దేశ ప్రజలు బీజేపీని కోరి మరీ నెత్తిన కూచోపెట్టుకున్నందుకు మున్ముందు భారీ మూల్యం చెల్లించే పరిస్థితులు కనిపిస్తు న్నాయి. ఏ మాత్రం చిన్న అవకాశం లభించినా రాజకీయాలకి మతం రంగు పులిమి, హిందుత్వ నినాదంతో లబ్ధి పొందాలని దేశ వ్యాప్తంగా ఏకైక అజెండాతో ముందుకు పోవడాన్ని గమనించొచ్చు.
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మొదలుకుని పశ్చిమబెంగాల్ వరకు బీజేపీ హిందుత్వం పేరుతో సాగిస్తున్న దారుణ రాజకీ యాలకు భవిష్యత్ భారత్‌ను భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా…ఇప్పుడు మత రాజకీయాలను బీజేపీ వేగవంతం చేసింది. ఈ దుర్మార్గ రాజకీయాలకు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండడం అదనపు ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్నా, దేశంలో నిలుపుకోవాలన్నా హిందుత్వ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం, ఎప్పటికప్పుడు ఆ కుంపటిని ఆరకుండా చేయడం అనే ఏకైక లక్ష్యంతో దేశస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు నేర్చుకున్న విద్యగా మనకు కనపడుతోంది.
ఈ ఏడాది పశ్చిమబెంగాల్‌లో దసరా నవరాత్రి దుర్గా పూజ చేయరనే ప్రచారాన్ని తీసుకురావడం ద్వారా ఆ రాష్ట్రంలో హిందు ఎజెండాను ముందుకు తెచ్చి, ముఖ్యమంత్రి మమతాబెనర్జీని బద్నాం చేయాలనే ప్రత్నాలను అక్కడి బీజేపీ వేతవంతం చేసింది. బీజేపీ కుట్రలను పసిగట్టిన పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ వెంటనే స్పందిస్తూ….ఓ రాజకీయ పార్టీ కావాలనే ఇలాంటి విష ప్రచారం చేస్తోందని పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ ఏడాది దుర్గా పూజ జరగదని తమ ప్రభుత్వం అన్నట్టు ఎవరైనా నిరూపిస్తే తాను బహిరంగంగా 100 గుంజీలు తీస్తానని ఆమె సవాల్ విసిరారు.
సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాల ద్వారా కొందరు దుర్గాపూజను గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా చేస్తున్న వారిని పట్టుకోవాలని… వారి చేతులతో వారి చెవులే పట్టుకునేలా చేసి ప్రజల ముందు 100 గుంజీలు తీయించాలని పోలీసులను కోరుతున్నట్టు మమత ప్రకటించారు. దీన్నిబట్టి పశ్చిమబెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ఎలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఏపీ విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్యరథం దగ్ధం కావడంపై జగన్ సర్కార్ వెంటనే స్పందించింది. ఈవోను సస్పెండ్ చేయడంతో పాటు అవసరమైతే సీబీఐ దర్యాప్తునకు కూడా వెనుకాడేది లేదని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు మత రాజకీయాలను మానడం లేదు. తాజాగా అంతర్వేది ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
రథం దగ్ధమై హిందువుల హృదయాలు గాయపడుతుంటే.. రెచ్చగొడుతున్నారని చెబుతారా?. రెచ్చగొట్టేది ఎవరు?. హిందువు లను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయో లేదో? ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? అంతర్వేదిలోనే కాదు, మరెక్కడైనా ఏ మతానికి సంబంధించినా ఆస్తి లేదా ఇతరత్రా పవిత్ర వస్తువులకు డ్యామేజీ కావాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుందా? బీజేపీ నేతల మాటల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినడం అటుంచితే…మైనార్టీలు భయాందోళనలకు గురికారా?
సున్నితమైన ఇలాంటి అంశాలపై ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రాజకీయ పార్టీలు దిగజారి మత రాజకీయాలు చేయడం దేనికి సంకేతం? అధికారంలోకి రావాలంటే హిందుత్వం ఒకటే ఎజెండా? అభివృద్ధి కాదా? ఈ రాష్ట్రానికి కనీస తోడ్పాటు కూడా అందించకుండా….కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వ్యవస్థల్ని గుప్పిట్లో ఉంచుకుని ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తున్న వైనాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్న విషయాన్ని బీజేపీ విస్మరించినట్టుంది. అధికారం కోసం అంతర్వేది మొదలుకుని పశ్చిమబెంగాల్ వరకు బీజేపీ ప్రమాదకర ఆట ఆడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.