మణిరత్నం …సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరు. వివాదాలకు దూరంగా ఉంటారాయన. అలాంటి ప్రముఖ దర్శకుడికి కూడా మీటూ సెగ తప్పలేదు. అయితే ఆయనేమీ వేధించారనే ఆరోపణలు ఎదుర్కోలేదు. కానీ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సినిమాలో అవకాశం కల్పించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిదే తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
కోలీవుడ్‌లో మీటూ పేరు వినగానే సింగర్ చిన్మయి గుర్తుకొస్తారు. దీన్నిబట్టి మీటూ వ్యవహారంలో ఆమె ఎంతగా పాపులర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మరోసారి ఆమె ఆ అంశంపై తన గళాన్ని వినిపించారు.
ఈ సారి ఆమె ప్రశ్నల బాణాలు ప్రముఖ దర్శకుడు మణిరత్నంపైకి వెళ్లాయి. ఇదేంటని మణిరత్నాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మీటూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ కార్తీక్‌కు అవకాశం కల్పించడాన్ని నెటిజన్లతో పాటు చిన్మయి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మణిరత్నాన్ని నిలదీస్తున్నారు.
దర్శకుడు మణిరత్నం 'నవరస ' పేరుతో ఓ కొత్త ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిది కథలతో చిత్రాన్ని తెరకెక్కిస్తూ మణిరత్నం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ వెబ్ సిరీస్‌కు పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సమాచారం.
ఈ ప్రాజెక్టులో సింగర్ కార్తీక్‌కు అవకాశం కల్పించారు. ఇప్పుడిదే సమస్యగా మారింది. మీటూ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న కార్తీక్‌కు అవకాశం కల్పించడంపై నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నెటిజన్స్ ట్వీట్స్‌పై గాయని చిన్మయి కూడా స్పందించారు.
వేధింపులకు గురి చేసిన సింగర్‌కు అవకాశాలు ఇవ్వడం, అతనికి పని కల్పించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారని చిన్మయి వాపోయారు.
అంటే అన్యాయంపై ప్రశ్నించిన వాళ్లను మాత్రం దూరంగా పెట్టడమే కాకుండా … వేధించే వారిని అందలం ఎక్కించడం ఏంటని మణిరత్నాన్ని చిన్మయి ప్రశ్నిస్తోంది. మరి మణిరత్నం స్పందన ఏంటో తెలియాల్సి వుంది.