పోలీసులకు స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు..!

ఈ ఏడాది జీ-20 సదస్సుకి నోయిడా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం నోయిడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లలో భాగంగా పోలీసులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెడుతున్నారు. పోలీసులకు స్పోకెన్ ఇంగ్లీష్…

ఈ ఏడాది జీ-20 సదస్సుకి నోయిడా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం నోయిడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లలో భాగంగా పోలీసులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెడుతున్నారు. పోలీసులకు స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకని అనుకుంటున్నారా..? అతిథులుగా వస్తున్న వారితో వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పడానికి, వారికి ఇబ్బంది లేకుండా చూడటానికి.

అవును, అసలే మనోళ్ల ఇంగ్లిష్ అంతంత మాత్రం. విదేశీ అతిథులు వచ్చినవేళ, వారి భాష మనకి అర్థం కాక, మనకొచ్చిన ఇంగ్లిష్ వారికి తెలియక తికమక పడే బదులు ముందుగానే కాస్తంత మర్యాదగా ఇంగ్లిష్ మాట్లాడటం, అర్థం చేసుకోవడం నోయిడా పోలీసులకు నేర్పిస్తున్నారు ఉన్నతాధికారులు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు, ముఖ్యంగా ట్రాఫిక్ విధులు నిర్వహించే వారికి దీన్ని తప్పనిసరి చేశారు.

సాఫ్ట్ స్కిల్స్ అన్నీ..

కేవలం స్పోకెన్ ఇంగ్లిష్ తో మాత్రమే సరిపెట్టడంలేదు, అతిథులను మర్యాదగా ఎలా రిసీవ్ చేసుకోవాలి, వారితో సౌకర్యవంతంగా ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నారు. మొత్తం 250మంది పోలీస్ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. వీరంతా నోయిడా పరిధిలో డ్యూటీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విదేశీ అతిథులు దిగిన దగ్గరనుంచి సమ్మిట్ నిర్వహణ ప్రాంతం వరకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుంది.

ఆగస్ట్ చివరివారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో జీ-20 సమ్మిట్ జరుగుతుంది. భారత్ ఈసారి జీ-20 సమ్మిట్ కి ఆతిథ్యమిస్తోంది. 200మంది విదేశీ ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరవుతారు. విదేశీ అతిథులు సైట్ సీయింగ్ కి వెళ్లేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో దేశం వారికి ఒక్కో ప్రాంతంలో బస ఏర్పాటు చేశారు.

జీ-20 సమ్మిట్ కారణంగా ఆమధ్య నోయిడా చుట్టుపక్కల రోడ్లన్నీ నీట్ గా మార్చేశారు. రోడ్ల పక్కన మొక్కలు పెంచుతున్నారు. నోయిడాని సర్వాంగ సుందరంగా మార్చేస్తున్నారు. ఇప్పుడిలా పోలీసులకి కూడా సాఫ్ట్ స్కిల్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. మంచి, మర్యాద, ఇంగ్లిష్ అన్నీ నేర్పిస్తున్నారు.