అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా నాయకులు అంటున్నారు. అప్పట్లో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది గనుక.. లబ్ధి పొందడం కోసం అలాంటి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. వందల ఎకరాలు తెదేపా వారి బినామీ భూములుగా ఉన్నాయనేది కూడా వైకాపా ఆరోపణ. అయితే దీనికి సవాలుగా విచారణ జరిపించుకోమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పదేపదే అంటున్నారు. మరి ఆ పనిచేయకుండా జగన్ సర్కారు ఎందుకు సందేహిస్తున్నట్టు?
చంద్రబాబునాయుడు సహా ఆయన బినామీలు అనేక మంది అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనే వ్యవహారంతో సంబంధం లేకపోయినప్పటికీ.. ఈ ప్రాంతం నుంచి రాజధానిని తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విపక్షాలు మాత్రం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనుమానాలతోనే రాజధాని తరలిస్తున్నారంటూ నానాయాగీ ప్రారంభించాయి.
ఒకవైపు జగన్ అనుచరులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు తెదేపా వారు విచారణ కు సిద్ధం అంటూ సవాళ్లు విసురుతున్నారు. తెదేపా నాయకులు ఎవరెవరి పేరుతో బినామీలుగా భూములు కొన్నారో ఆ వివరాలు కూడా వైకాపా మంత్రులు.. ఒక విడత బయటపెట్టారు. అయినప్పటికీ అటువైపునుంచి సవాళ్లు వస్తూనే ఉన్నాయి.
ప్రభుత్వం వైకాపా చేతిలోనే ఉన్నది గనుక అవసరమైతే సీబీఐ విచారణ చేయించుకోవచ్చునని చంద్రబాబునాయుడు పలుమార్లు సవాలు విసిరారు. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నేత సుజనా చౌదరి కూడా.. విచారణ జరిపించుకోమని సవాలు విసురుతున్నారు. వారందరూ ఇన్ని సవాళ్లు విసురుతోంటే.. వైకాపా ప్రభుత్వం ఎందుకు మిన్నకుంటున్నట్టు?
నిజానికి తప్పు జరిగిందని భావిస్తే విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి. అంతే తప్ప.. యథాలాపంగా బురద చల్లి ఊరుకోవాల్సిన అవసరం వైకాపాకు లేదు. అలా ఊరుకుంటే.. వారి ఆరోపణలకు దానివల్ల వారి విమర్శలకు కూడా విలువ పడిపోతుంది.