రాజధాని అమరావతికి మద్దతుగా చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొనాలని బీజేపీ నిర్ణయించడం ఆ పార్టీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి అమితానందాన్ని కలిగిస్తోంది.
ఇంత కాలం తాను ఏదైతే కోరుకుంటున్నారో, అదే ఆచరణకు నోచుకుంటుండడం సహజంగానే బీజేపీలోని ఒక సామాజిక వర్గ నాయకులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన కేంద్రహోంమంత్రి అమిత్షా వద్ద ఆమోద ముద్ర వేయించుకుని, ప్రస్తుతం కార్యాచరణకు బీజేపీ నేతలు దిగారు.
విజయవాడలో ఆదివారం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికే తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులకు దాడులు సరైంది కాదన్నారు. రైతులపై దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె కోరారు. అమరావతి, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని ఆమె గుర్తు చేశారు. కేంద్రం నిధు లతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు.
అతి త్వరలోనే ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్నాయుడితో పాటు పలువురు నేతలు అమరావతి పరిరక్షణ సమితి నేతృత్వంలో చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొంటారని ఆమె స్పష్టం చేశారు. అర్థమవుతోంది కదా…పాదయాత్రలో ఎవరెవరు పాల్గొంటారో అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.