బీజేపీ ఎంపీగా సుజనా చౌదరిని పిలవడం బహుశా ఆయనకే ఇబ్బందిగా ఉంటుందేమో. ఎందుకంటే ఆయనది తెలుగుదేశంతో చెరిగిపోని అనుబంధం. సుజనా అనగానే టీడీపీ అనే మరో మూడు అక్షరాలు జత చేరుతాయి. అటువంటి సుజనా చౌదరి కాషాయధారిగా సులువుగానే మారిపోయారు, కానీ అచ్చమైన బీజేపీ భాషను మాత్రం ఇప్పటికీ నేర్చుకోలేకపోతున్నారు.
సహజంగా అసలు బీజేపీ నేతలు కొంత లాజిక్ తో వివరాలతో మాట్లాడుతారు. ఏపీలో బీజేపీలో కొత్తగా చేరిన వారు దానికి భిన్నం. వారు తమ పూర్వపు వాసనలు మరచిపోలేకపోతున్నారు. దాంతోనే తేడా కొట్టేస్తోందని అంటున్నారు.
అందుకే సుజనా స్కూల్ మారినా టీడీపీ సిలబస్ నే చదువుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ సెటైర్లు వేస్తున్నారు. సుజనా ఎంతసేపూ టీడీపీని మరచిపోలేకపోతున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.
సుజనా తీగ కదిల్చితే చంద్రబాబు డొంక కదులుతుందని కూడా గుడివాడ గట్టిగానే చెబుతున్నారు. అమరావతిలో తమ ఆస్తులు పోతాయన్న ఆవేదనతోనే సుజనా దేశం విడిచిపోతానని కొత్త వైరాగ్యం ప్రదర్శిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు.
సుజనా మాటలు దేశ ప్రతిష్టకే భంగమని, ఆయన మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని విశాఖ ఎస్పీకి గుడివాడ ఫిర్యారదు చేశారు. అదే ఫిర్యాదును ఆయన లేఖ రూపంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా పంపారు. మొత్తానికి సుజనా టీడీపీ భజన గురించి గుడివాడ ఎప్పటికపుడు విడమరచి చెబుతూంటే తమ్ముళ్ళు షాక్ తింటున్నారు