హీరోయిన్ మెహ్రీన్, ఆ మధ్య తన పెళ్లిని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. లెక్కప్రకారం హర్యాణా మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఈ నెల్లోనే ఆమె పెళ్లి జరగాలి. కానీ ఎంగేజ్ మెంట్ తోనే అది ఆగిపోయింది. పెళ్లికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారు. పెళ్లి రద్దు అంటూ అధికారికంగా ప్రకటించి, గుంభనంగా తప్పుకున్నారు.
ఆ తర్వాత సినిమాలు, ఫొటోషూట్లలో బిజీ అయిపోయింది మెహ్రీన్. అలా ఆమె తన పెళ్లి కాన్సిల్ అయిన ఘటన నుంచి తొందరగానే బయటపడిందని అంతా అనుకున్నారు. కానీ మెహ్రీన్ మనసులో మాత్రం ఆ బాధ ఇంకా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె పెడుతున్న పోస్టులు చూస్తే ఈ విషయం అర్థమౌతోంది.
తాజాగా మెహ్రీన్ ఓ పోస్ట్ పెట్టింది. “నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉంది, నీలా నువ్వు ఉన్నందుకు చింతించకు. నీపై నువ్వు పూర్తి ఆధిపత్యంతో ఉండు. ఇలా ఉండడం వల్ల సరైన వ్యక్తులు నీ జీవితంలోకి వస్తారు, చెడు వ్యక్తులు నీ నుంచి దూరంగా జరుగుతారు.” అంటూ ఓ కొటేషన్ ను పెట్టింది మెహ్రీన్.
ఈ కొటేషన్ చూసిన తర్వాత అంతా మెహ్రీన్ గత చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆమె తన పెళ్లి రద్దయిన విషయం నుంచి ఇంకా బయటకొచ్చినట్టు లేదని కొందరు అంటుంటే.. జీవితంలో మరో వ్యక్తిని ఆమె దూరం పెట్టినట్టుందని, అందుకే ఇలా ఆవేదనతో ఈ పోస్ట్ పెట్టిందని మరికొందరు అంటున్నారు.
మెహ్రీన్ మాత్రం ఈ కామెంట్స్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త ఫొటోషూట్ స్టిల్స్ పెడుతూనే, మరోవైపు ఇలా భావోద్వేగ కొటేషన్లను షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఎఫ్3 సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది.