నారా లోకేష్ రెచ్చిపోయారు. ఇటీవల కరోనా దెబ్బతో మొహానికి మాస్క్ వేసుకుని హావభావాలు కనిపించకుండా ప్రెస్ మీట్లలో మాట్లాడిన చినబాబు.. తొలిసారిగా మాస్క్ తీసేసి బైటకొచ్చారు. వస్తూ వస్తూనే బస్తీమే సవాల్ అన్నారు.
నా ఛాలెంజ్ కి వైసీపీ గజగజ వణికిపోతోందని డప్పు కొట్టారు. ఇంతకీ ఆయన ఛాలెంజ్ ఏంటంటే.. రాష్ట్రవ్యాప్తంగా భూముల పంపిణీ కార్యక్రమం టీడీపీ వలనే ఆగిపోయిందని వైసీపీ నేతలు నిరూపించాలట.
అంతేకాదు, వైసీపీకి చెందిన జడ్పీటీసీ ఒకరు భూ పంపిణీ వ్యవహారంపై కోర్టుకెళ్లినట్టు ఆయన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయట. ఇంకా నయం.. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల పంపిణీని కూడా వైసీపీ ఆపేసిందని అనలేదు.
అధికారం చేపట్టి ఏడాది తిరిగేలోగా నవరత్నాల పథకాలను అమలులో పెట్టిన సీఎం జగన్.. భూ పంపిణీ కార్యక్రమానికి తన మనుషులతో అడ్డుపుల్ల వేస్తారా..? వినేవారు పచ్చ జర్నలిస్టులైతే చెప్పేవారు లోకేష్ అన్నట్టుంది ఈ వ్యవహారం.
పోనీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఉండటం వల్ల జగన్ కి వచ్చే లాభం ఏంటి? పట్టాల పంపిణీ పూర్తయితే చరిత్రలో ఇక టీడీపీ రెండంకెల స్థానాలు కూడా గెలవలేదని చంద్రబాబుకి తెలుసు. అందుకే టీడీపీ పేరు బైటకు రాకుండా సానుభూతిపరులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల కేసులు వేయించారు.
రాజధాని ప్రాంతంలో స్వయానా టీడీపీకి చెందిన నాయకులే కేసులు వేశారు. అమరావతి కోసం సేకరించిన భూముల్లో బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం ఏంటని ప్రశ్నించారు.
అంత కడుపుమంట లోపల పెట్టుకుని, బైటకు మాత్రం సవాళ్లు విసురుతూ కాలక్షేపం చేశారు చినబాబు. “ఒకమంత్రి మీసాలు తీసేస్తారని సవాల్ విసిరారు, ఆయనెప్పుడు తీస్తారో తెలియదు” అన్నారు లోకేష్.
ఇంతకీ ఆ సవాల్ లో మీసాలు తీయాల్సింది మంత్రా, మాజీ మంత్రి దేవినేని ఉమానా అనే విషయం లోకేష్ కే తెలియాలి. సవాళ్లు మినహా.. నారా లోకేష్ ప్రెస్ మీట్ అంతా అరిగిపోయిన పాత క్యాసెట్టే.
రైతుల మోటర్లకు బిగించాల్సిన మీటర్లు రెడీ అవుతున్నాయని, ఏపీలో రైతు ఉద్యమం తప్పదని హెచ్చరించారు లోకేష్. రైతు ఉద్యమానికి తామే నాయకత్వం వహిస్తామని కామెడీ చేశారు. రైతుల్ని దగా చేసిన పాపానికే గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయింది టీడీపీ.
అందుకే ఎన్నికల తర్వాత టీడీపీ రైతు జపం చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా మెడలో ఐడీ కార్డ్ వేసుకుని విదేశాలు పట్టుకు తిరిగిన లోకేష్.. అధికారం కోల్పోయాక ఎందుకు వరిచేలో దిగారో టీడీపీకే తెలియాలి.
రైతు జపం చేస్తే అధికారంలోకి రారు, రైతులకు నిజంగా మేలు చేస్తే, చేస్తారనే భరోసా కల్పిస్తేనే అధికారం దక్కుతుంది. ఆ తేడా తెలిసే వరకు లోకేష్ ఇలా ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేయాల్సిందే.