కుప్పం ఎఫెక్ట్ః జ‌గ‌న్‌లో ఎప్పుడూ లేని కోరిక‌!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులే త‌ప్ప శ‌త్రువులు ఉండర‌ని చెబుతుంటారు. అలాంటి సంస్కార రాజ‌కీయాల‌కు ఏనాడో తిలోద‌కాలు ఇచ్చారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మొద‌టి నుంచి…

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులే త‌ప్ప శ‌త్రువులు ఉండర‌ని చెబుతుంటారు. అలాంటి సంస్కార రాజ‌కీయాల‌కు ఏనాడో తిలోద‌కాలు ఇచ్చారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మొద‌టి నుంచి అత్యంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్‌ను అత్యంత దుర్మార్గుడిగా చిత్రీక‌రిస్తూ ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని చంద్ర‌బాబు ఆడుతున్న డ్రామాలు అన్నీఇన్నీకావు.

సోష‌ల్ మీడియా రావ‌డంతో ఎల్లో మీడియా వికృత‌చేష్ట‌ల‌కు క్ర‌మంగా కాలం చెల్లుతోంది. అంతేకాదు, ఎల్లో బ్యాచ్‌పై రివ‌ర్స్ అటాక్ మొద‌లైంది. జ‌గ‌న్‌పై ఎల్లో మీడియా జుగుప్సాక‌ర రాత‌ల వెనుక దురుద్దేశాల‌ను సోష‌ల్ మీడియా ఎప్ప‌టిక‌ప్పుడు దీటుగా తిప్పి కొడుతోంది. 

త‌న వ్య‌క్తిత్వంపై బుర‌ద‌చ‌ల్లుతూ పైశాచిక ఆనందం పొందుతున్న చంద్ర‌బాబు ముఖం చూసేందుకు జ‌గ‌న్ ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి జ‌గ‌న్ తాజాగా చంద్ర‌బాబును చూడాల‌నే కోరిక‌ను బ‌య‌ట పెట్టారు. దీనికి స్పీక‌ర్ త‌మ్మినేని అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఏసీ స‌మావేశం వేదికైంది.

అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ఇవాళ ఉద‌యం త‌మ్మినేని అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన బీఏసీ స‌మావేశంలో సీఎం మాట‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పంలో మున్సిపాలిటీని వైసీపీ హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం, అలాగే నెల్లూరు కార్పొరేష‌న్‌ను క్లీన్‌స్వీప్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎప్పుడూ లేని కోరిక‌ను వెల్ల‌డించార‌ని  వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

ఈ ఆనందంలో జ‌గ‌న్ మాట్లాడుతూ  ‘అసెంబ్లీకి చంద్రబాబును తీసుకురండి. కుప్పం ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనను చూడాలని ఉంది’ అని టీడీపీ శాన‌స‌స‌భ ప‌క్ష ఉప‌నేత అచ్చెన్నాయుడుతో జ‌గ‌న్ అన్న‌ట్టు స‌మాచారం. ఇందుకు అచ్చెన్నాయుడు స్పందిస్తూ గెలుపోటములు మామూలేనని, చంద్రబాబు కచ్చితంగా సభకు వస్తారని చెప్పుకొచ్చారు. 

తాము కోరుకుంటున్న‌ది కూడా అదే అని జ‌గ‌న్ న‌వ్వుతూ అన్న‌ట్టు తెలిసింది. అచ్చెన్నాయుడు కాస్త నొచ్చుకున్నార‌ని స‌మాచారం. ఇదిలా వుండ‌గా కుప్పంతో పాటు ఇత‌ర మున్సిపాల్టీల్లో ఓట‌మిపై చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు.