గతేడాది కొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు కరణ్ జోహార్ పార్టీ ఇచ్చాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ కూడా చేశాడు. అయితే సుశాంత్ సింగ్ మరణం తర్వాత, డ్రగ్స్ కోణం వెలుగుచూడ్డంతో ఆ వీడియో మరోసారి వైరల్ అయింది. ఆ పార్టీలో ప్రముఖులంతా డ్రగ్స్ వాడారంటూ ప్రచారం జరిగింది.
దీనిపై విచారించిన ఎన్సీబీ, 2019లో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో ఎలాంటి మాదకద్రవ్యాలు వాడలేదని స్పష్టంచేసింది. కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ వీడియోపై ఇన్నాళ్లుగా చెలరేగిన ఊహాగానాలకు చెక్ పడింది.
2019లో కరణ్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో రణబీర్ కపూర్, దీపిక పదుకోన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్.. ఇలా చాలామంది ప్రముఖులున్నారు. వీళ్లలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.
మరీ ముఖ్యంగా విక్కీ కౌశల్ పక్కన ఉన్న పదార్థాన్ని వైట్ క్రిస్టల్ (ఇదో రకమైన డ్రగ్) గా చెబుతూ ఓ ఛానెల్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ, అది డ్రగ్ కాదని, ఫ్లోర్ పై లైట్ ఫ్లాష్ అవ్వడం వల్ల అలా కనిపించిందని వివరణ ఇచ్చింది.
మొత్తమ్మీద బాలీవుడ్ డ్రగ్స్ కోణానికి సంబంధించి మరో ఆరోపణ తేలిపోయింది. మరోవైపు డ్రగ్స్ విచారణలో భాగంగా దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. 1.8 గ్రాముల నిషేధిత మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేశారు.