టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా తాను అసెంబ్లీలో ఇకపై అడుగు పెట్టనని తేల్చి చెప్పారు. మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రం సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. అసెంబ్లీ సమావేశాల రెండోరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్దం కాస్త… చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ వరకూ దారి తీసింది. అసెంబ్లీలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ సందర్భంగా కన్నీళ్ల పర్యంతమయ్యారు. సభకు దండం పెడుతూ బయటికి వెళ్లిపోయారు. ఇదిలా వుండగా చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే….
“ఎనిమిదోసారి ఎన్నికై వచ్చాను. ఈ సభలో 78 నుంచి హేమాహేమీలతో కలిసి పని చేశాను. జాతీయస్థాయిలో కూడా పెద్ద నాయకులతో పని చేశాను. గడిచిన రెండున్నరేళ్లలో ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాం. ఇన్నేళ్లూ ఎన్నో అవమానాలు పడ్డాను. ప్రజల కోసం పోరాడాం. బాధాకర సందర్భాలున్నాయి. పార్టీ పరంగా కించపరిచారు. కానీ అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ ఇలాంటి అవమానాలను చూడలేదు.
కుప్పంలో ఓడిపోయిన తర్వాత నన్ను చూడాలని సీఎం అనడాన్ని కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ఏ పరువు కోసమైతే ఇన్నేళ్లు పని చేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికానో… చివరికి నా భార్యను కూడా చట్టసభలోకి లాగారు. ఇవాళ నా కుటుంబంపై, నా భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారు. మళ్లీ గెలిచిన తర్వాతే వస్తా. వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారు. ఈ సభకో దండం. మళ్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే సభలో అడుగు పెడతా” అంటూ చంద్రబాబు అక్కడి నుంచి నిష్క్రమించారు.