విశాఖ‌కు ముంద‌స్తు రాజ‌ధాని హోదా

జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల‌పై ఎలాంటి అధికారిక నిర్ణ‌యం తీసుకోకుండానే, విశాఖ‌కు మాత్రం ప‌రిపాల‌నా రాజ‌ధాని హోదా ల‌భించిన‌ట్టైంది. విశాఖ‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటుండ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు.…

జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల‌పై ఎలాంటి అధికారిక నిర్ణ‌యం తీసుకోకుండానే, విశాఖ‌కు మాత్రం ప‌రిపాల‌నా రాజ‌ధాని హోదా ల‌భించిన‌ట్టైంది. విశాఖ‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకుంటుండ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ చాలా సీరియ‌న్‌గా విశాఖ‌పై దృష్టి సారించారు. ఆయ‌న పాల‌న మొత్తం విశాఖ‌పై కేంద్రీక‌రించారు. ఇందుకు నిద‌ర్శ‌నం సోమ‌వారం సీఎం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు, ఆదేశాల‌ను ఉద‌హ‌రించ‌వచ్చు.

విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఉద్యోగులు, ప్ర‌జ‌ల తాకిడితో ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ ముంద‌డుగు వేసింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వ‌రకు ట్రామ్ త‌ర‌హా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ ఏర్పాటులో భాగంగా స‌మ‌గ్ర ప్రాజెక్టు (డీపీఆర్‌) త‌యారీ కోసం క‌న్స‌ల్టెంట్ల‌ను నియ‌మించాల‌ని సంబంధిత అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

అలాగే రాజ‌ధాని జ‌నాభాకు త‌గ్గ‌ట్టు ఎలాంటి స‌మ‌స్య లేకుండా విశాఖ‌న‌గ‌ర వాసుల‌కు తాగునీటిని అందించేందుకు పోల‌వ‌రం నుంచి భూగ‌ర్భ పైప్‌లైన్ ద్వారా నిరంత‌ర‌ స‌ర‌ఫ‌రాకు వెంట‌నే ప్ర‌తిపాద‌న‌లు చేయాల‌ని మున్సిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. అలాగే విశాఖ‌లో 1.50 ల‌క్ష‌ల మందికి ఇంటి ప‌ట్టాలు పంపిణీ చేస్తున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. విశాఖలో వ‌స‌తులు, అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, మున్సిప‌ల్ శాఖ కార్య‌ద‌ర్శి శ్యామ‌ల‌రావు, క‌మిష‌న‌ర్ విజ‌య‌కుమార్‌తో స‌మీక్షించారు.

సీఎం ఇంటి కోసం అన్వేష‌ణ‌
ఒక‌వైపు తాగునీరు, రోడ్లు, ఇంటిప‌ట్టాలు…త‌దిత‌ర వ‌సతుల క‌ల్ప‌న‌లో అధికారులున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ నివాస గృహం, సీఎం క్యాంప్ ఆఫీస్‌ కోసం వైసీపీ నేత‌లు వెతుకులాట‌లో ఉన్నారు. బీచ్‌రోడ్డులో ఫ‌వ్‌స్టార్ హోట‌ల్‌లో కొంత‌కాలం పాటు సీఎం ఉండేలా ఆ హాట‌ల్‌లో ప‌నులు వేగంగా చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదే కాకుండా మ‌రికొన్ని గెస్ట్‌హౌస్‌ల‌ను కూడా ప‌రిశీలిస్తున్నారు.

మ‌రోవైపు సీఎం శాశ్వ‌త నివాస గ్ర‌హాన్ని నిర్మించుకునేందుకు రుషికొండ‌, మ‌ధుర‌వాడ‌, భీమిలి, కాపులుప్పాడ‌, తిమ్మాపురం త‌దిత‌ర ప్రాంతాల్లో స్థ‌లాల‌ను పార్టీ నేత‌లు ప‌రిశీలిస్తున్నారు. ఏది ఏమైనా రాజ‌ధానిపై ఒక ప్ర‌క‌ట‌న రాకుండానే విశాఖ‌కు మాత్రం ఆ హోదా ల‌భించిన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.