ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి మూడు నెలల కనిష్ట స్థాయికి చేరిందని అంటున్నాయి గణాంకాలు. నిన్నటి సోమవారం రోజున దేశ వ్యాప్తంగా 36,604 కొత్త కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
సరిగ్గా ఈ ఏడాది జూలై 17వ తేదీన 35,065 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయొంది. సెప్టెంబర్ లో పతాక స్థాయికి చేరింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ ఇప్పుడు 36,604 స్థాయికి చేరాయి కొత్త కేసుల సంఖ్య.
ఇలా దినవారీ కరోనా కేసుల సంఖ్య మూడు నెలల కనిష్టానికి చేరింది. అయితే 36,604 సంఖ్య అనేది తక్కువైతే కాదు. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా ఆరు లక్షలకు పైనే ఉంది. సోమవారం రోజునే సుమారు 488 మంది కరోనాతో మరణించినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతన్నాయి.
అన్నింటికీ మించి గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పోస్ట్ కోవిడ్ ప్రభావంతో కొంతమంది మరణిస్తూ ఉండటం. కోవిడ్-19 నుంచి కోలుకున్న నెలల తర్వాత కూడా కొందరు మరణించిన విషయాలు మీడియా హైలెట్ చేయడం లేదు.
కరోనా వస్తోంది, పోతోంది.. అయితే కొంతమందిపై దాని దుష్పరిణామాలు మరో రకంగా కూడా కనిపిస్తున్నాయి. ఎస్పీబీ, నాయిని నర్సింహారెడ్డి లాంటి ప్రముఖులు ముందుగా కోవిడ్-19 బారిన పడి, ఆ వైరస్ నుంచి విముక్తులయ్యారు. కానీ.. వేరే ఆరోగ్య సమస్యలతో వారు మరణించినట్టుగా వైద్యులు చెబుతున్నారు.
ఒకవేళ కోవిడ్-19 బారిన పడకపోయి ఉంటే.. వారి ఆరోగ్యాలకు ఉన్నట్టుండి వచ్చిన ప్రమాదాలు ఏమీ ఉండేవి కావనేది సుస్పష్టమైన అంశం. సరిగ్గా ఇలాగే పలువురు సామాన్యులు కూడా మరణించిన దాఖలాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి.
అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన కొంతమంది కోవిడ్-19 కు గురై, కోలుకున్నాకా.. నెలల తర్వాత కూడా అనారోగ్యం తిరగబెట్టి మరణించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే వీటిని కరోనా మరణాలుగా లెక్క వేయడం లేదు! ఇలాంటి వాటిని గమనిస్తే.. కరోనా మహమ్మారి అప్పుడే లైట్ తీసుకునేది కాదని స్పష్టం అవుతుంది.