హైదరాబాద్ నగరాన్ని వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు. వాన వద్దు కుయ్యో మొర్రో అని వేడుకుంటున్నా వరుణ దేవుడు కరుణించడం లేదు. వద్దంటే మరింత ఎక్కువ తన ప్రతాపాన్ని చూపుతున్నట్టుంది.
హైదరాబాద్ నగరంపై ఆకాశానికి చిల్లు ఏమైనా పడిందా అనే అనుమానం కలిగేంతంగా వర్షం ధార కట్టింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నగర వాసులను మంగళవారం మరోసారి అప్రమత్తం చేస్తూ హెచ్చరిక చేయాల్సి వచ్చింది.
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నగర వాసులు ఏ ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావద్దని, అలాగే పనులపై బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలని వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారాన్ని చేర వేశారు. అలాగే వర్షం పడుతున్న నేపథ్యంలో ఎవరూ కూడా చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అసలే వర్షం, వరద దెబ్బకు బిక్కుబిక్కుమంటున్న జంటనగర వాసులపై వరుణ దేవుడు పగ పట్టినట్టు మంగళవారం ఉరుములు, మెరుపుతో విరుచుకుపడ్డాడు. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సంతోష్‌నగర్‌లో ఓ మోస్తరుగా, హయత్‌నగర్, బేగంపేట, ఉప్పల్, మీర్‌పేటలో కుండపోత వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో వరదల పరిస్థితిపై 15 మంది సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ప్రకటించారు. ముందు జాగ్రత్తలో భాగంగా బోట్లను తెప్పించినట్టు అధికారులు తెలిపారు. ఏపీ నుంచి 8 బోట్లను ప్రభుత్వం పంపింది.