గంటా అందరివాడు

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనది రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. ఆయన తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం, కాంగ్రెస్ అటు నుంచి…

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనది రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. ఆయన తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం, కాంగ్రెస్ అటు నుంచి మళ్లీ తెలుగుదేశం ఇలా పార్టీలు మారారు. 2019లో టీడీపీ ఓటమి తరువాత గంటా వైసీపీ వైపు వస్తారని, జనసేనలో చేరుతారని వార్తలు వినిపించాయి.

కానీ అవన్నీ తప్పు అని ఆయనే చెప్పేశారు. తాను తెలుగుదేశంలోనే ఉంటాను, మరింత యాక్టివ్ అవుతాను అని స్పష్టం చేశారు. గంటాకు అన్ని పార్టీలలోనూ మిత్రులు ఉన్నారు. అందరు నాయకులతోనూ మైత్రీ సంబంధాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో ఆయనకు జనసేనతోనూ అనుబంధం ఉందనుకోవాలి.

ఈ నేపధ్యంలో చూస్తే గంటా కర్నాటకలో కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు, సీఎం క్యాండిడేట్ గా ప్రచారంలో ఉన్న కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ని కలుసుకుని అందరికీ ఆశ్చర్యపరచారు. డీకే శివకుమార్ కర్నాటకలో పొలిటికల్ బిగ్ షాట్. ఆయనతో గంటాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న సంగతిని ఆయనే బయటపెట్టారు.

డీకే శివకుమార్ విశాఖ వచ్చిన సందర్భంగా ఆయన బస చేసిన చోటకు వెళ్ళిన గంటా శాలువా కప్పి ఆయన్ని సన్మానించారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని గంటాయే చెప్పారు కాబట్టి ఎవరూ కంగారు పడాల్సినది లేదు. గంటా ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుడు. ఆయన కాపు నేతలతో పార్టీలకు అతీతంగా భేటీలు వేస్తారు.

ఈ విధంగా గంటా అందరివాడుగా ఉంటున్నారు. గంటా తెలుగుదేశంలో భిన్నమైన నేతగానే చూడాలి. ఆయన పార్టీ చట్రానికి ఇమడని నేతగానే భావించాలి. ఇతర నాయకులు పార్టీ నేతలతో తప్పించి మరెవరితోనూ ఎక్కడా కనిపించరు. గంటాకు మాత్రమే ఆ చొరవ స్వేచ్చ ఉన్నాయని అనుకోవాలి. గంటాని టీడీపీ విస్మరించలేదు. ఆయన వైఖరి ఏ విధంగా ఉన్నా తమతో ఉన్నారు కదా అని భావించడం తప్ప ఏమీ చేయలేదనే అంటారు.