ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్ర పై వివాదం తీవ్రం అవుతూ ఉంది. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆ పాత్రను ముస్లిం గెటప్ లో చూపించడంపై ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కథపైనే పెద్ద వివాదం చెలరేగుతూ ఉంది. వాస్తవ యోధుల పాత్రలను వాడుకుంటూ కల్పిత కథగా చెప్పడం మరింత వివాదాస్పదం అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఈ క్రమంలో ఈ సినిమాపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఈ అంశంపై స్పందించారు. గోండు యోధుడు కొమురం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని ఈ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించడం గమనార్హం.
నిజాంలపై పోరాడిన భీమ్ కు ఇతర మతాల క్యాప్ లు పెట్టడం ఏమిటి? అంటూ ఈ బీజేపీ నేత ప్రశ్నించారు. ఆ సన్నివేశాలను తొలగించి తీరాలని, లేకపోతే థియేటర్లపై దాడులకు కూడా వెనుకాడేది ఉండదని కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ఈ ఎంపీ హెచ్చరించారు.
కొమురం భీమ్ గిరిజనుల పాలిట దైవం అని, ఆయన చరిత్రను ఉన్నదున్నట్టుగా తీస్తే అభ్యంతరం లేదని, అభ్యంతరకరంగా తీస్తే మాత్రం సహించేది లేదని ఈ ఎంపీ ఆ సినిమా దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.