సామాజిక స్పృహలో జనసేనాని పవన్‌కల్యాణ్ కంటే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెటర్ అనిపించుకున్నాడు. చేగువేరా, అంబేద్కర్, గద్దర్, సమాజం, అభ్యదయం, ప్రశ్నించడం తదితర లోకోద్ధారక ఉపన్యాసాలను పవన్ కల్యాణ్ ఎంతో ఆవేశంతో ఊగిపోతూ ఇస్తుంటాడు. మనిషిలో ఆవేశం, మాటల్లో ఆలోచనలు చూస్తే ఎంత గొప్ప నాయకుడో కదా అని భావించిన వాళ్లు లేకపోలేదు. చేగువేరా నామ స్మరణకు తమను తాము మైమరిచిన వామపక్షాలకు ఇటీవల అమిత్‌షాను పవన్ పొగడ్తలతో ముంచేయడంతో మైండ్ బ్లాక్ అయ్యింది. అది వేరే విషయం.
ఇటీవల ఢిల్లీలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దుండగులు ముసుగులు ధరించి రాడ్లు, కత్తులతో దాడి చేయడంతో పదుల సంఖ్యలో విద్యార్థులు, ప్రొఫెసర్లు గాయాలపాలయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై బాలీవుడ్ స్పందించింది. పలువురు సినీ ప్రముఖులు విశ్వవిద్యాలయానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడన్నట్టుగా ‘అల… వైకుంఠపురములో’ కథా నాయకుడు బన్నీ జేఎన్‌యూ ఘటనపై స్పందించాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…‘జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి గురించి తెలిసి చాలా బాధపడ్డాను. విద్యార్థులకు న్యాయం జరిగేలా పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా’ అని తనదైన శైలిలో బన్నీ చెప్పాడు.
అలాగే పౌరసత్వ చట్ట సవరణపై కూడా బన్నీ ఆచితూచి స్పందించాడు. ‘ఈ చట్టంపై అజయ్ దేవగణ్ చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి. మొదటగా మేము సినిమా పక్షులం. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేవాళ్లం. మాక్కూడా గొంతు ఉంది. ఇలాంటి చట్టాలు, ఆందోళనలపై మాట్లాడే శక్తి ఉంది. కానీ జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది’ అని బన్నీ అభిప్రాయపడ్డాడు.
ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టానని పదేపదే చెప్పే పవన్‌కల్యాణ్ నుంచి ఇంత వరకూ ఈ రెండింటిపై కనీస స్పందన కూడా లేకపోవడం గమనార్హం. కానీ సినిమాలే ప్రపంచంగా బతుకుతున్న బన్నీ ఆ మాత్రమైనా స్పందించడాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే. సో, పవన్ కంటే బన్నీనే బెటర్ అంటే కాదంటారా?