‘ది గ్రేటెస్ట్ స్క్రిప్ట్ రైటర్!’

సినిమా పరిశ్రమలో అసామాన్యమైన టాలెంట్ ఉన్న స్క్రిప్ట్ రైటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిర్మాతలు దర్శకులు ఎవరైనా సరే.. తాము సొంతంగా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా సరే.. సదరు మహా నిపుణులను ప్రత్యేకంగా…

సినిమా పరిశ్రమలో అసామాన్యమైన టాలెంట్ ఉన్న స్క్రిప్ట్ రైటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిర్మాతలు దర్శకులు ఎవరైనా సరే.. తాము సొంతంగా పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా సరే.. సదరు మహా నిపుణులను ప్రత్యేకంగా పిలిపించి, ఆ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దించుకుంటారు. కొన్ని సందర్భాలలో పూర్తి స్క్రిప్టు రాసిన కొత్త రచయిత కంటే.. తుది మెరుగులు దిద్దిన నిపుణుడికే ఎక్కువ రెమ్యూనరేషన్ గిట్టుబాటు అవుతుంటుంది కూడా. అయితే కొన్ని సినిమాలలో ఇలాంటి నిపుణులైన స్క్రిప్ట్ రైటర్లకు థాంక్స్ కార్డులు మాత్రం పడతాయి..  చాలా సినిమాలలో అది కూడా ఉండదు. కేవలం డబ్బు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. 

ఈ సిద్ధాంతం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కూడా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మినహాయిస్తే.. జగన్ ఓటమిని, పరాభవాన్ని కోరుకుంటున్న అన్ని పార్టీలు, అందరు నాయకులు.. ఒకే ఒక్క మహా నిపుణుడి స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటున్నారు. గ్రేటెస్ట్ పొలిటికల్ స్క్రిప్ట్ రైటర్ మరెవరో కాదు.. దేశంలోనే తనను మించిన వారు లేరని చెప్పుకునే 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశీలి నారా చంద్రబాబు నాయుడు!

‘ యాంటీ జగన్ ’ అనే జోనర్ లో  ఇప్పటికే ఆయన అనేక అనేక స్క్రిప్టులు రచించారు. కేవలం సొంత పార్టీ నాయకులకు మాత్రమే కాదు, జనసేన పవన్ కళ్యాణ్ కు,  బిజెపిలోని తన తొత్తులు తైనాతీలకు, ఇంకా జగన్ వ్యతిరేకత ఎజెండాగా కలిగిన కమ్యూనిస్టు పార్టీలకు, సామాజిక ఉద్యమాల ముసుగులో బతికే వారికి, అమరావతి పేరుతో పోరాటం సాగించే ల్యాండ్ మాఫియా కు అందరికీ ఆయన ఒక్కడే స్క్రిప్టులు సరఫరా చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ స్క్రిప్టు రచనా సామర్థ్యం విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎన్నికలు ఏడాది దూరంలో ఉన్నాయని ఈ రాజకీయ తావరణాన్ని గమనించిన ఎవ్వరికీ అనిపించదు. పార్టీలన్నీ తమ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఒకరి మీద ఒకరు కత్తులు దూస్తున్నారు. విరుచుకుపడుతున్నారు. ఆత్మస్తుతులు, పరనిందలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడే మనల్ని మనం పొగిడేసుకోవాలి.. ప్రత్యర్థుల్ని నిండుగా నోరారా తిట్టిపోయాలి. లాజిక్కులు గీజిక్కులు చూసుకోకూడదు.. ఎలా పడితే అలా దాడికి దిగాలి. ఇలాంటి దూకుడు అన్ని పార్టీల్లోనూ ఉంది. అయితే ఇంకో కోణంలో చూసినప్పుడు.. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒకవైపు ఉంది. తతిమ్మా పార్టీలన్నీ మరో వైపున ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే చంద్రబాబునాయుడు తన సీనియారిటీని, వ్యూహచాతుర్యాన్ని చూపిస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించడం కోసం మిగిలిన పార్టీలు అన్నీ అనుసరిస్తున్న వ్యూహాలు.. చంద్రబాబు మేథో సంపత్తి నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కు కూర్చునే నిలయవిద్వాంసులు, జీతగాళ్లు అయిన నాయకులు.. అచ్చంగా చంద్రబాబు ఓకే చేసిన స్క్రిప్టును చదివి తరిస్తుంటారు. దానిని అర్థంచేసుకోవచ్చు. కానీ, ఇతర పార్టీలు మాట్లాడే మాటలు, అనుసరించే వ్యూహాలు అన్నీ కూడా చంద్రబాబునాయుడు స్క్రిప్టు ప్రకారమే సాగుతుండడం విశేషం. 

ఎటూ వార్ధక్యం కారణంగా మూవ్‌మెంట్ తగ్గించుకున్న చంద్రబాబునాయుడు.. బయట సమావేశాలకు వ్యూహాత్మక వేళలను ఎంచుకుంటున్న చంద్రబాబునాయుడు..  తన డెన్ లో కూర్చుని.. జగన్ ప్రత్యర్థులందరినీ తనే స్వయంగా గైడ్ చేస్తున్నారు. కేవలం జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీలను మాత్రమే కాదు. ప్రజా సంఘాలలో, స్వచ్ఛంద సంస్థలను,  ఉద్యోగ సంఘాలను కూడా చంద్రబాబు నాయుడు గైడ్ చేస్తూ ఉండడం విశేషం. ఆయన స్క్రిప్ట్ రచనా సామర్థ్యాన్ని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

సుపుత్రుడి విషయం ఓకే..

నారా లోకేష్ ను తన వారసుడిగా సీఎం పీఠంపై అధిష్టింపజేయాలని కలగంటూ ఉండే చంద్రబాబు.. తన కొడుకు కోసం స్క్రిప్టు రాయడం సబబే. నిజానికి మూడేళ్ల కిందట తెలుగుదేశం భవిష్యత్ ప్లాన్ వేరు! 2024 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా.. స్వయంగా చంద్రబాబునాయుడే పాదయాత్ర చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఏడుపదులు దాటిన వృద్ధాప్యంలో.. ఆయన రాష్ట్రమంతా పాదయాత్ర సాగిస్తే.. జస్ట్.. ఆ ముసలితనం రాబట్టగల సానుభూతి చాలు..  స్ట్రెయిట్ గా అధికారంలోకి వచ్చేస్తాం అనేది ఆయన వ్యూహం. కానీ.. కాలం గడిచేకొద్దీ.. పాదయాత్ర చేయగలపాటి శక్తి తనలో ఉడిగిపోయిందని ఆయనకు అర్థమైంది. అదే సమయంలో.. తన కొడుకును ప్రొజెక్టు చేసే కోరిక కూడా బలపడింది. అందుకే నారా లోకేష్ పాదయాత్రను ప్లాన్ చేశారు. కుప్పంనుంచి ఆరంభించేలా చూశారు. అది చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం. అంతో ఇంతో జనం పోగవుతారు.. అని ఆశించారు. అనుకున్నట్టే జరిగింది. కుప్పంలో కొంచెం జనం వెంట ఉండగా.. పాదయాత్ర సాగింది. ఆ తర్వాత జనాదరణ ఢమాల్ మని పడిపోయింది. 

జనాదరణ సరే.. మాటలు, ప్రభుత్వం మీద నిందలు వేసే వ్యూహాలు అన్నీ ఎలా సాగుతున్నాయి? అంతా చంద్రబాబు స్క్రిప్టు పుణ్యమే. యాత్ర లాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఖచ్చితంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆయన స్క్రిప్టులో మొదటి పాయింట్ వాటిని అతిక్రమించడం. నిబంధనలు అతిక్రమిస్తే.. పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఆ వెంటనే పోలీసుల మీద నిందలు వేయాలి. వారితో ముడిపెట్టి ప్రభుత్వం మీద నిందలు వేయాలి. అంతిమంగా.. తన యాత్రను చూసి జగన్ భయపడిపోతున్నాడని డప్పు కొట్టుకోవాలి. కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటించినప్పుడు అనుసరించిన సూత్రం కూడా ఇదే. అదే కొడుక్కు కూడా నేర్పాడు. 

తన పర్యటనలో ఎక్కడపడితే అక్కడ మైకు వాడకూడదని లోకేష్ కు చాలా స్పష్టంగా తెలుసు. కానీ కావాలని మైకు ఉపయోగిస్తాడు. మైకును పోలీసులు సీజ్ చేశారని గోల చేస్తాడు. పోలీసులు కేసు నమోదు చేయగానే.. నా మీద ఎన్ని వందల కేసులైనా పెట్టుకోండి.. నాకేం భయంలేదు.. అని డాంబికంగా రెచ్చిపోతాడు. అక్కడికేదో.. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి గుండె చూపించిన అల్లూరి సీతారామరాజు తానే అన్నట్లుగా బిల్డప్ ఇస్తాడు. ఇవన్నీ స్క్రిప్టులో భాగమే. 

లోకేష్ యాత్ర పేలవంగా సాగుతుండే సరికి స్క్రిప్టు కాస్త మారింది. షెడ్యూలు ప్రకారం ఎన్నడో ముగిసిపోవాల్సిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని పాపం.. ఈ వయసులో చంద్రబాబు మళ్లీ భుజాన వేసుకుని ఊర్లు తిరుగుతున్నారు. ఇదంతా సొంత పార్టీ కోసం రాసుకున్న స్క్రిప్టు.

దత్తపుత్రుడి కోసం ఇంప్రొవైజేషన్..

తన రాజకీయ ప్రసంగాలకే పనిగట్టుకుని మహామహా రచయితలతో స్క్రిప్టు రాయించుకునే అలవాటున్న పవన్ కల్యాణ్.. పాపం తన జీవితానికి ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పాపం.. మార్షల్ ఆర్ట్స్, సినిమా హీరోయిజం ప్రభావం, మిలిటరీ పట్ల ఉండే వ్యామోహాలు ఇవన్నీ కలిసి ఆయన ముచ్చటపడి ఒక ఆలివ్ గ్రీన్ కలర్ వాహనం తయారు చేయించుకున్నారు. సవాలక్ష మందిని సంప్రదించి, తాంత్రిక పూజల మీద విశ్వాసం ఉన్న సదరు పవన్ కల్యాణ్ ఆ వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. ఆ వారాహిని అధిరోహించి.. రాష్ట్రమంతా పర్యటించి.. ప్రభుత్వం మీద నిప్పులు చెరగాలని కలగన్నారు. ఆయన తనకు తాను సొంతంగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం అందుకు ముహూర్తం 2022 దసరా! కానీ ఆ స్క్రిప్టు ఇంప్రొవైజ్ చేయబడింది. చంద్రబాబునాయుడు దానినిన అప్ గ్రేడ్ చేశారు. వారాహి యాత్రను వెనక్కు నెట్టారు. 

పవన్ కల్యాణ్ తో ఎలాంటి మాయమాటలు చెప్పారో గానీ.. ఆయన వారాహి యాత్ర మొదలైతే.. మీడియా అటెన్షన్ మొత్తం తన కొడుకు యాత్ర మీదినుంచి పక్కకు మళ్లిపోతుందని చంద్రబాబు భయం. అందుకే పవన్ ను స్కేప్ గోట్ చేశారు. పవన్ కల్యాణ్ వారాహికి పూజలైతే రెండు రాష్ట్రాల్లోనూ చేయించారు గానీ.. ఎక్కడా ఇప్పటిదాకా ఒక కిలోమీటరు యాత్ర కూడా చేయలేదు. ఎప్పటికి చేస్తారో కూడా తెలియదు. రాజకీయంగా ఎన్నికల దిశగా అడుగులు వేయడానికి.. చంద్రబాబునాయుడు స్క్రిప్టు తర్వాతి పేజీలకోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. 

కమలదళంలో కూడా బాబు స్క్రిప్టేనా?!

ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగుదేశం, జనసేన ఓకే.. కానీ బిజెపిలో కూడా బాబు స్క్రిప్టు ప్రకారమే కొందరు నేతలు నడుస్తున్నారనే అనుమానం కూడా తాజాగా కలుగుతోంది. బిజెపిలో చంద్రబాబు కోవర్టులు, స్లీపర్ సెల్స్ లాగా పనులు చక్కబెడుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. అయితే తాజాగా ఆ పార్టీనుంచి బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ మాటలు విన్నతర్వాత.. ఆ స్క్రిప్టు చంద్రబాబు డెన్ లో తయారైందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

కన్నా విమర్శలు ప్రధానంగా సోము వీర్రాజు మీదనే సాగాయి. ఆయనను టార్గెట్ చేశారు. ఎంతగా అంటే, అధిష్ఠానం సోమును ఆ పదవిలో కొనసాగడం గురించి పునరాలోచన చేసేటంతగా విమర్శలు చేశారు. మరింత మంది నాయకులు కూడా పార్టీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఇదంతా సోము పుణ్యమే అని వాక్రుచ్చారు. 

సోము వీర్రాజు మీద కమల నాయకుల ఆరోపణలు శృతిమించుతున్న కొద్దీ.. అవన్నీ చంద్ర స్క్రిప్టులో భాగమేనా అనిపిస్తోంది. ఎందుకంటే, సోము వీర్రాజు చంద్రబాబు కలలకు అడ్డుగోడగా నిలిచిన వ్యక్తి. జనసేనతో పాటు, బిజెపితో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు కోరిక. కానీ సోము ఆ ఆలోచనను ఎంతగా వ్యతిరేకిస్తున్నారంటే.. ఆయన రాష్ట్ర సారధిగా ఉండగా, అది సాధ్యం కాదని అందరికీ అనిపిస్తోంది. కాబట్టి.. సోము నాయకత్వంపై బిజెపిలో భయం పుట్టించేలా.. ఆయన వ్యూహాత్మకంగా ఇలాంటి విమర్శలు చేయిస్తున్నారనే విశ్లేషణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

ఎర్ర పార్టీల సంగతి సరేసరి..

వామపక్ష పార్టీలు రెండూ చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే మెదలుతూ ఉంటాయి. చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం తహతహలాడుతుంటారు. అయితే ఎర్ర నాయకులు ఆయనను పల్లెత్తు మాట అనరు. పైగా ఆయన భజన చేస్తుంటారు. ఆయన స్క్రిప్టుకు అనుగుణంగా జగన్ మీద బురద చల్లుతుంటారు. కుప్పంలో ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించి పోవాలని పోలీసులు చంద్రబాబుకు చెబితే, వామపక్ష నాయకులకు కోపం వస్తుంది. జీవో మీద వారు కోర్టులో కేసులు వేస్తారు.

చంద్రబాబుకు చీమ కుట్టినా సరే వారికి నొప్పి కలుగుతుంది. ఆయన తమను దగ్గరకు రానీయడు, తమతో పొత్తు పెట్టుకోడు, తమకు విలువ ఇవ్వడు. కానీ ఆయనలో ఉన్న మ్యాజిక్ ఏమిటో గానీ.. ఆయన స్క్రిప్టు ప్రకారమే వామపక్ష నాయకులు కూడా నడుచుకుంటూ.. చంద్రబాబు కోరిక మేరకు జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు చేస్తూ ఉంటారు. 

పార్టీలు మాత్రమే కాదు..

కేవలం పార్టీలు మాత్రమే కాదు. ప్రజాఉద్యమాలు నడిపే వారు కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్టు ప్రకారం నడుచుకుంటూ ఉండడం చిత్రం. చిన్న ఎగ్జాంపుల్ గా.. పాత పెన్షన్ గొడవను తీసుకుందాం. దానికోసం జగన్ మీదికి ఎగబడి ఉద్యమాలు చేస్తున్న, నిందలు వేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఎవ్వరూ.. చంద్రబాబు దగ్గరకు వెళ్లి అడగరు. ప్రభుత్వాన్ని తిడతారు, ఈసారి ప్రభుత్వం నాదే అని ప్రల్లదనంగా పలికే చంద్రబాబు వద్దకెళ్లి పాత పెన్షన్ హామీ ఇవ్వమని అడగరు. చివరికి కొన్ని అలవిమాలని కోరికలతో పోరాటాలు చేసేవాళ్లు.. పవన్ కల్యాణ్ ను కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి గానీ.. చంద్రబాబు వద్దకెళ్లిన దాఖలాలు లేవు. 

విషయం ఏంటంటే.. వారికి స్క్రిప్టు మరియు ఫండింగ్ ఇచ్చేసి పోరాటాన్ని వెనుకనుంచి నడిపిస్తారే తప్ప చంద్రబాబునాయుడు తన వద్దకురానివ్వరని ఒక వదంతి. తన వద్దకు వస్తే మాట ఇవ్వాల్సి వస్తుంది. ఆ హామీ నిలబెట్టుకోవడం సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన అలాంటి కుయత్నాలను సాగిస్తుంటారు.

అమరావతి పోరాటం సంగతేమిటి? చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే అమరావతినుంచి తిరుమల దాకా పాదయాత్ర సాగింది. ప్రతిచోటా తెలుగుదేశం వాళ్లే వారికి ఏర్పాట్లు చేశారు. ఆతిథ్యం ఇచ్చారు. అది మహా సక్సెస్ అని ఊదరగొట్టారు. అదే సమయంలో.. యాత్ర అంత ప్రశాంతంగా జరగడం చంద్రబాబుకు నచ్చలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే తప్ప ఆయన మనసు శాంతించదు. జగన్ సర్కారును నిందించడానికి అవకాశం దొరకదు. అందుకనే.. అమరావతినుంచి అరసవెల్లి దాకా యాత్రకు స్క్రిప్టు అందించారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తోంటే.. బతుకులు బాగు పడతాయని వారు మురిసిపోతుంటే.. వారి కడుపు మండేలా ఈ యాత్రకు స్కెచ్ వేశారు. 

సమస్యలు వస్తాయని పోలీసులు నిరాకరిస్తే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు. ఆ యాత్రలో స్థానికుల శాంతియుత నిరసనలతో మామూలుగా సాగుతోంటే.. రైతుల ముసుగులోని అమరావతి యాత్రలోని వారే రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సంఘటనలు అనేకం రికార్డు అయ్యాయి. తీరా పోలీసులు, కోర్టు నిర్దేశించిన నిబంధనల్ని అచ్చంగా అమలు చేస్తూ.. అందరి ఐడీకార్డులు కూడా చూపమని అడిగేసరికి.. యాత్ర అటకెక్కింది. అప్పటిదాకా యాత్రలో పాల్గొన్నది చంద్రబాబు జీతగాళ్లు, పెయిడ్ కూలీలే తప్ప మరొకరు కాదని అర్థమైంది. 

ఇలా అటు పార్టీలకు, ఇటు ప్రజాసంఘాలకు, జగన్ ను తిట్టడానికి ఎవరు పూనుకుంటే వారందరికీ స్క్రిప్టులు అందిస్తూ, వ్యూహాలు అందిస్తూ చంద్రబాబునాయుడు చాలా బిజీగా గడుపుతున్నారు. మరి ఆయనకంటె అద్భుతమైన గ్రేటెస్ట్ స్క్రిప్ట్ రైటర్ వేరే ఎవరు ఉండగలరు?

.. ఎల్. విజయలక్ష్మి