బీజేపీ నేతల ఇగోని రెచ్చగొట్టిన జగన్

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఒక్కో పార్టీ ఒక్కోరకంగా స్పందించింది. బీజేపీలో మాత్రం పార్టీపరంగా కాకుండా.. నేతలే రకరకాలుగా స్పందించారు. ఒకరు సమర్థించారు, మరొకరు వ్యతిరేకించారు, ఇంకొకరు సవరణలు…

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత ఒక్కో పార్టీ ఒక్కోరకంగా స్పందించింది. బీజేపీలో మాత్రం పార్టీపరంగా కాకుండా.. నేతలే రకరకాలుగా స్పందించారు. ఒకరు సమర్థించారు, మరొకరు వ్యతిరేకించారు, ఇంకొకరు సవరణలు సూచించారు. చివరకు అధిష్టానం ఆదేశాలతో అందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు.

అమరావతి నుంచి రాజధాని మార్చడాన్ని ఏపీ బీజేపీ ముక్తకంఠంతో ఖండిస్తోందని ఇప్పుడు బృందగానం ఆలపిస్తున్నారు. కేవలం దీని కోసమే జిల్లాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ నేతలు. కేవలం ప్రధాని మోదీ రాజధానికి చేసిన శంకుస్థాపనను అపహాస్యం చేశారనే ఉద్దేశంతోటే ఈ నిర్ణయం తీసుకున్నారట.

మోదీ శంకుస్థాపన చేసిన చోట రాజధాని లేదంటే ఎలా, దీన్ని మీరందరూ వ్యతిరేకించాలంటూ అధిష్టానం నుంచి ఆదేశాలందడంతో ఏపీ కమలదళం రెచ్చిపోయింది, జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించింది. పోనీ మూడు రాజధానులను బీజేపీ సమర్థించినా.. ఏ ఒక్కచోట, ఏ శంకుస్థాపనకు కూడా ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశాలు తక్కువ.

అసలే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పోలవరం రివర్స్ టెండర్ల విషయంలో జగన్ పై కేంద్రానికి పీకలదాకా కోపం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ కావాలనే బీజేపీని రెచ్చగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. శంకుస్థాపనలకు ఇరుగు పొరుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రుల్ని, ఇతర నేతల్ని పిలిచి, బీజేపీకి షాకిచ్చినా ఇవ్వొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఆ అవమానాల్ని తట్టుకోలేకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మోదీ వేసిన శిలా ఫలకాన్ని ధిక్కరించారనే ఉద్దేశంతో జగన్ ని టార్గెట్ చేయాలనుకుంటోంది.

దీనికి తోడు జగన్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తన నిర్ణయాన్ని వెలిబుచ్చడంతో బీజేపీ మరింతగా మండిపోతోంది. రాష్ట్రంలో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ వ్యతిరేకించాలని పైనుంచి రాష్ట్ర నేతలకు ఆదేశాలు వచ్చేశాయి. అందుకే కమలదళం మూకుమ్మడిగా జగన్ పై దాడికి సిద్ధమైంది. మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.