విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగుతెరపై రాయలసీమ మాండలికానికి ఓ గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాష్ రెడ్డి. విలన్ గా పరిచయమై, కమెడియన్ గా కూడా రాణించిన జయప్రకాష్ రెడ్డి వయసు 73 సంవత్సరాలు.
స్టేజ్ ఆర్టిస్టుగా ఎన్నో నాటకాలు వేసిన జయప్రకాష్ రెడ్డి.. 1988లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అప్పట్నుంచి ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషిస్తూ వచ్చారు. అయితే 1999లో వచ్చిన సమరసింహారెడ్డి ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు ప్రేమించుకుందా రా అనే సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్రకు కూడా మంచి పేరు వచ్చినప్పటికీ.. సమరసింహారెడ్డితో ఆయన విలనిజం పూర్తిస్థాయిలో పరిశ్రమకు తెలిసొచ్చింది. ఆయన పేరు మారుమోగిపోయింది.
ఇక అక్కడ్నుంచి ఎన్నో చిత్రాల్లో ఆయన రాయలసీమ మాండలికంలో సీరియస్ విలనిజం పండించారు. ఇలా ఓవైపు సీరియస్ విలన్ పాత్రలు చేస్తూనే, సడెన్ గా కామెడీ ఆర్టిస్టుగా మారిపోయారు జయప్రకాష్ రెడ్డి. ఇండస్ట్రీ అంతా ముద్దుగా జేపీ అని పిలుచుకునే ఈ నటుడు.. ఢీ, సిద్ధూ ఫ్రమ్ శీకాకుళం, కిక్, గబ్బర్ సింగ్, ఎవడి గోల వాడిది, కబడ్డీ కబడ్డీ లాంటి ఎన్నో సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో కామెడీ పండించారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్లలో జన్మించారు జయప్రకాష్ రెడ్డి. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేశారు. స్టేజ్ ఆర్టిస్టుగా ఎన్నో నాటకాలు వేశారు. బ్రహ్మపుత్రుడు సినిమాతో ఆయన సినీకెరీర్ మొదలైంది.
జేపీ నటించిన ఆఖరి చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కు తండ్రిగా జేపీ కనిపించారు. కేవలం రెండే రెండు డైలాగ్స్ తో సూపర్ కామెడీ పండించారు.