వ్యూహం లేదు.. బొక్కా లేదు

ఇటీవల జరిగిన నెల్లూరు నగర కార్పొరేషన్, 12 మున్సిపాల్టీల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు సాధించింది. దర్శిలో గెలుపు, కొండపల్లిలో సరిసమానంగా వార్డు స్థానాలు సాధించడం మినహా టీడీపీ తరపున చెప్పుకోవాల్సిందేమీ లేదు. దర్శిలో…

ఇటీవల జరిగిన నెల్లూరు నగర కార్పొరేషన్, 12 మున్సిపాల్టీల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు సాధించింది. దర్శిలో గెలుపు, కొండపల్లిలో సరిసమానంగా వార్డు స్థానాలు సాధించడం మినహా టీడీపీ తరపున చెప్పుకోవాల్సిందేమీ లేదు. దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా టీడీపీ గెలిచిందని చంకలు గుద్దుకుంటున్నారు. వారికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పరాభవం తెలియదా..? కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ గెలిచామని చెప్పుకుంటున్నారు, అలాంటి వారికి నెల్లూరు నగర కార్పొరేషన్లో టీడీపీ స్కోరు జీరో అని తెలియదా..?

ఇవన్నీ తెలిసి కూడా “ఫలించిన టీడీపీ వ్యూహం-వైసీపీలో ఆందోళన” అంటూ.. పచ్చ పత్రికలు రాస్తున్న కథనాలు ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మభ్యపెట్టడానికి..? ఇలాంటి కథలు, కథనాల వల్లే టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోంది. పోరాడి ఓడారు అంటే అదో లెక్క, అసలు పోరాటమే లేకుండా ఫలించిన వ్యూహం అని రాసేసుకుంటే.. టీడీపీ మద్దతుదారులే ఇలాంటి వార్తల్ని అసహ్యించుకుంటున్నారు.

వ్యూహం లేదు.. బొక్కా లేదు..

టీడీపీకి నిజంగానే వ్యూహం ఉంటే 13 చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట గెలుస్తుందా.. అలా గెలిస్తే దాన్ని వ్యూహం అంటారా..? ఆ మాత్రం దానికి వైసీపీలో ఆందోళన మొదలవుతుందా..? టీడీపీ వ్యూహంతో వైసీపీలో కంగారు మొదలైందని, గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమకు ఐదు నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందేంటా అని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని కూడా కథనాలు వండి వార్చింది సదరు పచ్చ దినపత్రిక. 

వ్యూహం అంటూ ఉంటే అదేదో కుప్పంలోనే ఫలించేది కదా. అచ్చెన్న చెప్పినట్టు పార్టీ లేదు బొక్కాలేదు.. టీడీపీకి అసలు వ్యూహం లేదు బొక్కా లేదు.

ఎవరి చెవుల్లో ఎవరు పూలు పెడుతున్నారు..?

గాలి మారింది, టీడీపీ గాలి వీస్తోంది, వైసీపీలో అంతర్మథనం మొదలైంది, పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది అంటూ లెక్కలేనన్ని ఉప శీర్షికలు. ఫలితాలను విశ్లేషించిన కామన్ మ్యాన్ ఎవరైనా టీడీపీకి పోయే కాలం మరింత దగ్గరపడిందనే చెబుతారు. పెయిడ్ ఆర్టికల్స్ ఇగోని శాటిస్ఫై చేయొచ్చు కానీ, ఫలితాలను తారుమారు చేయలేవు, అదే సమయంలో వాస్తవాలను చూడకుండా కళ్లకు గంతలు కట్టి, పతనానికి దారి తీస్తాయి. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది.

ఇలాంటి పేపర్ వ్యూహాల వల్ల ఇప్పటికే టీడీపీ దారుణంగా ఓడిపోయింది. మరింత పతనానికి రెడీ అవుతోంది. జనం చెవిలో పూలు పెట్టాలనుకుంటున్న టీడీపీ.. తమ కార్యకర్తల చెవిలోనే పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెడుతోంది. మునిగిపోయే నావలో నుంచి వారిని బయటకు వెళ్లిపోకుండా కాపాడుకోవాలనుకుంటోంది.