వైసీపీకి చులకన అని, వారి ఉసురు పోసుకోవడం వల్లే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీపై దెబ్బపడిందని, అందరికీ అలాంటి శాస్తే జరుగుతుందని ట్వీటారు. అయితే ఈ ట్వీట్ కి పృథ్వీని వ్యతిరేకిస్తూ కామెంట్లు రాకపోగా.. నాగబాబునే చెడుగుడు ఆడుకున్నారంతా. పృథ్వీ తప్పుచేసి, జగన్ ఆగ్రహానికి గురయ్యారని.. అంతేకాని ఉసురు తగలడం ఏంటని రియాక్ట్ అయ్యారంతా.
మరి ప్రజారాజ్యం పేరుతో కార్యకర్తల ఉసురు పోసుకున్న చిరంజీవికి ఏం జరగాలని ప్రశ్నించారు మరికొందరు. ఢిల్లీలో మీ తమ్ముడు బీజేపీ కాళ్లు పట్టుకున్నారు, ముందు ఆ సంగతి చెప్పండని ఇంకొంతమంది తగులుకున్నారు. జనసేన డ్రామా అయిపోయింది కదా, మళ్లీ జబర్దస్త్ ట్రై చేసుకో, మల్లెమాల వాళ్లకి బీజేపీ నుంచి రికమండేషన్ చేయించుకోమంటూ మరికొంతమంది సలహాలిచ్చారు.
మొత్తమ్మీద నాగబాబుని మాత్రం విమర్శలతో కడిగిపడేశారు. పృథ్వీ పేరు చెప్పి వైసీపీని టార్గెట్ చేయాలని చూసి చివరికి తానే నెటిజన్లకు టార్గెట్ అయ్యారు మెగా బ్రదర్. గతంలో కూడా ఈయన వెటకారానికి పెట్టిన ట్వీట్లు చివరకు ఆయనకే రివర్స్ కొట్టాయి. విజయసాయిరెడ్డిని వేలెత్తి చూపించాలనుకుని, తన ఫ్యామిలీ హీరోలను తానే తిట్టించారు నాగబాబు. జబర్దస్త్ ని తక్కువచేసి మాట్లాడి తనకి హుందాతనం లేదని నిరూపించుకున్నారు.
ఇప్పటివరకూ తన ట్వీట్లతో అడ్డంగా బుక్కైపోయే నారా లోకేష్ ని ఒక్క దెబ్బతో క్రాస్ చేశారు నాగబాబు. మెగా ట్రోలింగ్ స్టార్ గా మారిపోయారు.