పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారనే కారణంతో బీజేపీ నాయకుడు లక్ష్మీపతిరాజాపై ఆ పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వేటు వేస్తే ….ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు దాన్ని ఎత్తేసి ఆదరించారు. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కొక్కరిపై వేటు వేసి బయటికి పంపడమే తప్ప … చేర్చుకునేది లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయలసీమకు చెందిన ఓవీ రమణ, లంకా దినకర్ తదితర నేతలపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసింది. లక్ష్మీపతిరాజు సస్పెన్షన్‌కు దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఈయనపై ఈ ఏడాది జూన్‌లో వేటు వేశారు. కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఏఏ చానల్‌కు ఎవరెవరు వెళ్లాలో పార్టీ స్పష్టమైన దిశానిర్దేశం చేసింది.
ఇందులో భాగంగా పార్టీ నియమావళికి విరుద్ధంగా లక్ష్మీపతిరాజు సాక్షి చానల్ డిబేట్‌కు వెళ్లడంతో కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలోని క్రమశిక్షణ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సాక్షి చానల్‌లో నిర్వహించే చర్చలకు వల్లూరి జయప్రకాశ్ నారాయణ, నాగోతు రమేశ్‌నాయుడు, షేక్ బాజీ, లంక దినకర్‌తో పాటు మరో ఇద్దరిని నియమించింది. ఈ జాబితాలో లక్ష్మీపతిరాజా పేరు లేదు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సాక్షి చానల్ చర్చలకు వెళ్లిన లక్ష్మీపతిరాజాకు అప్పట్లో షోకాజ్ నోటీసు ఇచ్చారు.
లక్ష్మీపతిరాజా మాత్రం సమాధానం ఇవ్వలేదు. అంతేకాకుండా మళ్లీ అదే చానల్ డిబేట్‌కు వెళ్లడంతో సస్పెన్షన్ వేటు వేశారు. దాదాపు నాలుగు నెలల అనంతరం ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు.