లైంగిక దాడికి గురైన బాధితురాలు యూ టర్న్ తీసుకొంది. తనపై సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుడు ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది. బాధితురాలైన యువతి లా విద్యార్థిని కావడం గమనార్హం.
షహజాన్‌పూర్‌లో చదువుతున్న లా విద్యార్థిని గత ఏడాది కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన సదరు విద్యార్థిని కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
బాధితురాలికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున వివిధ మహిళా , ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేశారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఈ కేసును అలహాబాద్ హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనంతో కూడిన ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఈ కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని లా విద్యార్థిని కోర్టుకు తెలిపింది.
గతంలో తీవ్ర ఆరోపణలు చేసి, ఇప్పుడు మాట మార్చడంతో విద్యార్థినిపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసిన విద్యార్థినిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. కేసుపై సీరియస్‌గా విచారణ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థిని యూ టర్న్ తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.