మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకొక పేరు తెరపైకి వస్తూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తోంది. వివేకా హత్య కేసులో నిందితుడు దస్తగిరి వాంగ్మూలం మేరకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి దేవిరెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో కేసుకు మరింత ప్రాధాన్యం పెరిగింది.
తనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్‌కు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రాసిన లేఖ తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఈ లేఖలోని సారాంశం ఏంటంటే వివేకా హత్య కేసులో….ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పేర్కొన్నారు. వివేకా బామ్మర్ది శివప్రకాశ్‌రెడ్డి, భార్య భాగ్యమ్మ, కూతురు డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిల తీరు అనుమానించేలా ఉందని దేవిరెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.
ఇందుకు ఆయన అనేక ఉదంతాలను వివరించడం గమనార్హం. అలాగే హత్యతో తనకెలాంటి సంబంధం లేదని నిరూపించుకు నేందుకు దేవిరెడ్డి ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా రాశారని గమనించొచ్చు. అలాగే చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ నేతలే వివేకా హత్యకు కుట్రపన్ని ఉండొచ్చని ఆయన మరోసారి సంచలన ఆరోపణ చేయడం కీలక విషయంగా చెప్పొచ్చు.
హత్య వెనుక వాస్తవాలను, అసలు కుట్రను వెలికితీసేందుకు వివేకా కుటుంబ సభ్యులను, చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలను విచారించాలని ఆయన కోరారు. దీని వెనుక ఉద్దేశం ఏంటో చెప్పకనే చెబుతోంది. హత్య వెనుక వివేకా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తన అనుమానాలన్ని దేవిరెడ్డి బహిరంగ పరిచారు.
వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత మొదటి నుంచి వేరే ఉద్దేశాలతో దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తూ అమాయకులను వేధించా రని ఆయన ఆరోపించారు. ఓ వర్గం మీడియా కూడా ప్రత్యర్థులను వేధించేందుకు సునీతను అడ్డుపెట్టుకుందని సీరియస్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఏబీఎన్ చానల్ యజమాని వేమూరి రాధాకృష్ణను సునీత కలవడాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆ పత్రిక, చానల్ తమ పార్టీకి (వైసీపీ) వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటాయని గుర్తు చేశారు. సునీత ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఇవన్నీ రుజువు చేస్తున్నాయని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పేర్కొన్నారు. తండ్రిని హత్య చేసిన దస్తగిరికి సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి మద్దతిస్తున్నారని దేవిరెడ్డి ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే 2019, మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు పీఏ మూలి వెంకటకృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్ ఎలా వ్యవహరించారు? వివేకా కుటుంబ సభ్యులకు ఏం పంపారు? సంఘటనా స్థలంలో వివేకా రాసిన లేఖను సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదు తదితర అంశాలను ప్రస్తావిస్తూ… ఇవన్నీ డాక్టర్ సునీత, ఇతర కుటుంబ సభ్యులు కుట్రపూరితంగా చేశారని దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో వివరించారు.
దేవిరెడ్డి శంకర్‌రెడ్డి రాసిన లేఖను పరిశీలిస్తే…టీడీపీ నేతలతో కలిసి తండ్రి హత్యకు డాక్టర్ సునీత, ఇతర కుటుంబ సభ్యులు కుట్రపన్నినట్టు అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.