పునాదులను విస్మరిస్తే శిథిలమే

దర్శి ఓటమినుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? గెలిపించిన వర్గాన్ని ఎమ్మెల్యే అణచివేస్తోంటే ఎలా ఉపేక్షించారు? Advertisement వైఎస్సార్ సీపీ నాయకులు మునిసిపల్ ఎన్నికలతో పాటు స్థానిక జడ్పీ ఎన్నికల ఫలితాలను కూడా చూసుకుంటూ…

దర్శి ఓటమినుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? గెలిపించిన వర్గాన్ని ఎమ్మెల్యే అణచివేస్తోంటే ఎలా ఉపేక్షించారు?

వైఎస్సార్ సీపీ నాయకులు మునిసిపల్ ఎన్నికలతో పాటు స్థానిక జడ్పీ ఎన్నికల ఫలితాలను కూడా చూసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ వేడుకల తర్వాత.. వారు ఆత్మసమీక్ష చేసుకోవాల్సన అవసరాలు కొన్ని ఉన్నాయి. రకరకాల వ్యూహాల నేపథ్యంలో- అనూహ్యమైన నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎలాంటి ఈగోలకు పోకుండా తన నిర్ణయాలను తానే బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పులు ఆయనకే అర్థమౌతాయి. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.

మునిసిపల్ ఫలితాలు.. ఎంతటి దిగ్విజయంగా అయినా కనిపించవచ్చు గాక.. కానీ కొన్ని చిత్రమైన ఫలితాలు వచ్చాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి సొంత వార్డులో అధికార పార్టీ ఓడిపోయింది. ఇదే పరిస్థితి జగన్ మేనమామ విషయంలో కూడా జరిగింది. రవీంద్రనాధరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే.. ఆయన సొంత వార్డులో పార్టీ ఓడిపోయింది. గుంటూరులో ఓటమి ఇంకో తమాషా. వైసీపీ కార్పొరేటర్ హఠాన్మరణం ఉప ఎన్నిక వచ్చింది. 

సిటింగ్ సీటు గనుక, అధికార పార్టీ పథకాలు, ఆదరణ కూడా తోడై సులువుగా గెలిచి ఉండాల్సింది. కానీ.. అక్కడ తెలుగుదేశం గెలిచింది. ఇలాంటి ఫలితాలను పార్టీ నిజాయితీగా సమీక్షించుకోవాలి. పార్టీకి హెచ్చరికల్లాంటి ఇలాంటి పరాజయాల మధ్యలో ‘దర్శి’ ఎన్నిక చాలా కీలకమైనది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది అధికార పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ,  ఆ మునిసిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. మునిసిపాలిటీల పరంగా వారికి ఏకైక పరాజయం అది. ఎందుకిలా?

దర్శి ఓటమి ఎలా జరిగింది?

ప్రకాశం జిల్లాలో రాజకీయం రెడ్డి వర్గం జనాభా ఎక్కువ. వారి ప్రాబల్యం కూడా ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను రాజకీయం రెడ్డి సామాజిక వర్గం శాసించే, కనీసం నిర్దేశించే దశలో ఉంటుంది. నిజానికి రెడ్డి అభ్యర్థులే ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం కూడా రెడ్ల ప్రాబల్యానికి ప్రబల చిహ్నమైన నియోజకవర్గం. ప్రతి ఎన్నికల్లోనూ వారు వైఎస్సార్ వెంటే ఉన్నారు.

నిజానికి రాజకీయం ఏ వర్గం బలంగా ఉంటే వారికే టికెట్ అప్పగించాలి. అయితే దర్శి విషయంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎంపికల విషయంలో ఒక  భిన్నమైన వ్యూహం అనుసరించారు. రెడ్డి వర్గం ఎటూ తన వెంటే ఉంటుందనే నమ్మకంతో ఇతర సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చి కులాల సమతూకం అని చెప్పుకోవాలని భావించారు. నిజానికి ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల ఇలాంటి వ్యూహం అనుసరించారు. ఫలితంగా.. రెడ్డి వర్గానికి బలం ఉన్న అనేక స్థానాల్లో- కమ్మ, కాపు తదితర కులాలకు టికెట్లు దక్కాయి.

అయితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం సగం నిజమే అయింది. రెడ్డి వర్గం మొత్తం ఆయన వెంట నిలబడింది. అభ్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా ఎన్నికల్లో వారందరూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి పనిచేశారు. అలా రెడ్లందరూ కూడా సమష్టిగా పనిచేయడం వల్లనే దర్శిలో కాపు వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల రావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత వక్ర రాజకీయం మొదలైంది.

రెడ్ల అండతోనే గద్దె ఎక్కిన ఎమ్మెల్యే అయిన మద్దిశెట్టి వేణుగోపాలరావు.. రెడ్డి వర్గాన్ని అణగదొక్కడం ప్రారంభించారు. దీనికి తోడు నియోజకవర్గంలో కాపు వర్గం వర్గం వారిని మాత్రమే ప్రోత్సహించడం ప్రారంభించారు. ఎమ్మెల్యే అనుసరిస్తున్న ఇలాంటిపోకడలు రెడ్లకు కంటగింపుగా మారాయి గానీ.. జగన్మోహన రెడ్డిమీద అభిమానంతో మిన్నకుండిపోయారు. అయితే ఎమ్మెల్యే రెడ్లను చిన్నచూపు చూడడం అనేది మునిసిపల్ ఎన్నికల సమయానికి పరాకాష్టకు చేరుకుంది. రెడ్లి వర్గం వారు తమ నిరసనను ఖచ్చితంగా తెలియజెప్పాలనే అనుకున్నారు.

ఠికానా లేని తెలుగుదేశానికి..

దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఠికానా లేదు. నిజం చెప్పాలంటే నెలకిందటి వరకు ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో కనీసం ఇన్చార్జి కూడా లేరు. ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తే.. స్థానికంగా పర్యవేక్షణ చేయడానికి కూడా ఆ పార్టీకి ఇక్కడ మనిషి లేరు. అలాంటి దుస్థితిలో కునారిల్లుతూ ఉన్న తెలుగుదేశం.. ఎన్నిక పూర్తయ్యేసరికి గెలుపుబావుటా ఎగురవేసింది. ఈ పరిణామం ఎలా జరిగింది?

కేవలం ఎమ్మెల్యే మద్దిశెట్టి మీద రెడ్డివర్గంలో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశానికి లాభించింది. రెడ్లందరూ తమ ఐక్యతను నిరూపించుకోవాలనుకున్నారు. విజయానికి సహకరించిన వారిని అణిచివేయాలని అనుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎమ్మెల్యేకు తెలిసేలా చేయాలనుకున్నారు. పరోక్షంగా వారంతా కూడా తెలుగుదేశానికి  సహకరించారు. దాంతో.. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వమే ఆశ్చర్యపోయేలా.. ఇన్చార్జి కూడా లేని పరిస్థితి నుంచి ఆ పార్టీ దర్శి మునిసిపాలిటీని చేజిక్కించుకుంది.

జగన్ వ్యూహాలను సమీక్షించుకోవాలి..

వర్తమాన రాజకీయాలలో కులవ్యూహాలే ఫలితాలను శాసిస్తుంటాయి. ఈ సిద్ధాంతం నిజమే కావచ్చు. కానీ.. బలం ఉన్న కులాన్ని కాదని.. ఇతర సమీకరణాల కోసం వారిని చిన్నచూపుచూస్తే ఫలితం ఎలా ఉంటుందో జగన్ కు గుణపాఠం ఇది. ఇలాంటి నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ బలాన్ని తానే తగ్గించుకుంటున్నాడా అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. తనను అభిమానించే వారిని తానే చేజేతులా దూరం చేసుకుంటున్నాడా అనే అభిప్రాయమూ వినవస్తోంది.

రాజకీయంగా అధినేత ఒక పార్టీ వారికి మాత్రమే పెద్దపీట వేయాలనడం కరెక్టు కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను సమానంగా ఆదరించాల్సిందే. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. అలా కల్పించినప్పుడే జగన్ మంచి ప్రజాస్వామిక నేత అవుతాడు. 

కానీ.. కులాల సమతూకం ముసుగులో.. స్థానికంగా ఉండే కుల సమీకరణలను కాదని.. తనను అభిమానించే వారిని నిర్లక్ష్యం చేయడం తగదని ఆయన తెలుసుకోవాలి. ఎవరైతే పార్టీ మూలాల్లో ఉన్నారో.. పార్టీకోసం అహోరాత్రాలు పనిచేస్తారో.. పార్టీ కోసం తపిస్తారో వారిని దూరం చేసుకోవడం సరికాదని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి.