అమ్మో పురందేశ్వ‌రి…న‌ట‌న‌లో తండ్రిని మించిపోయారే!

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రిపై సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నార‌నే…

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రిపై సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేస్తున్నార‌నే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నారు. ఆ విమ‌ర్శ‌ల్లో ప‌చ్చి నిజం వుంద‌ని ఆమె చ‌ర్య‌లు తెలియ‌జేస్తున్నాయి.

పురందేశ్వ‌రి నాయ‌క‌త్వంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న పేరును బాబు జ‌న‌తా పార్టీగా మార్చుకుంద‌నే ఆవేద‌న ఆ పార్టీ నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. వెండితెర‌పై ఎన్టీఆర్ మ‌హానటుడ‌నే కీర్తిప్ర‌తిష్ట‌లు సంపాదించుకున్నారు. కానీ రాజ‌కీయ తెర‌పై పురందేశ్వ‌రి మ‌హాన‌టి అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో పురందేశ్వ‌రి బంధుప్రీతి కాస్త బీజేపీ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్ట‌డానికి కూడా వెనుకాడ‌క‌పోవ‌డంపై ఆ పార్టీ శ్రేణులు ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నాయి.

బాబు అరెస్ట్, అనంత‌రం ప‌రిణామాల‌పై పురందేశ్వ‌రి వ్య‌వ‌హ‌రించిన తీరుపై బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తాజాగా పురందేశ్వ‌రి అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టేందుకు సొంత పార్టీ నాయ‌క‌త్వ‌మే ఉత్సాహం చూప‌డం గ‌మ‌నార్హం. ఒక‌ట్రెండు రోజుల్లో పురందేశ్వ‌రి బీజేపీ ప్ర‌యోజనాలకు బ‌దులు, మ‌రిది అయిన చంద్ర‌బాబు రాజ‌కీయ లాభం కోసం ప‌ని చేస్తున్నార‌నే వాస్త‌వం బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వుంది. అస‌లేం జ‌రిగిందంటే…

ఈ నెల 9న చంద్ర‌బాబును నంద్యాల‌లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. 10న ఆయ‌న రిమాండ్‌పై ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆయ‌న్ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ 11వ తేదీ రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు పురందేశ్వ‌రి ఒక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ప్ర‌క‌ట‌న‌ను ఎల్లో మీడియాకు ఆమె పంపారు. టీడీపీ చేప‌ట్టే బంద్‌లో బీజేపీ శ్రేణులు పాల్గొనాల‌ని ఆమె ఆదేశించారు. దీంతో ఆ చాన‌ళ్ల‌లో బ్రేకింగ్ న్యూస్‌గా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

అవినీతి కేసులో చంద్ర‌బాబు అరెస్ట్ అయితే దాన్ని వెంట‌నే ఖండించ‌డం, అలాగే టీడీపీ బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర‌గిలిపోయారు. పురందేశ్వ‌రి ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌పై బీజేపీ నాయ‌క‌త్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బీజేపీ జాతీయ పెద్ద‌లు పురందేశ్వ‌రికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టిన‌ట్టు స‌మాచారం. టీడీపీ బంద్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని పురందేశ్వ‌రిని జాతీయ నాయ‌క‌త్వం ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో పురందేశ్వ‌రి త‌న పేరుతో విడుద‌లైన ప్ర‌క‌ట‌న అవాస్త‌వ‌మ‌ని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. త‌న పేరుతో ఫేక్ ప్ర‌క‌ట‌న జారీ చేసిన వారిపై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని ఆమె హెచ్చ‌రించారు. అయితే ఆ ప‌ని వెంట‌నే పురందేశ్వ‌రి చేయ‌లేదు. ఎందుకంటే ఆ ప్ర‌క‌ట‌న వాస్త‌వం కాబ‌ట్టి. కానీ టీడీపీ బంద్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు ఫేక్ ప్ర‌చారం చేస్తున్నార‌ని, సైబ‌ర్ టీమ్‌కు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పి గంట‌లు గ‌డుస్తున్నా, ఇవ్వ‌క‌పోవ‌డంలో మ‌త‌ల‌బు ఏంట‌ని పురందేశ్వ‌రిని ప్ర‌శ్నిస్తూ పెద్ద ఎత్తున సొంత పార్టీ మీడియా గ్రూపుల్లో ట్రోలింగ్ జ‌రిగింది.

దీంతో ఆమె దిగి రాక త‌ప్ప‌లేదు. రెండు రోజుల ఆల‌స్యంగా ఈ నెల 12న విజ‌య‌వాడ సైబ‌ర్ క్రైమ్ పీఎస్‌లో పురందేశ్వ‌రి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. పురందేశ్వ‌రి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా ద‌ర్యాప్తు చేస్తే… ఆమె ఎంత మ‌హాన‌టో తేలిపోతుంద‌ని సొంత పార్టీ కేడ‌ర్ చెబుతోంది. మిత్ర‌ప‌క్షానికి చెందిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై కేసు న‌మోదైతే 12 గంట‌ల త‌ర్వాత స్పందించిన పురందేశ్వ‌రి, త‌న మ‌రిదిని అరెస్ట్ చేస్తే మాత్రం రెండు గంటల్లోనే రియాక్ట్ అయ్యార‌ని అంటున్నారు. మొత్తానికి బాబు జ‌న‌తా పార్టీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి త‌న తండ్రి స్థాపించిన టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీని నిలువునా పాత‌రేస్తున్నార‌నే ఆవేద‌న ఆ పార్టీ కేడ‌ర్‌లో వుంది.