మారకంలో 2000 రూపాయల నోటును చూసి చాలా కాలం అవుతోంది దేశ ప్రజలు. ఏటీఎంకు వెళ్లినా వస్తే ఐదు వందల రూపాయల నోట్లు, పరిమిత మొత్తంలో వంద రూపాయల నోట్లు. ఏటీఎం నుంచి రెండు వేల రూపాయల నోటు చేతిలోకి వచ్చి చాలా కాలం అయిపోయిందనే భావన ఉంది ప్రజల్లో. ఇక రెండు వేల రూపాయల నోటుకు చిల్లర కోసమో తిరిగో, ఎవరికైనా ఆ మొత్తానికి చిల్లర ఇచ్చిన దాఖలాలు, రోజువారీ వ్యాపారంలో ఉన్న వారికి కూడా తగ్గిపోయాయి! స్థూలంగా రెండు వేల రూపాయల నోటు ఉండీ లేనట్టుగా మారింది పరిస్థితి.
ఈ అంశం గురించి పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా ప్రస్తావన తప్పదు. రెండు వేల రూపాయల నోటును కేంద్రం రద్దు చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో.. ఎంపీలు ఈ ప్రశ్నను అడుగుతూ వస్తున్నారు ప్రతిసారీ. ఇంతకీ రెండు వేల రూపాయల నోటు ఉండబోతోందా? లేదా ఏ అర్ధరాత్రో రద్దు ప్రకటన వస్తుందా? అని వారు అడుగుతున్నారు.
రెండు వేల రూపాయల నోటు విషయంలో రద్దు ప్రచారం ఎంత వరకూ వచ్చిందంటే.. సామాన్య ప్రజలు, తోపుడు బండ్ల మీదో, ఫుట్ పాత్ ల మీద వ్యాపారం చేసుకునే వాళ్లు.. వాటిని తీసుకోవడానికి కూడా వెనుకాడే పరిస్థితి వచ్చిందామధ్య. అయితే ఆ నోటును రద్దు చేసే ఉద్దేశం లేదని కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది.
అయితే ముద్రణ మాత్రం భారీ ఎత్తున ఆగిపోయినట్టుగా కూడా చెబుతోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని కేంద్రం ఇస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అవసరం మేరకు ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణ పెరిగినట్టుగా ఉంది. ఇక చిరిగిన, చెల్లుబాటు కావడం కష్టమైన రెండు వేల రూపాయల నోట్లు ఆర్బీఐ వద్దకు తిరిగి వెళ్లిపోతున్నాయి. వాటి స్థానంలో రెండు వేల రూపాయల నోట్లే రావడం లేదు. అసలు వాటి ముద్రణే లేదు!
ఈ నేఫథ్యంలో మారకంలో కూడా వాటి విలువ బాగా తగ్గిపోయింది. ఆ పెద్ద నోటు చూద్దామన్నా కనిపించడం కష్టం అయ్యింది. పోపుల పెట్టెలోనో, బీరువాలోనో ఇంట్లో ఎవరికీ తెలియకుండా డబ్బులు దాచుకునే గృహిణుల వద్ద కొన్ని నోట్లు స్ట్రక్ అయిపోయి ఉంటాయి. మిగిలినవి నల్లధనికులు దాచుకుని ఉండొచ్చు, ఇక బ్యాంకుల వద్ద కొద్ది మొత్తాలు ఉండవచ్చు. మారకంలో మాత్రం రెండు వేల నోటు కనిపించడం లేదు.
మూడేళ్ల కిందట దేశంలో మారకంలో ఉన్న కరెన్సీలో రెండు వేల రూపాయల నోట్ల విలువ సుమారు మూడో వంతు! ఇప్పుడు మారకంలో ఈ నోట్ల విలువ కేవలం పదిహేను శాతం. మూడేళ్ల వ్యవధిలోనే దాదాపు సగం నోట్లు గల్లంతయ్యాయని స్పష్టం అవుతోంది. మరి ఇదే తీరే కొనసాగితే.. మరి కొన్నాళ్లలో రెండువేల రూపాయల నోటు రద్దే చేయాల్సిన అవసరం లేకుండా.. రద్దయిపోయేలా ఉంది!