రాయలసీమలో నీటి కరువుతో ఎండిపోయిన భూములున్నాయేమో కానీ.. నీళ్లు ఎక్కువై పాచి పట్టిన ఊళ్లను ఇప్పుడే చూస్తున్నారు! గత మూడేళ్లుగా కరుస్తున్న భారీ వర్షాలతో తడిసిమద్దవుతున్న రాయలసీమకు ఈ సారి అత్యంత భారీ వర్షాలు పరిచయం అయ్యాయి.
దేశంలోనే అత్యంత వర్షపాత లేమితో ఉండే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది కొన్ని ఊళ్లలో మట్టి రోడ్లకు పట్టిన పాచి పోవడం లేదు! గత రెండు నెలలుగా కొన్ని మండలాల్లో అయితే.. ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వీటి ఫలితంగా చెరువులు నిండి మరవలు పోవడమే కాదు, వాగులు వంకలు ఉప్పొంగడమే కాదు.. ఆఖరికి కొన్ని చోట్ల భూములు ఊట ఎక్కాయి. చెరువులకు సమీపంలోని భూముల్లో నీళ్లు ఊరడమే ఈ ఊట ఎక్కడానికి అర్థం. వద్దంటే నీళ్లు.. అనే పరిస్థితి అక్కడ ఏర్పడింది!
ఎవరు ఏమన్నా కానీ.. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి.. రాయలసీమకూ, ప్రకాశం, నెల్లూరు లోని మెట్టప్రాంతానికి భారీవర్షాలు దగ్గరి బంధువులు అయిపోయాయి. రాయలసీమ వరకూ అయితే.. ఇవి చరిత్రలో ఎరగని వర్షాలు! దశాబ్దాలుగా చెరువులు నిండటం అనే విషయాన్ని మరిచిపోయిన రాయలసీమకు పాత వైభవాన్ని తెస్తున్నాయి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.
ఈ చెరువులు ఎందుకు తవ్వించారో.. అనుకున్న వారికి ఇప్పుడు సమాధానం దొరుకుతోంది. విజయనగర సామ్రాజ్యకాలం నాటి చెరువులు అవి. అయితే గత కొన్ని దశాబ్దాల్లో ఏదో అరుదుగా మాత్రమే వాటిల్లోకి నీరు చేరడం. అది కూడా ఆ ముచ్చట కొన్ని చెరువులకే. అయితే ఇప్పుడు సీమలో .. ప్రత్యేకించి చెరువులు అత్యధికంగా కలిగిన అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఖాళీగా ఉన్న చెరువు లేదిప్పుడు!
ఉమ్మడి ఏపీలోనే అత్యంత భారీ తాటాకాల్లో ముందు వరసలో నిలిచే బుక్కపట్నం చెరువు నెలన్నర కిందట మరవపారింది. ఇక అంతే స్థాయి చెరువు అయిన ధర్మవరం చెరువు నలువైపుల నుంచి వస్తున్న నీటితో పోటెత్తుతోంది. జిల్లాలోని అన్ని చెరువులకూ వైభవంగా తెప్పోత్సవాలు చేసుకునే పరిస్థితి వచ్చింది.
సీమలోనే కాదు.. దేశంలోనే అత్యంత డ్రై ఏరియా కదిరి, రాయచోటి ప్రాంతాలు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అయినా గతంలో కూడా మంచి వర్షపాతం నమోదైందేమో కానీ, కదిరి, రాయచోటి ప్రాంతాల్లో మండే ఎండలు తప్ప.. కుంభవృష్టుల ఊసు ఉండేది కాదు. గత రెండేళ్ల నుంచి అక్కడ కూడా పరిస్థితి మారింది. ఈ ఏడాది అయితే.. కదిరి ప్రాంతంలో కురిసింది కుంభవృష్టి అనడం చిన్నమాటే. ఒక నీటి కరువుతో సతమతం అయ్యే హిందూపురం, గోరంట్ల వంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బడిముబ్బడిగా కురిసిన వర్షాలతో తడిసిముద్దయ్యాయి, ముద్దవుతున్నాయి!
సీమలో కురిసిన ఈ భారీ వర్షాలతో ప్రధానంగా జరిగే మేలు భూగర్భ జలాల సమస్య తీరడం. బోర్లు, బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతులు 2012 నుంచి 2019 వరకూ నీటి కరువుతో సతమతం అయ్యారు. ఆ సమయంలో పరిస్థితి ఎలా మారిందంటే.. ఏపుగా ఎదిగిన మామిడి చెట్లు కూడా ఎండిపోయాయి. కనీస వర్షపాతం లేకపోవడం, బోర్ల నుంచినో, బావుల నుంచినో కొట్టి నీటిని వాటికి అందించే పరిస్థితి లేకపోవడంతో.. పచ్చటి చెట్లు భగ్గుమని మాడిపోయాయి. మరి కొన్నాళ్లు అదే పరిస్థితి కొనసాగితే.. నిజంగా రాయలసీమలో మనిషి మనుగడ సాధ్యం అవుతుందా? అనేది స్థానికుల్లోనే ఒక ప్రశ్న రేపింది. మనసులో అదొక భయంగా నిలిచింది. అయితే ఇప్పుడు అక్కడ ప్రకృతి బ్యాలెన్స్ చేస్తోంది.
నిజమే.. ఈ భారీ వర్షాల వల్ల కొంత మేర పంట నష్టం జరిగింది. గత ఏడాది భారీ వర్షాలతో వేరుశనగ పంట దెబ్బతింది. ఈ సారి వరి పంటకు తీవ్ర నష్టమే తప్పడం లేదు. అయితే.. తాగడానికి అయినా నీళ్లు ఉంటాయా? అనే ప్రశ్న ఉన్న చోట.. ఇప్పుడు పాతాళగంగ ఉబికి రావడం సామాన్యమైన విషయం కాదు. కుంటలు, చెరువులు, బావులు నీటితో కళకళలాడే వైభవం చూడనలవి కాదు. ఇది సగటు రాయలసీమ పౌరుడు కోరుకున్న పరిస్థితి. ముందు నీళ్లుంటే.. ఈ పంట కాకపోతే ఇంకో పంటలో రైతు వెదుక్కోగలడు. ఆ నీళ్లే లేని స్థితి మాత్రం ఊహకు అందనంత భయంకరమైనది.
గత ఏడాది కురిసిన వర్షాలతో ఏడాది పాటు కొన్ని చోట్ల రాబోయే కొన్ని సంవత్సరాల పాటు భూగర్భ జలాలు తగ్గవేమో అనే పరిస్థితి ఏర్పడింది. మరి కొన్ని చోట్ల.. గత ఏడాది వర్షాలతో ఒక ఏడాది పాటు భయం లేకుండా గడిచింది. ఇక ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలో భారీ వర్షాలతో మళ్లీ భరోసా లభించింది. ఇప్పుడు నవంబర్ వర్షాలతో.. ఆడాఈడా తేడా లేకుండా సీమంతా నీటి కళను సంతరించుకుంది.
హంద్రీనీవా కళ కూడా!
ఒకవైపు కుండపోత వర్షాలే కాదు.. హంద్రీనీవా ప్రాజెక్టు కూడా రాయలసీమను వీలైనంతగా తడుపుతోంది. హంద్రీనీవా ప్రాజెక్టుతో పాటు, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందించే ప్రాజెక్టుల ద్వారా కూడా నీటి లభ్యత పతాక స్థాయిలో ఉంది. గత ఏడాదే కడప జిల్లాలో ప్రాజెక్టుల్లో నీటి స్టోరేజ్ భారీ స్థాయిలో జరిగింది. ఈ సారికి వ్యాక్యూమ్ కూడా తక్కువే! మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఈ సారి పలుసార్లు నిండింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటి విడుదల సాగుతూ ఉంది. దీంతో సీమ ప్రాజెక్టులకు భారీ స్థాయిలో నీటి లభ్యత చోటు చేసుకుంటోంది. హంద్రీనీవా కాలువలు చిత్తూరు జిల్లా వరకూ సాగుతూ ఉన్నాయి. దీని వల్ల కాలువ చుట్ట పక్క ప్రాంతాల్లో, ఈ కాలువలకు అనుసంధానం అయిన డ్యాములున్న ప్రాంతాల్లో.. నీటి వనరులు పుష్కలం అవుతున్నాయి. ఏతావాతా.. సీమకు స్వప్నమైన జలకళ సాకారం అవుతోంది.