తెలంగాణ చరిత్రలోనే ప్రభుత్వ అధికారులకు సంబంధించి భారీ ముడుపుల కేసుగా పరిగణిస్తున్న 2 కోట్ల రూపాయల లంచం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. చంచల్ గూడ జైలులో నెల రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు.. జైలులో ఉరి వేసుకోవడం వివాదాస్పదంగా మారింది.
కేసులంటే భయం, పరువుపోతుందనే బాధ ఉన్న అధికారులెవరూ అసలు లంచాలకు అలవాటు పడరు. అన్నీ వదిలేసినవారే లంచాలు తీసుకుంటారు. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా సరే కొన్నిరోజుల తర్వాత మళ్లీ రాయల్ గా విధుల్లో చేరిపోతుంటారు. నాలుగైదుసార్లు ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారంటే.. కేసులకు వారు ఏమాత్రం భయపడరనే అర్థం. అలాంటిది జైలులో కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం వెనక బలమైన కారణం ఉండే ఉండాలి.
నాగరాజు మరణం పరువు కోసం కాదు, పైవారి కోసమే అనే అనుమానాలు బలపడుతున్నాయి. నాగరాజు తీసుకుంటున్న 2కోట్ల రూపాయల భారీ ముడుపుల కేసులో.. అధిక భాగం అధికార పార్టీ నేతలకే అందాల్సి ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ నేతల పేర్లు కూడా కొన్ని వెబ్ సైట్లు ప్రచురించాయి కానీ, తర్వాత అంతా గప్ చుప్ గా మారింది.
నాగరాజుపై 2011లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. అప్పట్లో ఆయన భారీ ఆస్తులు చూసి అధికారులు షాకయ్యారు. ఆ కేసు నుంచి కొన్ని నెలల క్రితమే ఆయనకు విముక్తి లభించింది. అందులో కూడా అధికార పార్టీ నేతల హస్తం ఉందనే వాదన కూడా ఉంది. వారి అండదండలతోనే బైటకొచ్చిన నాగరాజు.. చివరకు వారి కోసమే మరో సాహసం చేశారని అంటున్నారు.
ఏకంగా 2 కోట్లు లంచం డిమాండ్ చేసి, కోటి 10లక్షలు క్యాష్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఈసారి కేసు విచారణ మరింత సీరియస్ గా సాగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు పెద్ద తలకాయల పేర్లు బైటకొచ్చే అవకాశం ఉండటంతో జైలులోనే నాగరాజు ప్రాణం అనంతవాయువుల్లో కలసిపోయిందని అంటున్నారు.
నాగరాజు ఆత్మహత్య విషయం బైటపెట్టిన అధికారులు, ఆయన ఎలా చనిపోయారనేది మాత్రం చాలాసేపు గోప్యంగా దాచారు. అసలు నాగరాజుది ఆత్మహత్యేనా, లేక ఇంకేదైనా జరిగిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అసలు నాగరాజుతో సంబంధం ఉన్న నేతలు ఎవరు? వారిప్పుడు ఎక్కడున్నారు? ఏంచేస్తున్నారు? నాగరాజు తరపున వాదిస్తున్న లాయర్లకు ఫీజులిచ్చింది ఎవరు? సలహాలిస్తోంది ఎవరు? అనే విషయంపై కూపీ లాగితే ఈ వ్యవహారం మొత్తం బైటకొచ్చే అవకాశం ఉంది.
అలాంటి లోతైన విచారణ నాగరాజు ఆత్మహత్య విషయంలో జరగదు అని ఈపాటికే స్పష్టమైంది. నాగరాజు కేసు తర్వాత, మెదక్ అడిషనల్ కలెక్టర్ కూడా భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ పడ్డుబడటం విశేషం. ఆ కేసు కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. మొత్తానికి ఎవరిపేర్లూ బైటకు రాకుండా నాగరాజు ప్రాణం పోయింది.