ఉక్కు సంకల్పానికి త్రి శతదినోత్సవం

విశాఖ ఉక్కు పోరాటానికి నేటితో 300 రోజులు పూర్తి అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోతున్నట్లుగా కేంద్రం చావు కబురు చెప్పినది ఈ ఏడాది జన‌వరి 27వ తేదీన. దాంతో…

విశాఖ ఉక్కు పోరాటానికి నేటితో 300 రోజులు పూర్తి అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోతున్నట్లుగా కేంద్రం చావు కబురు చెప్పినది ఈ ఏడాది జన‌వరి 27వ తేదీన. దాంతో నాటి నుంచే ఉక్కు పొరాటానికి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున సిద్ధమయ్యయి.

మొదట్లో రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా ముందుకు వచ్చాయి. అంతా కలసి గట్టిగానే ఆందోళన చేశారు. అయితే తరువాత కాలంలో చూసుకుంటే రాజకీయ వేడి మెల్లగా తగ్గిపోయింది. ప్రజల మద్దతు కూడా పెద్దగా పొందే ప్రయత్నం అయితే  గట్టిగా ఎక్కడా జరగలేదు.

దాంతో ఉక్కు కార్మికుల గోడు ఒంటరిగానే మిగిలింది. అదే సమయంలో ఏపీలో ఉన్న రాజకీయ  పరిస్థితులను అనువుగా మార్చుకుని కేంద్రం దూకుడుగా అడుగులు వేయడం మొదలెట్టింది. కధ ఎంతదాకా వచ్చేసింది అంటే ఉక్కు లోకి కీలకమైన విభాగాలను మెల్లగా ప్రైవేట్ పరం చేయడానికి టెండర్లు పిలిచేటంత దాకా.

ఇదిలా ఉంటే ఎంపీలు పార్లమెంట్ లో ప్రశ్నలు వేస్తున్నారు. సమాధానాలు రాబడుతున్నారు. అయితే మాత్రం కేంద్రం వైఖరి మాత్రం ఇంచి కూడా మార్చలేకపోతున్నారు. అటు ఢిల్లీలో ఇటు గల్లీలో కూడా పోరాటాలు చేసినా కూడా ఉక్కు ప్రైవేట్ రూట్ నుంచి బయటపడలేకపోతోంది.

దీంతో కార్మిక సంఘాలు తమ పోరుని మరింతగా ఉధృతం చేయాలని భావిస్తున్నారు. మూడు సాగు చట్టాలను రద్దు చేసుకున్న తరహాలోనే కేంద్రం వెనకడుగు వేస్తుంది అన్న ఆశతో ఇంకా ఉన్నారు. మరి ఈసారి జరిగేది మలి విడత ఉద్యమంటున్నారు. 

ఈ దెబ్బతో కేంద్రం దిగి రావాలని కూడా నినదిస్తున్నారు. చూడాలి మరి ఉక్కు సంకల్పం నెగ్గి తీరుతుందేమో. అలా జరగాలని, కేంద్రం వెనక్కు వెళ్ళాలనే అంతా కోరుకుంటున్నారు.