అన్నీ అధికారం పోయాకే గుర్తొస్తాయా గ‌ల్లా?

అదేంటో గానీ, అధికారం పోయిన త‌ర్వాత టీడీపీ నాయ‌కుల‌కు అన్నీ గుర్తు వ‌స్తున్నాయి. రాజ‌ధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లుకుని కిందిస్థాయి నేత‌ల వ‌ర‌కూ అంతా డిమాండ్ చేస్తున్నారు.…

అదేంటో గానీ, అధికారం పోయిన త‌ర్వాత టీడీపీ నాయ‌కుల‌కు అన్నీ గుర్తు వ‌స్తున్నాయి. రాజ‌ధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మొద‌లుకుని కిందిస్థాయి నేత‌ల వ‌ర‌కూ అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాజ‌ధానిని కేంద్రం ప్ర‌క‌టించిందా లేక తామే అసెంబ్లీ వేదిక‌గా నిర్ణ‌యించామా? అనేది వారొక సారి ప్ర‌జ‌ల‌కు చెబితే బాగుంటుంది.

తాజాగా లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ చేసిన ప్ర‌తిపాద‌న ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. జీరో అవ‌ర్‌లో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రాల రాజ‌ధాని నిర్ణ‌యం అంశాన్ని రాజ్యాంగంలోని కేంద్రం జాబితాలో చేర్చాల‌ని, అవ‌స‌ర‌మైతే కొత్త చ‌ట్టం తీసుకురావాల‌ని   ప్ర‌తిపాదించారు. రాజధానిపై హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. 

అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందని, అలాంటప్పుడు బాధ్యత లే దంటే ఎలా? అని ప్రశ్నించారు. 248(1) అధికరణను ఉపయోగించి రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని ఆయ‌న గట్టిగా డిమాండ్ చేశారు.

నాడు యూపీఏ -2 స‌ర్కార్ రాజ‌ధాని అంశంపై ఏర్పాటు చేసిన శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ కాద‌ని, నారాయ‌ణ నేతృత్వంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీలో గ‌ల్లా జ‌య‌దేవ్ ఉన్నారు. అప్పుడు కేంద్రం రాజ‌ధాని కోసం నియ‌మించిన క‌మిటీ ఉండ‌గా, మ‌రో క‌మిటీ ఎందుక‌ని గ‌ల్లా జ‌య‌దేవ్ ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? అలాగే అసెంబ్లీలో చంద్ర‌బాబు కాకుండా, పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని మోడీ చేత రాజ‌ధానిపై ప్ర‌క‌ట‌న చేయించి ఉంటే …. నేడు ఈ గొడ‌వే ఉండేది కాదు క‌దా?

త‌మ అభిప్రాయాలు, అవ‌స‌రాల‌కు భిన్నంగా నిర్ణ‌యాలు జ‌రిగితే మాత్రం కేంద్రం జోక్యం చేసుకోవాల‌ని టీడీపీ డిమాండ్ చేయ‌డంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంది. క‌నీసం సీబీఐని కూడా రాష్ట్రంలో అడుగు పెట్ట‌డానికి వీల్లేదంటూ …. ఏకంగా జీవో జారీ చేసిన నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడిన విష‌యాన్ని గ‌ల్లా జ‌య‌దేవ్ చాలా సౌక‌ర్య‌వంతంగా మ‌రిచిపోయి … అర్థంప‌ర్థం లేని, పొంత‌న లేని ప్ర‌తిపాద‌న‌లు చేయ‌డం అంటే అభాసుపాలు కావ‌డ‌మే.

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు