టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బహుశా టీడీపీ విశ్వవిద్యాలయంలో అబద్ధాల్లో పీహెచ్డీ చేసినట్టున్నారు. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలని పెద్దలు చెబుతారు. అయితే మంచీచెడూ, విచక్షణ లాంటివాటితో ఎలాంటి సంబంధం లేకుండా నోటికొచ్చిందల్లా మాట్లాడ్డంలో పట్టాభిరామ్ సిద్ధహస్తుడనే పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో చెప్పిన విషయాలు …పట్టాభితో పాటు టీడీపీని కూడా అభాసుపాలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో విడతల వారీగా రూ.1800 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ పెట్టేందుకు కైనెటిక్ గ్రీన్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కొత్తగా ఓ వాదన తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో ఏముందంటే…
“గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన కృషి కారణంగా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు పెట్టే సంస్థలను తామే తెచ్చినట్టు వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సంస్థ గురించి సైతం అదే ప్రచారం చేసుకుంటున్నారు. 2018, జూలై 27న అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ సంస్థ సీఈవోతో మాట్లాడారు. సంస్థ ప్రతినిధులను ఏపీకి ఆహ్వానించి , రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు.
జగన్ నాయకత్వం చూసే కైనెటిక్ సంస్థ ఏపీకి వచ్చినట్టు విజయసాయిరెడ్డి ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మీరు వేస్తున్న జే ట్యాక్సులు చూసి , ఉన్నవాళ్లే పారిపోతుంటే కొత్తగా ఎవరొస్తారు” అని పట్టాభి ప్రశ్నించారు.
ఒక వైపు జగన్ వేసే ట్యాక్సులు చూసి, ఉన్నవాళ్లే పారిపోతున్నారని పట్టాభే విమర్శిస్తున్నారు. ఉన్నవాళ్లే పారిపోతుంటే కొత్తగా ఎవరొస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కైనెటిక్ పరిశ్రమ పెడుతున్నారంటే తమ ప్రభుత్వ ఘనత అని ఆయనే చెబుతున్నారు. ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజమై ఉంటుంది.
2018లో నారా లోకేశ్ సదరు సంస్థతో చర్చించి ఉంటే …అంతా అయిపోయినట్టేనా? మరి అప్పుడే ఎందుకు పరిశ్రమ పెట్టలేదో సమాధానం ఉందా? జగన్ దెబ్బకు అందరూ పారిపోతుంటే కైనెటిక్ మాత్రం ఎలా వస్తున్నదో పట్టాభి సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డిని కైనెటిక్ సంస్థ ప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరిపారు. యూనిట్ ఏర్పాటు కోసం లంబోర్గినితో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కైనెటిక్ సంస్థ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. గోల్ప్, ఇతర క్రీడల్లో వినియోగించే వాహనాలను ఈ ప్లాంటులో తయారు చేయనున్నారు.
ఇందు కోసం దశల వారీగా రూ.1800 కోట్లు పెట్టుబడులను పెడుతామని ఆ సంస్థ జగన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అసలు నిజం ఇదైతే, మంచి జరిగితే తమ గొప్ప, కాకుంటే జగన్ నెత్తిపై వేయడం టీడీపీకి పరిపాటైంది.
చంద్రబాబు, లోకేశ్ గుడ్‌లుక్స్‌లో పడేందుకు పట్టాభిరామ్ మరీ దిగజారి వ్యవహరిస్తున్నారని టీడీపీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. ఇలాంటి వారి వల్లే నిజంగా తమ వల్ల వచ్చిన వాటిని కూడా జనం నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలు వాపోతున్నారు.