బాబుకు ఊర‌ట‌నివ్వ‌ని ఖ‌రీదైన లాయ‌ర్ వాద‌న‌లు!

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లోనే చంద్ర‌బాబు మ‌రికొంత కాలం ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబునాయుడిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా చంద్ర‌బాబును జైలు నుంచి విముక్తున్ని…

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లోనే చంద్ర‌బాబు మ‌రికొంత కాలం ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబునాయుడిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైనా చంద్ర‌బాబును జైలు నుంచి విముక్తున్ని చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో టీడీపీ లీగ‌ల్ టీమ్ అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియ‌ల్ రిమాండ్ ఉత్త‌ర్వుల‌ను కొట్టి వేయాల‌ని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా బాబు త‌ర‌పు న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా త‌న పిటిష‌న్‌పై అత్య‌వ‌స‌రంగా వాద‌న‌లు వినాల‌ని కోరారు. త‌న క్ల‌యింట్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని వాదించారు. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి లేకుండా చంద్ర‌బాబును అరెస్ట్ చేశార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ‌కీయ క‌క్ష‌తోనే చంద్ర‌బాబును అరెస్ట్ చేశార‌ని ఆయ‌న వాదించారు.

ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జోక్యం చేసుకుంటూ లూథ్రాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా ప‌ని చేశాన‌న్నారు. ఒక కేసులో కౌంట‌ర్ కూడా దాఖ‌లు కాకుండా వాద‌న‌లు ఎలా వినాల‌ని జ‌డ్జి ప్ర‌శ్నించారు. మీకేమైనా అభ్యంత‌రాలుంటే కేసు విచార‌ణ‌ను మ‌రో బెంచ్‌కు మారుద్దామ‌ని అన్నారు. అయితే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని లూథ్రా అన్నారు.

కౌంట‌ర్ దాఖ‌లైన త‌ర్వాత వాద‌న‌లు వింటాన‌ని జడ్జి పేర్కొన్నారు. అనంత‌రం కేసు విచార‌ణ‌ను ఈ 19కి వాయిదా వేసింది. దీంతో చంద్ర‌బాబుకు ఖ‌రీదైన లాయ‌ర్ ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌లేక పోయారు. ఇదే సీఐడీ క‌స్ట‌డీకి ఇవ్వొద్ద‌ని చంద్ర‌బాబు న్యాయ‌వాదుల విజ్ఞ‌ప్తిని న్యాయ‌మూర్తి మ‌న్నించారు. ఈ నెల‌18వ తేదీ వ‌ర‌కూ బాబును క‌స్ట‌డీకి ఇవ్వొద్ద‌ని హైకోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. బాబును క‌స్ట‌డీ కోరుతూ సీఐడీ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.