సొట్టబుగ్గల సుందరి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింటా 46 ఏళ్లలో కవలలకు తల్లి అయ్యారు. ఈ శుభవార్తను గురువారం తన ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. సరోగసి విధానంలో కవల పిల్లలకు తల్లైనట్లు ఆమె వెల్లడించారు.
ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్ ఏంటంటే… ‘మీ అందరితో ఓ సంతోషకర విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సరోగసి విధానంలో కవల పిల్లల్ని పొందినందుకు నేను, నా భర్త జీన్ గూడెనఫ్ ఎంతో ఆనందిస్తున్నాం. జై, జియాలను మా జీవితాల్లోకి ఆహ్వానించడం మాకెంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది’ అని ప్రీతి తనదైన స్టైల్‌లో వివరాలు వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం లాస్‌ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు. బాలీవుడ్‌లో ‘దిల్ సే’ చిత్రంతో ప్రీతి వెండితెరకు మొదటిసారిగా ఆమె పరిచయమయ్యారు. తెలుగులో ‘ప్రేమంటే ఇదేరా’తో మొదటిసారి ఆమె హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. సినీ, క్రికెట్ అభిమానులకు ఆమె సుపరిచితురాలు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమానిగా ప్రీతిజింటా ఐపీఎల్ మ్యాచ్‌లలో ప్రత్యక్షమయ్యేవారు.
తన టీంను ప్రోత్సహించడంలో ప్రీతి తర్వాతే ఎవరైనా. తన జట్టు విజయం సాధిస్తే స్టేడియంలోకి పరుగునా వెళ్లి హంగామా చేసేవారామె. జట్టులో బాగా ఆడిన క్రీడాకారులను హగ్ చేసుకుంటూ… ప్రోత్సహించేవారు. కొంత కాలంగా క్రీడాభిమానులను కనిపించకుండా పోయిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి… తాజాగా ఓ శుభవార్తతో ముందుకు రావడం విశేషం.