ఫైర్ బ్రాండ్ పైనే ఫైర్.. అసలేం జరుగుతోంది..?

వైసీపీలో ఎవరూ సీనియర్లు కాదు, ఎవరూ జూనియర్లు కాదు, నాయకులందరూ ఏదో ఒక పార్టీ నుంచి వచ్చినవారే. కానీ కాస్త ముందు వెనక. అయితే ఆ మాత్రం దానికే కొంతమంది తాము సీనియర్లమని, మిగతావాళ్లు…

వైసీపీలో ఎవరూ సీనియర్లు కాదు, ఎవరూ జూనియర్లు కాదు, నాయకులందరూ ఏదో ఒక పార్టీ నుంచి వచ్చినవారే. కానీ కాస్త ముందు వెనక. అయితే ఆ మాత్రం దానికే కొంతమంది తాము సీనియర్లమని, మిగతావాళ్లు పార్టీలో తమకు జూనియర్లని తీర్మానించేస్తుంటారు. పాపం.. ఎమ్మెల్యే రోజా పరిస్థితి కూడా ఇప్పుడిలాగే ఉంది.

వైసీపీలో మొదటి నుంచీ ఉన్నా కూడా ఆమెకు టీడీపీ నుంచి వచ్చిన నాయకురాలనే పేరుంది. అప్పటివరకు కాంగ్రెస్ లోనే ఉండి.. జగన్ తో పాటే బయటకికొచ్చినవారు రోజాని పూర్తిగా టార్గెట్ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రోజాకు నగరిలో తిప్పలు తప్పడం లేదు. 

ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి రోజాకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేయాలనేది వీరి టార్గెట్ అంటున్నారు. అందు కోసం ఇప్పటినుంచే ఆ వర్గం గ్రూపు రాజకీయాలను నడుపుతున్నట్టు తెలుస్తోంది.

రోజాపై సింపతీ ఉందా.. లేదా..?

వైసీపీలోకి వచ్చిన తర్వాత జగన్ పై మాట పడనిచ్చేవారు కాదు రోజా. ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు ఘాటుగా కౌంటర్లు ఇచ్చేవారు. బైబై.. బాబు అనే డైలాగ్ ని 2019 ఎన్నికల సందర్భంగా బాగా పాపులర్ చేశారు. పార్టీ కోసం రోజా పడిన కష్టాన్ని ఎవరూ శంకించలేరు. కానీ ఇప్పుడు నగరిలో ఉన్న పరిస్థితులు వేరు. 

రోజా ఎంట్రీతో స్థానిక నేతల హవా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో స్థానిక ఎన్నికల సమయంలో అక్కడ గొడవ మొదలైంది. పరిషత్ ఎన్నికల్లో నగరి నేతలు రోజాకు ఎదురు తిరిగారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకే చెందిన మరో వర్గం రోజాకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలో దింపింది. ఎమ్మెల్యే మాట కూడా లెక్కచేయడంలేదంటూ ఓ దశలో రోజా వాపోయారు, ఆ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఊరుకున్నారు.

మీటింగ్ తో ఫైటింగ్..

ఈనెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల విషయంలో అప్పుడే ఆధిపత్య పోరు మొదలైంది. రోజాకు వ్యతిరేక వర్గంగా ఉన్న ఆరుగురు నాయకులు కలసి ఒక సమావేశం పెట్టుకున్నారు. 

ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా తమ ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుకలు జరపాలని తీర్మానించారు. రోజాని బాయ్ కాట్ చేస్తామంటున్నారు. 2024 వరకు ఇదే ఐక్యత కొనసాగించి… తమలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు నగరి నేతలు.

మీతో మీ ఎమ్మెల్యే రోజా..

మరోవైపు తనపై పెరుగుతున్న అసమ్మతిని, జనాల వైపు నుంచి నరుక్కొస్తున్నారు రోజా. తనపై ప్రజల్లో సింపతీ పెరిగేలా ట్రై చేస్తున్నారు. ఇటీవల ఆమె వరుసగా పలు కార్యక్రమాలు చేపట్టారు. క్రీడా పోటీలు నిర్వహించి అన్ని గ్రామాల్లో కలియదిరిగారు. 'మీతో మీ ఎమ్మెల్యే' అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టి, ప్రతి రోజూ ఒక్కో ఊరికి వెళ్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. తను చేసే ప్రతి పనిని సోషల్ మీడియా, మెయిన్ మీడియా ద్వారా హైలెట్ అయ్యేలా చూసుకుంటున్నారు.

ఇలా 2024నాటికి జనంలో బలం పెంచుకుని వైరి వర్గానికి అవకాశమే లేకుండా చేయాలనుకుంటున్నారు రోజా. ప్రజలే తన తరపున వైసీపీ టికెట్ డిమాండ్ చేసే విధంగా ఆమె స్కెచ్ వేశారు. అయితే రోజా వ్యతిరేక వర్గం కూడా అంతే పట్టుదలతో ఉంది. వచ్చే ఎన్నికలనాటికి రోజాను పూర్తిగా తొక్కేయాలని చూస్తోంది. నగరి పోరులో ఏ వర్గం పైచేయి సాధిస్తుందో మరో రెండేళ్లలో తెలిసిపోతుంది.