సౌత్ హీరోపై మ‌రో హీరోయిన్ ఘాటు వ్యాఖ్య‌లు!

ఇది వ‌ర‌కూ ద‌క్షిణాదిన న‌టించి.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో సెటిలైన ప‌లువురు హీరోయిన్లు ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాధికా ఆప్తే, ఇలియానాతో స‌హా ప‌లువురు న‌టీమ‌ణులు ఈ జాబితాలో ఉన్నారు.…

ఇది వ‌ర‌కూ ద‌క్షిణాదిన న‌టించి.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో సెటిలైన ప‌లువురు హీరోయిన్లు ఇక్క‌డి ప‌రిశ్ర‌మ‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాధికా ఆప్తే, ఇలియానాతో స‌హా ప‌లువురు న‌టీమ‌ణులు ఈ జాబితాలో ఉన్నారు. సౌత్ లో హీరోయిన్ల‌కు వేధింపులు ఎక్కువ‌న్న‌ట్టుగా వారు మాట్లాడారు. తాము సౌత్ లో ప‌లు ర‌కాల వేధింపులను ఎదుర్కొన్న‌ట్టుగా వాళ్లు వ్యాఖ్యానించారు.

ఇక ఆ జాబితాలో తాజాగా చేరింది నేహా దూపియా. బాలీవుడ్ లో 'జూలీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నేహా ఆ ఊపులో సౌత్ లో ప‌లు సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు తిరిగి వెళ్లి సెటిలైంది. ఇప్ప‌టికీ ఏవో టాక్ షోల‌తో ఆమె వార్త‌ల్లో ఉంటోంది. ఈ క్ర‌మంలో సౌత్ లో త‌ను ఎదుర్కొన్న చేదు అనుభ‌వం గురించి ఆమె వివ‌రించింది.

ఒక సినిమాలో చేస్తున్న‌ప్పుడు హీరో క‌న్నా ముందుగా క‌నీసం భోజ‌నం చేయ‌డానికి వీల్లేద‌ని షూటింగ్ స్పాట్ లో నిబంధ‌న పెట్టార‌ని నేహ వాపోయింది. త‌న‌కు ఆక‌లేస్తోంద‌న్నా విన‌లేద‌ని.. హీరో కి ఇంకా షూటింగ్ కొన‌సాగుతూ ఉంద‌ని, అద‌య్యాకా, ఆయ‌న భోంచేశాకే ఎవ‌రైనా భోజ‌నం చేయాలంటూ అడ్డుకున్నార‌ని నేహ చెప్పింది. హీరో వ‌చ్చి భోంచేసే వ‌ర‌కూ తన‌కు భోజ‌నం కూడా పెట్ట‌లేద‌ని త‌న అనుభ‌వాన్ని ఈమె వివ‌రించింది. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మే హీరోల స్వామ్యం. సౌత్ లో ఆ తీరు మ‌రింత ఎక్కువ అనే అభిప్రాయాలున్నాయి. వాటికి ఊతం ఇస్తోంది నేహా దూపియా.

ఇంత‌కీ నేహ చేసిన సౌత్ సినిమాలు ఏవ‌నే జాబితాను తీస్తే.. త‌రుణ్ సినిమా నిన్నే ఇష్ట‌ప‌డ్డాను, రాజ‌శేఖ‌ర్ సినిమా విల‌న్, బాల‌కృష్ణ సినిమా ప‌ర‌మ‌వీర‌చ‌క్ర‌.. ఇవీ ఈమె సౌత్ లో చేసిన ప్ర‌ముఖ సినిమాలు. వీటిల్లో ఏ సినిమా స‌మ‌యంలో నేహ‌కు ఇలాంటి అనుభ‌వం ఎదుర‌యి ఉంటుందో అంచ‌నా వేయ‌డం తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు పెద్ద క‌ష్టం కాదేమో!