తిరుమల పారిశుధ్య కార్మికుల ఆందోళనతో కొండపైన భక్తులకు కష్టాలు ఎదురయ్యాయి. గదులను సమయానికి శుభ్రం చేసే దిక్కులేకపోవడంతో, వెంటనే వాటిని భక్తులకు కల్పించడానికి వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గదుల కోసం భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం అంతిమంగా జగన్ ప్రభుత్వంపై పడుతోంది. ఎందుకంటే పారిశుధ్య కార్మికుల పోరాటం ప్రభుత్వంపైన్నే కాబట్టే.
ఎఫ్ఎంఎస్ (ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్) కింద పనిచేసే తమను టీటీడీ కార్పొరేషన్లో కలపాలంటూ కార్మికులు గత వారం రోజులుగా ఉద్యమ బాట పట్టారు. దీంతో విధులను బహిష్కరించాల్సి వచ్చింది.
ఏ వ్యవస్థలోనైనా పారిశుధ్య కార్మికులు అత్యంత క్రియాశీలకం. టీటీడీ కార్పొరేషన్లో కలపడం వల్ల ఉద్యోగ భద్రత వుంటుందనేది కార్మికుల చిన్న ఆశ. దీనికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రధాన కారణం.
జగన్ అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో హామీ నెరవేర్చాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వినతిపత్రాలతో ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి దిగి రాకపోవడంతో ఉద్యమమే శరణ్యమని కార్మికులు రోడ్డుకెక్కారు. అయితే కాంట్రాక్టర్ మాత్రం తక్కువ మంది సిబ్బందితో పారిశుధ్య పనులు చేయిస్తున్నాడు.
తిరుమలకు వచ్చే వారందరికీ సేవలందించే స్థాయిలో పారిశుధ్య పనులు జరగడం లేదు. భక్తులు ఖాళీ చేసిన గదులను శుభ్రం చేయడానికి తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కాంట్రాక్టర్కు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. దీంతో గదులను శుభ్రం చేసేందుకు గంటల సమయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గంటల తరబడి వేచి ఉన్నా గదులు కేటాయించడం లేదని.. మరోవైపు సమాధానం చెప్పే అధికారులే కరువయ్యారని భక్తులు వాపోతున్నారు.