ఇలా చూడండి… పవన్ మళ్లీ జారుకున్నాడు

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు.. ఏపీలో మాత్రమే ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్ పై అంతెత్తున ఎగిరిపడుతుంటారు.. కేసీఆర్ పేరు చెప్పగానే కామ్ గా పక్కకెళ్లిపోతారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ విషయంలో పవన్ వ్యవహారశైలి…

ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నారు.. ఏపీలో మాత్రమే ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యమంత్రి జగన్ పై అంతెత్తున ఎగిరిపడుతుంటారు.. కేసీఆర్ పేరు చెప్పగానే కామ్ గా పక్కకెళ్లిపోతారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ విషయంలో పవన్ వ్యవహారశైలి ఇలానే ఉంది. ఇప్పుడు మరోసారి తెలంగాణ విషయంలో మెల్లగా జారుకున్నారు జనసేనాని.

“కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అనుమతినిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుంది.”

చుశారుగా.. కొద్దిసేపటి కిందట జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ ఇది. ఇలా మరోసారి తెలంగాణకు ముఖం చాటేశారు పవన్ కల్యాణ్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లనే పోటీ చేయడం లేదని ప్రకటించిన పవన్.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటనేది బహిర్గతం చేస్తే బాగుండేది. కనీసం ఇన్నాళ్లూ తన పార్టీపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ జనసైనికులకైనా విడమర్చి చెబితే బాగుండేది.

కానీ అలా విడమర్చి చెప్పడానికి, ఉన్నది బయటపెట్టడానికి అక్కడేం లేదు. కేసీఆర్ పదవిలో ఉన్నంతకాలం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరన్నమాట. ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టం. అదంతే. ఒకవేళ కేసీఆర్ పై స్పందించాల్సిన పరిస్థితే వస్తే, పాలన భేష్ అంటారు తప్ప మచ్చుకైనా తప్పు వెదికే ప్రయత్నం చేయరు పవన్. ఇది కూడా ఎందుకని అడగొద్దు. అదంతే. జగన్ పాలన గురించి అడిగితే మాత్రం ఈ పార్ట్ టైమ్ పొలిటీషియన్ కు ఎక్కడలేని కొర్రీలు కనిపిస్తాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఓ రేంజ్ లో తెలంగాణ ఫ్యాన్స్ ను ఊరించారు పవన్ కల్యాణ్. ఇదిగో వస్తున్నా, అదిగో లిస్ట్ అనే టైపులో ఫీలర్లు వదిలారు. అవసరమైతే తను కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తానంటూ వీరావేశంతో ప్రకటనలు కూడా గుప్పించారు. దీంతో కొంతమంది జనసేన పార్టీ కోసం ఎదురు చూశారు. పవన్ చెబితే తెలంగాణలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఆఖరి నిమిషంలో తుస్సుమనిపించారు జనసేనాని. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉందని అప్పట్లో ప్రకటించారు.

తెలంగాణలో చంద్రబాబు పరిస్థితి గుండు సున్నా. అతడి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిజంగా తెలుగుదేశం పార్టీకీ తెలంగాణలో అంతోఇంతో మైలేజీ ఉండి ఉన్నట్టయితే, కచ్చితంగా చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ ను తెలంగాణ ఎన్నికల బరిలో దించేవారు. తెలంగాణలో టీడీపీకి సీన్ లేదని తెలుసుకాబట్టే ఆయన సైలెంట్ అయిపోయాడు. బాబు సైలెంట్ అయితే, పవన్ కూడా సైలెంట్ అవ్వాల్సిందే కదా. ఇప్పుడదే జరిగింది. తమ నాయకుడు వస్తాడని ఇన్నాళ్లూ ఎదురుచూసిన తెలంగాణ “కల్ట్ పవన్ ఫ్యాన్స్” కు మరోసారి నిరాశ ఎదురైంది.