చంద్రబాబు రాజకీయం రివర్స్ అవుతోంది. పార్టీలో అంతర్గత రాజకీయాలు చక్కబెట్టడానికి ఆయన ప్రయోగించిన సస్పెషన్ వేటు అనే అస్త్రాలు కాస్తా బూమరాంగ్ అయి పార్టీకి తీరని నష్టం కలిగంచేలా ఉన్నాయి. కోవర్టులు, కట్టప్పలు అంటూ కొంతమందిపై బాబు వేటు వేశారు.
నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇటీవల నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో టీడీపీకి వచ్చిన సీట్లు సున్నా. అంటే అత్యంత పేలవమైన ప్రదర్శన జరిగింది అక్కడ. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా మరో ముగ్గురు మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్సీ, ఇతర స్థానిక నేతలు అందరూ కలసి మంత్రాంగం నడిపిస్తే ఆ రిజల్ట్ వచ్చింది.
ఎన్నికలకు ముందు రోజు టీడీపీ అభ్యర్థులు వైసీపీలోకి జంప్ కావడం, కొన్నిచోట్ల లోపాయికారీగా లాలూచీ పడటం, మరికొన్ని చోట్ల బహిరంగంగానే వైసీపీకి మద్దతివ్వాలని అనుచరగణానికి చెప్పడంతో టీడీపీ కనీస పోటీ ఇవ్వకుండా అన్ని డివిజన్లు వైసీపీకి సమర్పించుకుంది. ఇక్కడ పార్టీ వ్యవహారాన్ని పోస్టుమార్టం చేస్తే ఈ లోపాయికారీ వ్యవహారాలన్నీ బయటపడ్డాయి.
విచిత్రం ఏంటంటే.. జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గరనుంచి అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా పార్టీని భ్రష్టు పట్టించారు. కానీ చివరిగా ఓ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసి మమ అనిపించారు చంద్రబాబు. పెద్ద తలకాయల్ని వదిలేశారు.
సస్పెన్షన్ వేటు తర్వాత నెల్లూరు జిల్లాలో టీడీపీ అంతర్గత కుమ్ములాటలు మరింత రచ్చకెక్కాయి. సాక్షాత్తూ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు, తాజా అధ్యక్షుడు.. అంతా వైసీపీతో కుమ్మక్కయ్యారని, కులం కోసం ఒకరు, స్నేహం కోసం, కాంట్రాక్టుల కోసం మరొకరు లాలూచీ పడ్డారని, హోల్ సేల్ గా పార్టీని అమ్మేశారంటూ సదరు సస్పెండ్ అయిన నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ దుమ్ము దులిపారు.
మూడు డివిజన్లలో పార్టీ ఓడిపోయిందని ముగ్గుర్ని సస్పెండ్ చేశారని, మరి 54 డివిజన్లలో ఓడిపోయినందుకు ఎవరిని బాధ్యులుగా చేస్తారంటూ సూటిగా ప్రశ్నించారు. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఎంతకు అమ్ముడుపోయారనేది గణాంకాలతో సహా వివరిస్తూ మీడియా ముందే చాకిరేవు పెట్టారు.
షాకయిన మాజీ మంత్రులు..
అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, బీసీ జనార్జన్, నక్కా ఆనంద్ బాబు.. ఇలా పార్టీ పరిశీలకులుగా వచ్చిన ప్రతి ఒక్కరూ లోకల్ పాలిటిక్స్ చూసి ముక్కున వేలేసుకున్నారు. స్థానికంగా పార్టీని హోల్ సేల్ గా అమ్మేశారంటూ వారు అధినేత చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు. పార్టీ సమీక్షలో కూడా.. మీ రాజకీయ స్వలాభానికి పార్టీకి పాడె కట్టేస్తారా అంటూ చంద్రబాబు లోకల్ లీడర్స్ పై చిందులు తొక్కారని సమాచారం.
కొసమెరుపు ఏంటంటే.. నెల్లూరు వైఫల్యానికి సంబంధించి చివరిగా చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నేతపై వేటు వడింది. మిగతావారంతా సేఫ్ అయ్యారు. అయితే ముందు ముందు మరింత భారీగా ప్రక్షాళన జరుగుతుందని సమాచారం. ఓ దశలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కూడా కొత్తగా పార్టీలోకి వచ్చి, పదవుల్లో కూర్చున్న నాయకులు టార్గెట్ చేయాలని చూశారు. కానీ చంద్రబాబు సోమిరెడ్డిపై మాటపడనీయలేదు.
మొత్తమ్మీద కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క సీటుకూడా గెలవకుండా నెల్లూరులో టీడీపీ రికార్డ్ సృష్టిస్తే… ఇప్పుడు నెల్లూరు నుంచే పార్టీ నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తూ చంద్రబాబు కలకలం సృష్టిస్తున్నారు.