ఏపీ సర్కార్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సమరమా? సయోధ్యా? ఇప్పుడిదే ఏపీలో ప్రధాన చర్చ. నిమ్మగడ్డ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుతో ముగుస్తుంది.
ఈ లోపు ఎలాగైనా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో ఉన్నారని …ఆయన నడతే చెబుతోంది. మరోవైపు నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత వరకు ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం కూడా పంతం పట్టింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు వ్యవస్థల ప్రతిష్టగా మారిపోయింది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవల నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయడాన్నిబట్టి ఆయన ఆలోచన ఏంటో తెలిసిపోయింది. హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో ఈ నెల 28న నిమ్మగడ్డ సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు తాము సుముఖంగా లేనట్టు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి నిమ్మగడ్డకు ఉంటే …రెండేళ్ల క్రితమే ఆ పని చేసి ఉండాల్సింది. ఎందుకంటే రాష్ట్రంలో 2018, ఆగస్టు 1 నాటికే గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే తలంపు నిమ్మగడ్డకు ఎందుకు రాలేదో ఎవరూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే అప్పుడు పాలకుడు చంద్రబాబు కాబట్టి.
అలాగే కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మార్చి 15వ తేదీన నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను మార్చి 23న విధిస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయానికి దేశ వ్యాప్తంగా వందల్లో కూడా కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే 8 లక్షలకు పైగా నమోదు అయ్యాయి.
కరోనా పోయిందనే నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులతో పాటు ఇటీవల ప్రధాని తన ప్రసంగంలో హెచ్చరించడాన్ని విస్మరించొద్దు. అయినప్పటికీ తన పంతాన్ని నెగ్గించుకోవడమే లక్ష్యంగా నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతారా? లేక ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎన్నికల వాయిదాను కొనసాగిస్తారా? అనే విషయమై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది.