జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తన భారాన్ని దించేసుకున్నారు. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేశారు. ఇటీవలి కాలంలో పవన్ వీరహిందుత్వ వాదిలా మాట్లాడినప్పుడే.. అది బీజేపీలోకి విలీనం అయ్యే ప్రయత్నం అని స్పష్టం అయ్యింది. ఆ అంచనాలు ఏ మాత్రం తప్పకుండా.. పవన్ వెళ్లి బీజేపీ ముఖ్యనేతలతో ములాఖత్ అయ్యారు. రోజుల తరబడి వెయిట్ చేసి మరీ ఒప్పందం చేసుకుని వచ్చారు. ఇక నుంచి జనసేన-బీజేపీ అన్ని ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు. త్వరలోనే ఒక ప్రకటన కూడా చేస్తారట!
మరి జనసేన గుర్తు మీద పోటీ చేస్తారా, బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తారో చూడాలి. బీజేపీ గుర్తు మీదే అంటే.. విలీనం పూర్తి అయినట్టే. అలా పవన్ కల్యాణ్ రాజకీయం కంచికి చేరినట్టే. అయితే అదే జరిగితే పవన్ తనకు తోచింది మాట్లాడటానికి ఉండకపోవచ్చు. ఏం మాట్లాడినా.. అది బీజేపీ నుంచి వచ్చే డైరెక్షన్స్ ను బట్టి మాట్లాడాల్సి ఉంటుంది.
అలాగే తన పార్టనర్ చంద్రబాబు విషయంలో పవన్ ఇక నుంచి వ్యవహరించే తీరు కూడా బీజేపీ ఆదేశాలకు అనుగుణంగానే ఉండాలి. తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎలా డీల్ చేయాలనుకుంటున్నది ప్రస్తుతానికి ఒక రహస్యమే. ఆ విషయంలో కమలం పార్టీ కూడా గుంభనంగా ఉంది. టీడీపీ నుంచి ఎవరు వచ్చినా వారిని బీజేపీ చేర్చుకుంటూ ఉంది. ఇక బీజేపీతో సయోధ్య కోసం చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలూ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు రాజకీయంలో ఒక పచ్చి అవకాశవాది. ఇది వరకూ ఆ విషయం అనేక సార్లు రుజువు అయ్యింది. కాంగ్రెస్ తోనే చేతులు కలిపిన చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీతో చేతులు కలపడం పెద్ద కథ కాదు. అయితే మోడీ, షాలు మాత్రం ఇప్పటి వరకూ చంద్రబాబును దూరంగానే పెడుతున్న వైనం స్పష్టం అవుతూ ఉంది.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏపీ వరకే పరిమితం కాకుండా.. మహారాష్ట్ర వరకూ వెళ్లి, ఢిల్లీ వరకూ వెళ్లి చాలా కథ నడిపించే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఏపీ వరకే చంద్రబాబు ఆగిపోయి ఉంటే.. ఇప్పుడు మోడీ, షాలు చంద్రబాబును దగ్గరకు తీసుకునే వాళ్లేనేమో. అయితే రాహుల్ ఇంట్లో ఉండి చంద్రబాబు రచ్చ చేశారాయె. కాబట్టి.. వాళ్లు చంద్రబాబును ఇప్పుడు నమ్మే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. చంద్రబాబును ఒక అవకాశవాదిగానే వారు చూస్తున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో ఇక పవన్ కల్యాణ్ ఎంతసేపూ చంద్రబాబు అజెండాకు అనుకూలంగా స్పందించేందుకు అవకాశం ఉండదు. బీజేపీ అజెండాకు అనుకూలంగా మాత్రమే పవన్ స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి.. చంద్రబాబు విషయంలో బీజేపీ ఏదో ఒకటి తేల్చే వరకూ పవన్ కూడా తన పార్టనర్ కు కొంచెం ఎడంగా ఉండాల్సి ఉంటుందేమో!